దండం పెడతాం... ధాన్యం కొనండయ్యా..!

ABN , First Publish Date - 2021-06-24T04:35:13+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవాళ్లు లేక, గిట్టుబాటు ధర రాక ధాన్యం పండించిన రైతులు అవస్థలు పడుతున్నారు.

దండం పెడతాం...  ధాన్యం కొనండయ్యా..!
నెల్లూరు రూరల్‌ మండలంలోని గ్రామాలలో ధాన్యను నిల్వలు

నాడు పుట్టి రూ.20వేలు.. నేడు కొనేవారేరా!?

ఇళ్లు, కయ్యల్లోనే నిల్వలు

అమ్ముకొనేందుకు అన్నదాతల అవస్థలు


నెల్లూరు రూరల్‌ / ఏఎస్‌ పేట, జూన 23 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవాళ్లు లేక, గిట్టుబాటు ధర రాక ధాన్యం పండించిన రైతులు అవస్థలు పడుతున్నారు. చేతికి అందివచ్చిన పంటను ఇళ్లు, కయ్యల్లోనే పట్టలు కప్పి నిల్వ చేసుకుంటున్నారు. షుగర్‌ లెస్‌  రకం ధాన్యానికి మంచి గిరాకీ ఉండటం, గతేడాది తెలంగాణ మసూర ధాన్యం పుట్టి సుమారు 20వేల వరకు ఉండటంతో ఈ ఏడాది ఏఎస్‌పేట మండలంలో సుమారు 1800 ఎకరాలలో సాగుచేశారు. ఎంతో కష్టపడి పంట పండించినా పుట్టి రూ.11వేలకు కూడా అడిగేవారు కరువయ్యారని అన్నదాతలు ఆవేదన చేందుతున్నారు.


పెట్టుబడులు వచ్చేనా!


ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఎకరాకు సుమారు రూ.30-40 వేల వరకు వెచ్చించి సాగు చేశారు. పంటలు పండి కోతలు ప్రారంభ దశలో పుట్టి 15 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.12వేలు పలుకుతోంది. కనీసం ఈ ఆ ధరకు కూడా కొనేవాళ్లు కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం అమ్మినా పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్ధితి లేదని,పెట్టుబడులకు వడ్డీలు పెరిగి పొతున్నాయి అని వాపోతున్నారు.


నిల్వ చేయలేక.. 


పండించిన పంటను నిల్వ చేసుకోవడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. సౌకర్యం ఉన్నవాళ్లు ఇళ్లలో నిల్వ చేస్తే కొందరు కయ్యల్లోనే పట్టలు కప్పి ఉంచారు. వర్షం కురిస్తే చేతికి అందిన పంట నాశనం అవుతుందని ఆవేదన చెందుతున్నారు.


నెల్లూరురూరల్‌ : నెల్లూరు రూరల్‌ మండలంలో సుమారు 25 వేల ఎకరాలలో బీపీటీ 5204, ఎల్‌ఎల్‌ఆర్‌ 34449, ఆర్‌ఎనఆర్‌ 15048 రకాలను రైతులు సాగులోకి తీసుకువచ్చారు. ఎకరాకు మూడు నుంచి మూడున్నర పుట్లు మాత్రమే దిగుబడి రావడంతో సగానికిపైగా రైతులు అప్పటికప్పుడే అటు సర్కారు కేంద్రాలకు, ఇటు ప్రైవేట్‌ మిల్లర్లకు ధాన్యం అమ్మేశారు. అప్పట్లో బీపీటీ పుట్టి రూ.14,500లకు, ఎనఎల్‌ఆర్‌ రకం రూ.13 వేలకు, ఆర్‌ఎనఆర్‌ రూ.16 వేలకు మాత్రమే ప్రైవేట్‌ మిల్లర్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ కిందకు రావడంతో పుట్టి రూ.16,031లకు ధర పలికినా అతి తక్కువ మంది అమ్ముకున్నారు. సగానికిపైగా రైతులు తమ ధాన్యాన్ని పొలాలు, ఇళ్లలో నిల్వ చేసుకుని ధరలను బట్టి అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.  


పెరుగుదలపై ఎదురుచూపు 


మన జిల్లాలోని ధాన్యాన్ని అత్యధికంగా చెన్నైల్లోని రెడ్‌హిల్స్‌ కేంద్రంగా జాతీయ మార్కెట్‌కు తరలిస్తారు. ప్రస్తుతం అక్కడున్న ధరల ప్రకారం బీపీటీ రకం పుట్టి రూ. 16,500, ఆర్‌ఎనఆర్‌ రూ.18 వేలు ధర ఉంది. ఇందులో ఆర్‌ఎనఆర్‌ మరో రూ.500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు రైతాంగం, ప్రైవేట్‌ దళారులు లెక్కకడుతుండగా, బీపీటీ రకం రూ.18 వేల వరకు వస్తుందని ఆశిస్తున్నారు. షుగర్‌ లెస్‌ రకాన్ని నిల్వ చేసుకున్న వారంతా క్రమేణా అమ్మేస్తుండగా బీపీటీ రకాన్ని దాచిన రైతులు ధరల అనుకూలతను బట్టి అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. 



కొనేవారు లేరు


తెలంగాణ మసూర పుట్టి 20వేలు ఉండటంతో ఎకరాకు రూ.30-40వేలు ఖర్చు చేసి 5ఎకరాలలో సాగు చేశా. తీరా పంట చేతికి వచ్చాక పుట్టి రూ.12వేలకు అడుతున్నారు. ఆ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా రావు.

- పఠాన ఖజామొద్దీన, గండువారిపల్లి, ఏఎస్‌పేట మండలం



Updated Date - 2021-06-24T04:35:13+05:30 IST