ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2020-09-30T05:52:15+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌కి తెచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా ఇంటింటి సర్వేలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

ఇంటింటి సర్వే

ధరణి పోర్టల్‌లో ఆస్తుల సమాచారం  

నాన్‌ అగ్రికల్చర్‌ భూముల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది


మంచిర్యాల, సెప్టెంబరు 29: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌కి తెచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా ఇంటింటి సర్వేలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆస్తుల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. నివాస స్థలాలకు సంబంధించి నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ, అసైన్డ్‌, పరంపోగు భూముల్లో నిర్మించిన ఇళ్లకు సైతం అనుమతులు జారీ చేయనున్నారు. దీంతో క్రయ, విక్రయాల సమయాల్లో ఇబ్బందులు తలత్తెకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయనున్నారు. దీంతో ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో గణన ప్రారంభం కాగా దసరా నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను రశీదు, కరెంటు బిల్లు, నీటి పన్ను రశీదు, యజమాని ఫొటో, గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఆహార భద్రత కార్డు, జన్‌ధన్‌ బ్యాంకు ఖాతా వివరాలు, జాబ్‌కార్డు, ఆసరా పింఛన్‌, కుటుంబ సభ్యుల వివరాలు, సెల్‌ఫోన్‌ నంబర్లు, తదితర 48 అంశాల్లో వివరాలు సేకరిస్తున్నారు. 


నూతన సర్వేతో..

నూతన సర్వేతో నివాస స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నివాస స్థలాల సమస్య గ్రామ పంచాయతీలకంటే మున్సిపాలిటీలలోనే తీవ్రంగా ఉంది. ఆయా కుటుంబాలకు మేలు జరుగనుంది. ప్రభుత్వ, ఆబాది, పరంపోగు, అసైన్డ్‌ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా అనుమతులు లేవు. ఆస్తుల వివరాలు అన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తుండడంతో సమాచారం మొత్తం అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయా ఆస్తుల క్రయ, విక్రయాల సందర్భంగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సదరు ఆస్తులపై అత్యవసర సమయాల్లో బ్యాంకు రుణం పొందేందుకు సైతం అవకాశం ఉండదు. ప్రభుత్వం చేపట్టిన నూతన చట్టం ప్రకారం సమస్యలకు పరిష్కారం లభించనుండగా, ఆన్‌లైన్‌లో ఇంటి నెంబర్లు కేటాయించనున్నారు. దీంతో భవిష్యత్తులో ఆయా ఇండ్లకు సంబంధించి క్రయ, విక్రయాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. 


ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకూ..

నూతన చట్టం ప్రకారం దశాబ్దాల కింద ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు సైతం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల ద్వారా అనుమలుతు లభించనున్నాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సర్వే నెంబరు 87 కింద దాదాపు 170 ఎకరాల పరంపోగు భూములు ఉన్నాయి. రైల్వే స్టేషన్‌ మొదలుకొని ఓవర్‌ బ్రిడ్జి వరకు, వాటర్‌ ట్యాంకు రోడ్డులో ఉన్న పరంపోగు భూముల్లో పెద్ద ఎత్తున నివాస గృహాలు వెలిశాయి. వాటిలో ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వపరమైన అనుమతులు లేవు. ఆయా స్థలాల్లో పెద్ద పెద్ద భవనాల నిర్మాణం చేపట్టారు. అలాగే గ్రామ పంచాయతీల్లో ఆబాదీ స్థలాల్లో నిర్మించిన ఇళ్ల సంఖ్య కూడా అధికంగా ఉంది. దశాబ్దాల క్రితం ప్రజలు స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ సమయంలో వారికి ఇంటి అనుమతులు, ఇతరత్రా సదుపాయాలు పెద్దగా అవసరం లేకపోవడంతో సమస్య ఎదురుకాలేదు. వాటన్నింటికీ ప్రస్తుత చట్టం ద్వారా అన్ని రకాల అనుమతులు లభించనున్నాయి. 


 50వేల కుటుంబాలకు లబ్ధి..

నూతన చట్టం ద్వారా జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాదాపు 50వేల పై చిలుకు కుటుంబాలకు లబ్ది జరుగనుంది. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 6,775 ఇళ్లు ఉండగా వాటిలో 4,050 ఆబాది భూముల్లో నిర్మించారు. మరో 800పై చిలుకు ఇండ్లు అసైన్డ్‌ భూముల్లో ఉన్నాయి. అలాగే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 11,005 ఇళ్లు ఉన్నాయి. ఇందులో సింగరేణి స్థలాల్లో 4,406 ఇళ్లు ఉన్నాయి. సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న వారికి జీఓ76 ద్వారా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్థలాల క్రమబద్థీకరణ కోసం 3,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 900 మంది ఎలాంటి ఆధారాల లేక దరఖాస్తు చేసుకోలేక పోయారు. మరో 375 ఇండ్లు క్వార్టర్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో నిర్మితమై ఉన్నాయి. అలాగే 274 ఇండ్లు అసైన్డ్‌ భూముల్లో ఉన్నాయి. మందమర్రి మున్సిపాలిటీలో 1/70 చట్టం అమల్లో ఉండగా గిరిజనేతరుల ఇళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. మందమర్రిలో మొత్తం 13,857 ఇండ్లు ఉండగా, వాటిలో 541 ఇండ్లు గిరిజనులకు చెందినవి. కాగా మిగతావి గిరిజనేతరులకు చెందినవి. అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 28వేల పై చిలుకు ఇళ్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 3వేల పై చిలుకు ఇళ్లు ప్రభుత్వ స్థలాలు, పరంపోగు, అసైన్డ్‌ భూముల్లో ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. అక్కడ 2,500 ఇళ్లు ప్రభుత్వ, పరంపోగు, అసైన్డ్‌ భూముల్లో ఉన్నట్లు సమాచారం. అలాగే నస్పూర్‌, లక్షెట్టిపేట మున్సిపాలిటీల పరిధిలో సైతం పెద్ద సంఖ్యలో ఇళ్లు, ప్రభుత్వ, పరంపోగు, అసైన్డ్‌ భూముల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన చట్టం ద్వారా వాటికన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది. 


మహత్తర కార్యక్రమం..ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

నివాస గృహాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మహత్తర కార్యక్రమం చేపట్టింది. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు నూతన చట్టం ద్వారా పరిష్కారం లభించనుంది. ప్రతి ఇంటి వివరాలు ధరణి పోర్టల్‌లో పొందు పరుచనున్నారు. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ, విక్రయాలు జరుపుకొనేందుకు అవకాశం ఉంటుంది.  బ్యాంకు రుణాలు సైతం ఇబ్బందులు లేకుండా అందుతాయి. 

Updated Date - 2020-09-30T05:52:15+05:30 IST