నిషేధం ఉన్నా...సోమశిలలో చేపల వేట

ABN , First Publish Date - 2021-08-04T05:13:03+05:30 IST

సోమశిలలో చేపల మాఫియా బరి తెగిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా చేపలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటోందనే ఆరోపణలున్నాయి.

నిషేధం ఉన్నా...సోమశిలలో చేపల వేట
సోమశిలలో చేపల వేటకు వెళుతున్న జాలర్లు

జూలై నుంచి ఆగస్టు వరకు చేపల వేట నిషేధం

చోద్యం చూస్తున్న మత్స్య శాఖాధికారులు

అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు


కడప, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సోమశిలలో చేపల మాఫియా బరి తెగిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా చేపలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటోందనే ఆరోపణలున్నాయి. అటవీ మార్గంలో అనుమతులు లేకున్నా దర్జాగా వాహనాల్లో వెళ్లి చేపలు తరలిస్తున్నారు. మత్స్యశాఖాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మాఫియా చెలరేగిపోతోందనే విమర్శలున్నాయి. గోపవరం, అట్లూరు, నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు మండలాల  పరిధిలో సోమశిల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ఉంది. ప్రతి ఏటా జూలై, ఆగస్టు మాసాల్లో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ ఏడాది కూడా ఈనెల 31వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంది. ఈ కాలంలో చేప గుడ్డు దశలో ఉండడంతో వేటను నిషేధిస్తుంటారు. అయితే కొందరు స్థానికులతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి జాలర్లను తీసుకువచ్చి వేట కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు తనిఖీలకు రారన్న ధైర్యంతో చేపల మాఫియా ఇష్టారాజ్యంగా మత్స్య సంపదను దోచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. 


ఎక్కడెక్కడ ?

గోపవరం మండలం, నందలూరు మండలంలోని వెంకటరాజంపేట, కొమ్మూరు, కోనాపురం, చింతకాయపల్లె, ఒంటిమిట్ట మండలంలోని బెస్తపల్లె, మదిలేగడ్డ, కొండమాచుపల్లె, కోటపాడు, కుడమలూరు, బయనపల్లె, చిన్నపరెడ్డిపల్లె, గున్నమేరు, కలికిరి, కొరముట్లపల్లె, గోపవరం, అట్లూరు మండలాల పరిధిలో అక్రమ చేపల వేట సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇదే ప్రాంతాలకు చెందిన జాలర్లు అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకుని వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ 20 నుంచి 30 టన్నులకుపైగా చేపలను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.


పటిష్ట నిఘా

చేపల మాఫియా పటిష్ట నిఘాతో చేపల వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలకు వాటాలు ఇచ్చి వారి ద్వారా అధికారులు దాడులు చేయకుండా మేనేజ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు కూడా చేపల వేట విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొత్తవారు ఎవరైనా ఆ ప్రాంతంలో కనిపిస్తే వెంటనే మాఫియాలోని ముఖ్య నేతలకు వారి సమాచారం అందిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. 


దాడులు చేస్తున్నాం 

-  నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్‌, మత్స్యశాఖ 

సోమశిలలో చేపల వేటను అరికట్టేందుకు దాడులు చేస్తున్నాం. ఇటీవల గోపవరం, కోనాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. ఆ ప్రాంతంలో ఉన్న గుడిసెలను ఇటీవలే అటవీ శాఖాధికారులు తొలగించారు. చేపల వేట జరగకుండా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. 


 



 



Updated Date - 2021-08-04T05:13:03+05:30 IST