స్వచ్ఛందంగా బడుల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-18T04:37:36+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనందిం చడానికి

స్వచ్ఛందంగా బడుల అభివృద్ధి
చింతపట్ల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలు నిర్మిస్తున్న మూత్రశాలలు, మరుగుదొడ్లు

  • ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని బాగు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు 
  • విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వసతుల కల్పన

యాచారం, జూన్‌ 17 : ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనందించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముం దుకు వస్తున్నాయి. సర్కార్‌ బడులను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి అండగా ఉంటున్నాయి. సొంత ఖర్చులతో బడులకు అవసరమైన వసతులను కల్పిస్తూ పలువురితో శభాష్‌ అనిపించుకుంటున్నాయి. 

     యాచారం మండల పరిధిలోని మేడపల్లి, యాచారం, చింతపట్ల ఉన్నత పాఠశాలలను నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాయి. ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. మేడిపల్లి ఉన్నత పాఠశాల, యాచారం మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలను నగరానికి చెందిన కన్సర్న్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ, చింతపట్ల ఉన్నత పాఠశాలను జేసీఐ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకొని పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు నీటి వసతిని కల్పిస్తున్నారు. తరగతి గదుల్లో విద్యుత్‌వసతి, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించి కొత్త భవనాల వలే మార్చారు. తరగతి గదుల్లో విద్యార్థులను ఆకర్శించే విధంగా వివిధ రకాల బొమ్మలు వేయించడంతోపాటు ఫర్నిచర్‌ వసతిని కల్పించారు. అదేవిదంగా తరగతి గదుల్లో బ్లాక్‌బోర్డులను ఏర్పాటు చేయించారు. చింతపట్ల, మేడిపల్లి ఉన్నత పాఠశాలల్లో వాటర్‌ ఫిల్టర్‌ వసతి కల్పించారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా నోట్‌ పుస్తకాలు కూడా తామే అందిస్తామని పాఠశాలలను దత్తత తీసుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ చైర్మన్లకు సూచిస్తున్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు కన్సర్న్‌ స్వచ్చందసంస్థ ప్రతినిధులు ఆటవస్తువులను ఉచితంగా అందించారు. విద్యార్థులకు నూతన  ప్లేట్లు కూడా అందించారు. అవసరమైతే వాలంటీర్లను నియమించి బోధనలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఒకప్పుడు తామంతా సరైన వసతులు లేని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, అందుకే ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు ఆ ఇబ్బందులు ఎదురు కావొద్దనే ఉద్దేశంతో సౌకర్యాల కల్పనకు తాము ముందుకు వచ్చామని ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెంకటేష్‌. మురళీ తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలను బాగు చేస్తే వందలాది మంది నిరుపేద విద్యార్థులకు మేలు జరుగుతుందనే లక్ష్యంతో ఆయా గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకున్నామని చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు సర్కార్‌ బడుల బాగుకోసం పాటుపడటం చాలా సంతోషకరమని సర్పంచులు శ్రీనివా్‌సరెడ్డి, సరితారెడ్డి చెప్పారు. పలు గ్రామాల్లో శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవి నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 


స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయం 

యాచారం, చింతపట్ల, మేడిపల్లి పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. పాఠశాలల గదులను ఎంతో సుందరంగా మార్చారు. శ్రమపడి బడులను బాగు చేయడంతోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడం చాలా సంతోషం. 

- కొప్పు సుకన్యబాషా, యాచారం ఎంపీపీ 




Updated Date - 2022-06-18T04:37:36+05:30 IST