కాంగ్రెస్‌లో వైరాగ్యం..

ABN , First Publish Date - 2021-07-12T04:36:48+05:30 IST

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ దుస్థితి చుక్కాను లేని నావలా ఉంది.

కాంగ్రెస్‌లో వైరాగ్యం..

 వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి

 2014 నుంచి పోటీకి దూరంగా కాంగ్రెస్‌

 పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కేటాయింపు

వైరా, జూలై 11: వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ దుస్థితి చుక్కాను లేని నావలా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారధ్యంలోనైనా వైరా కాంగ్రె్‌సకు మహర్దశ రావాలని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ నియోజకవర్గ కేంద్రమైన వైరా మండలానికి చెందిన వారు అయినప్పటీకీ నియోజకవర్గ కాంగ్రె్‌సకు ఇన్‌చార్జ్‌ లేకుండా పోవడంతో.. కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. రెండేళ్లుగా వైరా మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కూడా ఖాళీగానే ఉంది. ఇంత వరకు కాంగ్రెస్‌ మండల అధ్యక్ష పదవి కూడా భర్తీ చేయలేని దుస్థితిలో పార్టీ నాయకత్వం ఉందనే విమర్శలు ఉన్నాయి.  2009లో వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలతో వైరా ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే రేణుక చౌదరి వర్గానికి చెందిన డాక్టర్‌ భూక్యా  రాంచందర్‌ నాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాంచందర్‌నాయక్‌ మాత్రం కొద్ది రోజులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హోదాలో హడాహుడి చేశాడు. ఆ తర్వాత నియోజకవర్గంలో కనుమరుగయ్యారు. ఆ సమయంలోనే వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం అనేకమంది గిరిజన నాయకులు హడావుడి చేశారు. వారిలో ప్రస్తుత టీఆర్‌ఎ్‌సకు చెందిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కూడా కాంగ్రెస్‌ అభర్థిత్వం కోసం 2014లో పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో మహాకూటమి ఒప్పందంలో భాగంగా వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఫలితంగా కాంగ్రెస్‌ పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తర్వాత రాములునాయక్‌తో సహా అనేక మంది నాయకులు 2018 వరకు కాంగ్రె్‌సలో తిరుగుతూ టికెట్‌ కోసం పోటీపడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ జత కట్టడంతో.. తిరిగి మళ్లీ రెండోసారి కూడా సీపీఐకే నియోజకవర్గం పోటీ చేసే అవకాశం దక్కింది. దాంతో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన రాములు నాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. వరుసగా రెండుసార్లు సీపీఐకే వైరా నియోజకవర్గాన్ని వదులుకోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన అత్యధికమంది కాంగ్రెస్‌ శ్రేణులు 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్‌ గెలుపులో భాగస్వామ్యులయ్యారు. ఈ నియోజకవర్గం ఏర్పడి పన్నెండుళ్లు దాటినప్పటికీ ఇంత వరకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నియమించలేదు. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రాంచందర్‌ నాయక్‌ ఓడిపోయిన తర్వాత తనకు తానుగా కొంత కాలం ఇంఛార్జీగా ప్రకటించుకోని తిరిగారే తప్ప పార్టీ పరంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన కనుమరుగైన తర్వాత అనేక మంది గిరిజన నాయకులు నియోజకవర్గంలో ఆశావాహులుగా రంగంలోకి వచ్చినప్పటికీ వారిలో ఏ ఒక్కరిని ఇంత వరకు ఇంఛార్జీగా ప్రకటించలేదు. కనీసం గిరిజనేతర కాంగ్రెస్‌ నాయకులను కూడా ఇంఛార్జీగా నియమించలేదు. ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకలాపాలను సమన్వం చేసే నాయకుడే కరువయ్యారు. అంతేకాకుండా 2018 ఎన్నికల తర్వాత వైరా మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు టీఆర్‌ఎ్‌సలోకి చేరారు. అప్పటి నుంచి మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. జూలూరుపాడు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నెకంటి వీరభద్రం కూడా ఇటీవల ఆ పార్టీకి  రాజీనామా చేసి మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరాడు. 2017లో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రె్‌సలో చేరిన మాలోతు రాందాస్‌ నాయక్‌ ఇప్పటి వరకు భట్టి అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఉప్పలచెలక మాజీ సర్పంచ్‌ భాదవత్‌ సైదులు నాయక్‌ రేణుక చౌదరి అనుచరునిగా కొనసాగుతున్నారు. ఇంకా కొంత మంది గిరిజన నాయకులు కూడా మళ్లీ వచ్చే ఎన్నికల కోసం ఆశావాహులుగా ఉన్నారు.  అయినప్పటికీ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లేకపోవడంతో.. ఆ పార్టీ నాయకుల్లో అంత గందరగోళం, ఆయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తీసుకురావడమే ధ్యేయమని చెబుతున్న రేవంత్‌రెడ్డి హయంలోనైనా వైరా నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంఛార్జీ నియామకం జరగవచ్చని పలువురిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి పాలకంలో దిక్కుమోక్కులేని వైరా నియోజకవర్గానికి దిశానిర్దేశం చేసే నాయకుడిని నియమించాలని ఆ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.


Updated Date - 2021-07-12T04:36:48+05:30 IST