‘ధరణి’ తిప్పలు

ABN , First Publish Date - 2020-11-29T04:49:07+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్‌లో భూముల కొనుగోలు, అమ్మకాలు సజావుగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

‘ధరణి’ తిప్పలు

  • కుప్పలు తెప్పలుగా జీపీఏలు, ఏజీపీఏలు 
  • మ్యుటేషన్లుకు నోచుకోని పాత సేల్‌డీడ్స్‌ 
  • కరెక్షన్స్‌, డీఎస్‌ పెండింగ్‌లు, ఆర్‌ఎస్‌ఆర్‌తో ఇబ్బందులు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఈ ప్రక్రియ ద్వారానే జరగనున్నాయి. కానీ ధరణిలో వస్తున్న సమస్యలపై సమగ్ర  అధ్యయనం చేయకుండానే దీనిని ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. ధరణిలో భూములకు సంబంధించిన ఏమైనా కరెక్షన్‌ చేయడానికి వీలుకావడం లేదని అధికారులు, భూ అమ్మకం, కొనుగోలుదారు తలలు పట్టుకుంటున్నారు.


మోమిన్‌పేట : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్‌లో భూముల కొనుగోలు, అమ్మకాలు సజావుగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ ధరణిలో సమగ్రత లోపించింది. మధ్యంతర ఉత్తర్వులు ఎన్ని జారీచేసినా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. ధరణిలో సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. వాటిని అమలు చేయలేక అధికారులు సతమతమవుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్లలో ఎక్కువగా ఏజీపీఏ, జీపీఏలు, మార్ట్‌గేజ్‌ల సంగతి తెలియక అధికారులు, భూ యజమానులు సతమతమవుతున్నారు. మోమిన్‌పేట మండలంలో ఇలాంటి సమస్యలు వందల సంఖ్యలో ఉన్నాయి. ధరణి ఆధారిత రిజస్ట్రేషన్లు, ఆటోమెటిక్‌  మ్యుటేషన్లతో పహాణిలో కనిపించకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. పట్టాదారు పాసుపుస్తకం ఉంటే తప్ప మరొకరికి విక్రయించే వెసులుబాటు లేదు. ఏజీపీఏ, జీపీఏలు చేయించుకున్నా కొనుగోలుదారులకు, హక్కుదారులకు కనీసం మ్యుటేషన్‌, సేల్‌డీడ్స్‌ చేయించుకునే అధికారం లేదు. వారిపేర్లు ధరణిలో నమోదుకు నోచుకోలేదు. పాత హక్కుదారుల పేర్లు నమోదు చేశారు. ఏఏ భూముల్లో ఏజీపీఏ, జీపీఏ చేశారో రెవెన్యూ అధికారులకు తెలియదు. ఆ సమాచారం కూడా తహసీల్దార్‌ దగ్గర కూడా లేదు. ఏజీపీఏ, జీపీఏల సమాచారం సేల్‌డీడ్స్‌లోనే నిక్షిప్తమై సబ్‌రిజిస్ట్రార్‌కు మాత్రమే తెలుసు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు భూమిని పాత హక్కుదారుడే మరోసారి అమ్ముకుంటే నిలువరించే వ్యవస్థ ధరణిలో లేదు. తెలిసినా అడ్డుకునే అధికారం తహసీల్దార్లకు లేకుండా చేశారు. సీఎంవో సీనియర్‌ ఐఏఎస్‌, సీసీఎల్‌ఏలు, ఆర్డీవో, కలెక్టర్లకు చెప్పినా ఫలితం లేదంటున్నారు. 


రియల్టర్లే అధికం

రెండు దశాబ్దాలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. కొందరు సాగుభూములు యథాతథంగా ఉంచి కొందరికి ఏజీపీలు, జీపీఏలుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పరిపాటి. ఆ తర్వాత అమ్మడం, కొనుగోలు చేయడం ధరణి పోర్టల్‌ రాకముందు ఈ వ్యవహారాలు జరిగేవి. ఇప్పుడేమో వారు అమ్మేందుకు హక్కులు లేకుండా చేశారు. ఎవరు భూమి అమ్మాలనుకున్నా వారికి కొత్తపట్టాదారు పుస్తకం ఉండాలి. అంటే తమకు అమ్మిన రైతుల దగ్గరికి వెళ్లి మరోసారి సంతకాలు చేయించాలి. వారు తహసీల్దార్‌ దగ్గరికి వచ్చి అమ్మినట్లు చెప్పాలి. ఈ తతంగం రియల్టర్లకు తలనొప్పిగా మారింది. భూ ములు అమ్మిన రైతులకు పట్టాపాసుపుస్తకాలు లేకుంటే ఏజీపీఏ, జీపీఏ దారులకు రైతులు చుక్కలు చూపిస్తారు. అమ్మినవారికి పాసుపుస్తకం ఉంటే కొన్నవారికి హక్కులు లభిస్తాయి. ధరణికి ముందు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా కొనుగోలుదారులకు కష్టాలు తప్పేటట్లు లేదు. ఏజీపీఏలు, జీపీఏ దారులకు కాస్త సమయం ఇచ్చిన తర్వాత ధరణి రిజిస్ట్రేషన్లు అమలులోకి తీసుకొస్తే బాగుండేదని పలువురు ఆరోపిస్తున్నారు. 


కుప్పలుగా పాత విరాసత్‌లు

మోమిన్‌పేట మండలపరిధిలోని 28గ్రామాల్లో కుప్పలు తెప్పలుగా పాత విరాసత్‌లు పేరుకుపోయాయి. రైతులు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదు. తాత, తల్లిదండ్రులు మరణిస్తే ఆ భూమి యొక్క మనుమళ్లకు, కుమారులకు, కూతుళ్లకు పొందే హక్కు ఉంటుంది. కానీ ధరణితో పాత విరాసత్‌కు సంబంధించిన వివరాలు లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సేల్‌డీడ్‌ అయిన ధ్రువపత్రాలు యజమాని మరణిస్తే వారి కుటుంబ యజమానులు పొందే హక్కు లేకుండా పోయింది. 


ఏజీపీఏల, జీపీఏ..

ఏజీపీఏ అంటే భూమి అమ్మిన వారికి కొనుగోలుదారుడు పూర్తిగా డబ్బులు చెల్లిస్తారు. ఆరు శాతం స్టాంపు డ్యూటీ కడతారు. ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కదు. జీపీఏ అంటే యజమాని భూమిని అమ్మేందుకు ఓ ఏజెంటును నియమించుకుంటాడు. యజమాని చనిపోతే జీపీఏ రద్దవుతుంది. 1 శాతం మాత్రమే స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తారు. అగ్రరాజ్యంలో యజమాని సొంతంగా భూములను విక్రయించడానికి వీలులేదు. ఎవరికైనా అధికారం కట్టబెట్టాలి. ఇక్కడ అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏజపీఏలు, జీపీఏలు ఉండేది. ఇప్పుడు ఉనికి కోల్పోయిందని పలు అధికారులు అంటున్నారు.


ఆర్‌ఎ్‌సఆర్‌ అంటే.. 

ఒక సర్వేనంబరులో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి వస్తే ఆర్‌ఎ్‌సఆర్‌ అంటారు. గ్రామాల్లో ఉన్న భూమికంటే ఎక్కువ భూమి పడటంతో దానిని సరిచేయడంలో అధికారులు విఫలమవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణిలో ఆర్‌ఎ్‌సఆర్‌ చేయడానికి వీలు లేదు.

Updated Date - 2020-11-29T04:49:07+05:30 IST