ఇది కుర్మానా.. సాంబారా..? పిల్లలు తినేదెలా...!: డీఈవో గంగాభవాని

ABN , First Publish Date - 2020-02-20T07:58:06+05:30 IST

ఇది కూర్మానా? సాంబారా? పిల్లలు ఎలా తినాలి అంటూ జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని హైస్కూల్‌ హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఈపూరు మోడల్‌ స్కూల్‌

ఇది కుర్మానా.. సాంబారా..? పిల్లలు తినేదెలా...!: డీఈవో గంగాభవాని

ఈపూరు, ఫిబ్రవరి 19 : ఇది కూర్మానా? సాంబారా? పిల్లలు ఎలా తినాలి అంటూ జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని హైస్కూల్‌ హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఈపూరు మోడల్‌ స్కూల్‌, న్యూప్రైమరీ పాఠశాల, హైస్కూల్‌ను బుధవారం ఆమె సందర్శించారు. మొదట మోడల్‌ స్కూల్‌లోని తరగతి గదులను, మధ్యాహ్న భోజనం పరిశీలించి ఆమె భోజనం రుచి చూశారు. పాఠశాలలోని వసతుల గురించి అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. పదో తరగతి కామన్‌ పరీక్షలలో నూరుశాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.  అనంతరం హైస్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించగా మెనూ ప్రకారం కాకుండా వంట చేయడం చూసి ఇది ఏమిటని వంట వాళ్ళను ప్రశ్నించారు. ఇలాంటి భోజనం పెడుతుంటే మీరు ఏమి చేస్తున్నారంటూ హెచ్‌ఎం గోవిందరాజులను అడిగారు. అందుకు ఆయన రాజకీయ ఒత్తిళ్లు వలన ఏమి చేయలేకపోతున్నామన్నారు. తరగతి గదులకు వెళ్లి తెలుగు పాఠ్యాంశంపై విద్యార్థినులను ప్రశ్నించగా సమాధానాలు చెప్పకపోవడంపై, రికార్డులు పరిశీలించగా కొందరు టీచర్లు సెలవు పెట్టకుండానే పాఠశాలకు రానట్లు ఆమె గ్రహించారు. ఆ విషయమై హెచ్‌ఎంను అడగగా టీచర్లను ఏమి చేయలేని పరిస్థితి అని, ఏమైనా ప్రశ్నిస్తే యూనియన్లతో ఇబ్బందిగా ఉందని ఆయన సమాధానం చెప్పారు. పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో పాటు ఏపీ మోడల్‌ స్కూల్‌ ఏడీ ప్రసూన, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వేళంగిణి మేరీ ఉన్నారు. 

Updated Date - 2020-02-20T07:58:06+05:30 IST