డెంగీ దడ

ABN , First Publish Date - 2021-10-12T04:48:13+05:30 IST

డెంగీ దడ పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 10 రోజుల్లోనే 30 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.

డెంగీ దడ
నారాయణపేటలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిలిచిన వర్షపు నీరు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 506 కేసులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికంగా 270 నమోదు

లోపించిన శుభ్రత.. పెరిగిన దోమలు 8 నారాయణపేటలో పేరుకున్న వర్షపు నీరు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అందని సరైన వైద్యం

వనపర్తి జిల్లాలో నదీ పరివాహక ప్రాంత వాసులకు దోమ తెరల పంపిణీ

నివారణ చర్యలు చేపట్టని మునిసిపల్‌ అధికారులు

ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిట


 డెంగీ దడ పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 10 రోజుల్లోనే 30 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా కేసులు నమోదవుతుంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయి. ప్రధానంగా శుభ్రత లోపించడం వల్ల జనం విష జ్వరాల బారిన పడుతున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి చేయిదాటుతోంది. ఇప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఫ్రై డే, డ్రై డే కార్యక్రమాల గురించి తెలియకపోవడం గమనార్హం. 

-ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌


నారాయణపేట, అక్టోబరు 11: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెంగీ దడ పుట్టిస్తోంది. కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 48 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నా ఆ లెక్కలను ప్రభుత్వ అధికార యంత్రాంగం పరిగణించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులనే గుర్తిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి, దోమల బెడద పెరిగింది. అవి కుట్టడం వల్ల ప్రజలు డెంగీతో పాటు మలేరియా, చికున్‌ గున్యా వ్యాధుల బారిన పడుతున్నారు.

లోపించిన పారిశుధ్యం: నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత గంజి రోడ్డులో మురుగు నీరు నిలుస్తోంది. సివిల్‌ లైన్‌ రోడ్డు విస్తరణ పేరిట తవ్వకాలు జరపడంతో ఏర్పడ్డ గుంతలలో వర్షపు నీరు నిలిచి, మురికి కూపంలా మారాయి. అవి దోమలకు స్థావరాలుగా మారాయి. ఆర్డీవో కార్యాలయంతో పాటు పాత మునిసిపల్‌ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచింది. పళ్ల బ్రిడ్జీ దగ్గర చెత్తాచెదారం వేస్తుండడంతో అక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రై డేను అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమల నివారణకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


నాగర్‌కర్నూల్‌లో 93 కేసులు

కందనూలు: డెంగీ జ్వరాలతో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 93 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. 83 మంది జిల్లాలో ఉండగా, 10 మంది జీవనోపాధి కోసం జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లిన వారు అక్కడ డెంగీ బారిన పడ్డారు. వారి ఆధార్‌ కార్డు అడ్రస్‌ జిల్లాకు సంబంధించినది కావడంతో ఆ కేసులు జిల్లాలోనే నమోదు చేశారు. 83 కేసులలో కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లో అధి కంగా 45 కేసులు నమోదయ్యాయి. డెంగీ మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ మంది డెంగీ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన చికిత్స లభించకపోవడంతో జనం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.


నదీ పరివాహక ప్రాంత గ్రామాలపై పంజా

వనపర్తి వైద్యవిభాగం: వనపర్తి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 95 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2017 నుంచి ఈ ఏడాది వరకు డెంగీ కేసులు పరిశీలిస్తే 2017లో 25 కేసులు నమోదయ్యాయి. 2018లో 24 కేసులు, 2019లో 95, 2020లో 74 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకే 95 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఒక మలేరియా, ఒక చికున్‌గున్యా కేసులు కూడా నమోదయ్యాయి.


దోమ తెరలు పంపిణీ

డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వ్యాధులు ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. తిప్పడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేందం పరిధిలోని గ్రామాల్లో, కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అమరచింత మండలాల్లో కేసులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం కోసం మూలమల్ల, నందిమల్ల, జూరాల, మొట్లోంపల్లి, గుంటిపల్లి, బాలకిష్టాపూర్‌, పాన్‌గల్‌ పీహెచ్‌సీ పరిధిలోని అన్నారం, పెబ్కేరు మండలంలోని రాంపూరం గ్రామాలతో పాటు ఆత్మకూర్‌ పట్టణంలో 6,600 దోమ తెరలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. వీటితో పాటు నిల్వ నీటిలోని దోమ లార్వను అరికట్టడం కోసం పెద్దమందడి, మదనపూర్‌, పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 7,600 గంబూజియా చేపలను పెంచుతున్నారు.


గద్వాలలో 10 రోజుల్లో 30 కేసులు

గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ప్రజలు డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. కలుషిత నీరు, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమల స్వైర విహారంతో డెంగీ బారిన పడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 270 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10 రోజుల్లోనే 30 డెంగీ కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. దీంతో పాటు వైరల్‌ జ్వరాల కేసులు 70-80 వచ్చాయని చెప్పారు. ఇందులో కొన్ని డెంగీ కేసులు కాకున్నా కూడా ప్లెట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయని అన్నారు. జిల్లా ఆస్పత్రిలోనే రోజూ దాదాపుగా 4-5 డెంగీ కేసులు, 7-8 వైరల్‌ జ్వరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. ప్రవేట్‌ ఆస్పత్రుల్లో రోజూ దాదాపు 20 వరకు డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రులతో పాటు, కర్నూల్‌, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు.     

జిల్లా కేంద్రంలో పారిశుధ్య పనులు నిల్‌: జోగుళాంబ గద్వాల పేరుకే జిల్లా కేంద్రం అని చెప్పుకోవాల్సి వస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. బస్టాండ్‌తో పాటు పలు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. పలు కాలనీల్లో పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణ చర్యలు లోపించడంతోనే డెంగీ కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ ప్రధానంగా దోమల వల్లే వస్తుందని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌ చెప్పారు. దోమల నివారణకు మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.





Updated Date - 2021-10-12T04:48:13+05:30 IST