గంజాయి మొక్కల ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-25T05:19:50+05:30 IST

మండలంలోని ఎంకా, ఆందోలి ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఆదివారం గుర్తించారు.

గంజాయి మొక్కల ధ్వంసం
పోలీసులు దహనం చేస్తున్న గంజాయి మొక్కలు

ఉట్నూర్‌, అక్టోబరు 24: మండలంలోని ఎంకా, ఆందోలి ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఆదివారం గుర్తించారు. బీమన్న సాగు చేస్తున్న 20 మొక్కలను, ఉత్తం సాగు చేస్తున్న పది మొక్కలను, గోపాల్‌ సాగు చేస్తున్న మూడు మొక్కలను పంట చేలల్లోనే  ధ్వంసం చేసినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. సదరు రైతులపై ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ మంగ, ఎస్సై రాములు తెలిపారు. నిషేధించిన గంజాయిని సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ మంగ హెచ్చరించారు. 

బేల: మండలంలోని ఖడ్కీ, గణేష్‌పూర్‌లో రైతులు పంట చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జంగు, భీంరావుల పత్తి పంట చేనులో అంతర్‌పంటగా ఉన్న 25గంజాయి మొ క్కలను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్‌ శాఖాధికారులకు అప్పగించామని ఎస్సై కళ్యాణ్‌ పేర్కొన్నారు.

సిరికొండ: మండలంలోని మల్లాపూర్‌ గ్రామపంచాయతీలోని ధర్మసాగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో రహస్యంగా పెంచుతున్న గంజాయి మొక్కలను దహనం చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్సై ఎన్‌. నాగ్‌నాథ్‌, ఉట్నూర్‌ ఎక్సైజ్‌ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరికొండ మండలంలోని ధర్మసాగర్‌ గ్రామానికి చెందిన మోతివార్‌ రాంచందర్‌, ఆత్రం అనసూయ, సాబ్లె బద్దు, సాబ్లె రమేష్‌ అనే వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం ఎక్సైజ్‌ శాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని దహనం చేయడం జరిగిందని తెలిపారు. సంబందిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎక్సైజ్‌ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-25T05:19:50+05:30 IST