ఫ్యాన్‌ కింద ఉక్కపోత..

ABN , First Publish Date - 2022-06-26T05:48:53+05:30 IST

జగన్‌ను సీఎం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలు మూడేళ్ల జగన్‌ పాలనలో తమకు గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారా? మేము అనుకున్నది ఏంది.. జరుగుతున్నది ఏందీ అంటూ ఆక్రోషిస్తున్నారా? ఇటీవల జరిగిన ప్లీనరీలను పరిశీలిస్తే

ఫ్యాన్‌ కింద ఉక్కపోత..

వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం

కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన 

ప్లీనరీ సాక్షిగా బయటపడుతున్న విభేదాలు 

కడప, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : జగన్‌ను సీఎం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలు మూడేళ్ల జగన్‌ పాలనలో తమకు గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారా? మేము అనుకున్నది ఏంది.. జరుగుతున్నది ఏందీ అంటూ ఆక్రోషిస్తున్నారా? ఇటీవల జరిగిన ప్లీనరీలను పరిశీలిస్తే అవునేననిపిస్తుంది. సీఎం జగన్‌ సొంత గడ్డ పులివెందులలో జరిగిన ప్లీనరీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం. సీఎం సార్‌కు చెప్పండంటూ ఓ నాయకుడు మాట్లాడితే ప్రొద్దుటూరులో జరిగిన ప్లీనరీలో వైసీపీలో ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ప్లీనరీకి హాజరు కాకపోవడంతో వైసీపీలో ఉన్న గ్రూప్‌ విభేదాలు స్పష్టంగా బట్టబయలైనట్లు చెబుతున్నారు. 


కార్యకర్తల నిరుత్సాహం 

కాంగ్రెస్‌ పార్టీని వీడి వైసీపీని స్థాపించిన తరువాత కాంగ్రె్‌సలో వైఎస్‌ కుటుంబాన్ని అభిమానించే క్యాడర్‌ అంతా జగన్‌ వెంట నడిచింది. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు, ముఖ్య నేతల పుట్టిన రోజులు, ఇలా అన్నింటిని ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కష్టపడ్డారు. జగన్‌ను సీఎం చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేశారు. జగన్‌ సీఎం అయితే బతుకులే మారిపోతాయని భావించారు. అందుకు తగ్గట్లుగానే ప్రతిపక్షనేతగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కార్యకర్తలకు భరోసా ఇస్తూ వచ్చేవారు. చావో రేవో అన్న 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. జగన్‌ సీఎం కావడంతో ప్రతి కార్యకర్త సంతోషించాడు. 


తొలుగుతున్న భ్రమలు

జగన్‌  సర్కార్‌పై వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాంట్రాక్ట్‌ పదవులతో పాటు ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా జగన్‌ సర్కార్‌ నిలిపేసింది. టీడీపీ హయాంలో కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా పనులు చేశారు. ఆ బిల్లులు చాలా వరకు ఇంతవరకు రాలేదు. 


వలంటీర్‌ వ్యవస్థ రాకతో

వలంటీర్‌ వ్యవస్థ రాకతో సంక్షేమ పథకాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో కొందరు వైసీపీ నేతలకు పట్టులేకుండా పోయిందని అంటున్నారు. కార్యకర్తల ప్రమేయం లేకుండానే వలంటీర్‌ ద్వారానే పనులు చేస్తుండడంతో పార్టీ కోసం జెండా మోసిన వారు జీర్ణించుకోలేకున్నారంటూ అంటున్నారు. ఏమైనా కాంట్రాక్ట్‌ పనులు చేస్తామన్నా బిల్లులు వస్తాయో రావో అన్న ఆందోళన ఉండడం,  పదవిలో కూడా కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. 


ప్లీనరీ సాక్షిగా 

వచ్చే నెలలో విజయవాడ-గుంటూరు మధ్యలో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎంపీ అవినా్‌షరెడ్డి అధ్యక్షతన పులివెందుల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేముల మాజీ ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం, ప్రజలకు మా ద్వారా పనులు జరగాలి. ప్రస్తుతం విగ్రహాల్లా ఉంటున్నాం. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. మేము మీతో కష్టపడుతున్నాం. కార్యకర్తలను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కార్యకర్తల మనోభావాలు గుర్తించాలి. ప్రస్తుతం మాలో ఉత్సాహం లేదు. పల్లెల్లో మా ద్వారానే పనులు జరగాలి అంతా వలంటీర్లు అంటే నష్టం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని జగన్‌ సర్‌ దృష్టికి తీసుకెళ్లాలంటూ సభాసాక్షిగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత మమ్మల్ను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాము మాట్లాడినంత సేపు కార్యకర్తలు విజిల్స్‌, కేకలతో హోరెత్తించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని రాము వెల్లబుచ్చాడంటూ అక్కడ కొందరు కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. అయితే ఇక్కడ కార్యకర్తల కోసం భారీ ఎత్తున భోజనాలు ఏర్పాటు చేస్తే కొద్ది మంది మాత్రమే భోంచేయడం విశేషమంటున్నారు. వేల మందికి ఏర్పాటు చేస్తే కనీసం వందలాది మంది కూడా తినకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సమాచారం. సీఎం సొంత ఇలాకాలోనే కార్యకర్తల ఆవేదను చూసి రాజకీయ పరిశీలకులు ఔరా అంటున్నారు. ఇక ప్రొద్దుటూరులో జరిగిన ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌, కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి, సేట్‌ గురివిరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఖాజా మరి కొందరు నేతలు హాజరు కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే రమే్‌షయాదవ్‌ల మధ్య విభేదాలు ఉన్నట్లు చెబుతారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి, 2019 ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ ఆయనకు ప్రాధాన్యత తొలి నుంచి అంతంత మాత్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. 10 నెలల క్రితం జమ్మలమడుగులో మార్కెట్‌ ఓపెనింగ్‌కు ఎంపీ అవినా్‌షరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలిసి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పాల్గొనగా అక్కడ ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇంత వరకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలిసి రామసుబ్బారెడ్డి వేదిక పంచుకోలేదని చెబుతున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరులో జరిగిన ప్లీనరీ సమావేశాలకే వైసీపీలో ఆవేదనలు, అసంతృప్తులు, వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇక ఆదివారం బద్వేలు, సోమవారం జమ్మలమడుగులో ప్లీనరీలు జరుగనున్నాయి. వాటిలో కార్యకర్తల వేదనను ఆలకిస్తారా లేక మాట్లాడకుండా ఒత్తిడి తెస్తారో చూడాల్సి ఉంది. 

Updated Date - 2022-06-26T05:48:53+05:30 IST