ఇంధన భారం రూ.4.53 కోట్లపైనే!

ABN , First Publish Date - 2021-03-04T05:25:19+05:30 IST

ఇంధన ధరల పెంపు అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరికి అవసరమైన గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు గడిచిన నెల రోజుల్లో విపరీతంగా పెరిగాయి.

ఇంధన భారం  రూ.4.53 కోట్లపైనే!

ఇక్క గ్యాస్‌ గుదిబండే రూ.4.02 కోట్లు

ఒక్క రోజుకు డీజిల్‌పై రూ.33.74 లక్షలు, పెట్రోలోపై 17.88 లక్షల భారం


నెల్లూరు (హరనాథపురం), మార్చి 2 : ఇంధన ధరల పెంపు అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరికి అవసరమైన గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు గడిచిన నెల రోజుల్లో విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.150 వరకు ధర పెరిగింది.  ఇక పెట్రోలు, డీజిల్‌ కూడా లీటరుకు నాలుగు రూపాయలకు పైగా పెరిగింది.


భారీగా పెరిగిన గ్యాస్‌ ధర


సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధర నవంబరు, మార్చి నెలల మధ్య భారీగా పెరిగింది. గతేడాది నవంబరులో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.631.50 ఉండగా, డిసెంబరులో రూ.731.50కి పెరిగింది. ఇక జనవరిలో రూ.731.50 పైసలుగా ఉన్న సలిండర్‌ ధర ఫిబ్రవరిలో 806.50లకు చేరుకుంది. మార్చి ఆరంభంలోనే 50 రూపాయలు పెరిగి 856.50లకు ఎగబాకింది. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో సిలిండర్‌ ధర రూ.225 పెరిగింది. జిల్లాలో 8.04 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. మార్చి నెల ఆరంభంలోనే పెరిగిన సిలిండర్‌ ధరతో లెక్క తీసుకొంటే రూ.50 వంతున వినియోగదారులపై రూ.4.02 కోట్ల భారం పడింది.


పెట్రో మంట..


ఇటీవల కాలంలో పెట్రోలు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెట్రోలు ధర పెరుగుదలను పరిశీలిస్తే రూ.4.47 పైసలు పెరిగింది. ఫిబ్రవరి 1న లీటరు  పెట్రోలు నెల్లూరులో రూ.92.75గా ఉండగా, మార్చి 2న 97.22లకు చేరుకుంది. జిల్లాలో ఒక్క రోజుకు పెట్రోలు వినియోగం 4 లక్షల లీటర్లు. ఈ లెక్కన వినియోగదారులపై రోజుకు రూ.17.88 లక్షల భారం పడింది.


డీజిల్‌ సెగ..


పెట్రోలుకు దీటుగా డీజిల్‌ ధర పెరుగుతుండటంతో వాహనదారుల్లో గుబులు పట్టుకుంది. ఫిబ్రవరి 1న లీటరు డీజిల్‌ రూ.85.88గా ఉండగా, మార్చి2న రూ.90.70కి   చేరుకుంది. అంటే గడిచిన నెలరోజుల్లో రూ.4.82 పెరిగింది. జిల్లాలో డీజిల్‌ వినియోగం రోజుకు 7లక్షల లీటర్లు ఉండగా, పెరిగిన ధరతో వాహనదారులపై రూ.33.74లక్షల అదనపు భారం పడింది.



పెట్రో ధరలు చూసి

ప్రజలు వణికిపోతున్నారు!


ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రం

డీసీసీ అధ్యక్షుడు చేవూరు


నెల్లూరు (వైద్యం)మార్చి 3 : కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎలా భయపడ్డారో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుదలను చూసి అలా వణికి పోతున్నారని డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరులోని ఇందిరా భవన్‌ ఎదుట గ్యాస్‌ సిలిండర్లు పక్కన పెట్టి, కట్టె పొయ్యిలతో వంట చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేవూరు మాట్లాడుతూ కరోనా కారణంగా దాదాపు 40 శాతం ముడిచమురు ధరలు పడిపోతే  బీజేపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. 2014లో యూపీఏ ప్రభుత్వంలో కేవలం పెట్రోల్‌పై రూ. 9.20, డీజిల్‌పై రూ.3.46 మాత్రమే ఎక్సైజ్‌ పన్నులు ఉండేవని, బీజేపీ ప్రభుత్వం అత్యధికంగా రూ.32.90, గ్యాస్‌పై రూ.27 పెంచడం దారుణమని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయటాన్ని ప్రతిఘటిస్తామన్నారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఉడతా వెంకట్రావు, ఫయాజ్‌, సురేష్‌బాబు, డీసీసీ ఉపాధ్యక్షులు తలారి బాలసుధాకర్‌, కొండా అనిల్‌కుమార్‌, అల్లా ఉద్దీన్‌, గణేష్‌బాబు, హుస్సేన్‌బాషా, షబ్బీర్‌, సర్పరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-04T05:25:19+05:30 IST