డెంగ్యూ దడ

ABN , First Publish Date - 2022-08-18T06:02:15+05:30 IST

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరంతో ప్రజలు బాధపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గామాల్లో, పట్టణాల్లో ఎక్కడికక్కడ నీటి నిల్వలు, పారిశుధ్య లోపంతో దోమల సంతతి పెరిగిపోతోంది.

డెంగ్యూ దడ
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యఆరోగ్యశాఖఽ సిబ్బంది

- పారిశుధ్య లోపంతో పెరుగుతున్న దోమల సంతతి

- అవగాహన లేక విస్తరిస్తున్న వ్యాధి

- ఇప్పటికే జిల్లాలో 10 కేసులు నమోదు

- ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు

- వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడంలో సిబ్బంది నిర్లక్ష్యం


కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 17: వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరంతో ప్రజలు బాధపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గామాల్లో, పట్టణాల్లో ఎక్కడికక్కడ నీటి నిల్వలు, పారిశుధ్య లోపంతో దోమల సంతతి పెరిగిపోతోంది. ఈ కలుషిత నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వాటి సంతతిని పెంచడం వల్ల జిల్లాలో దోమ కాటు వ్యాధులు ఎక్కువవుతున్నాయి. మలేరియాతో బాధపడుతూ ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చిన్నారులు, పెద్దలు ఇన్‌ పేషంట్‌లుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం  డెంగ్యూ భారిన పడి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో అధిక శాతం చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో 10 కేసులు నమోదు

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అనధికారికంగా చాలానే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలు ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతీ ఏడాది ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఈ ప్రాంతాల్లో మారుమూల తండాలు, గ్రామాలు ఉండడంతో పాటు పారిశుధ్య లోపాలు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గాంధారి మండలంలో చద్మల్‌, నేరల్‌, గుజ్జుల్‌ తండాల్లో ఎక్కువగా డెంగ్యూ భారిన పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నారని వారంతా కామారెడ్డి, బాన్సువాడలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డెంగ్యూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధి వ్యాప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 10 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఇందులో కామారెడ్డి పట్టణంలోని పీహెచ్‌సీ పరిధిలో రెండు, మాచారెడ్డి పీహెచ్‌సీ పరిధిలో రెండు, భిక్కనూరు పీహెచ్‌సీ పరిధిలో రెండు, మద్నూర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఒకటి, పిట్లం పీహెచ్‌సీ పరిధిలో ఒకటి, ఉత్తునూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వ్యాధి నిర్ధారణ పరికరాలు కరువు

జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 2 ఏరియా ఆసుపత్రులు, 6 సీహెచ్‌సీలు, 23 పీహెచ్‌సీలు ఉన్నా ఎక్కడా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులో లేవు. డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్టు చేయాల్సి ఉన్నా  కేవలం రాపిడ్‌ టెస్టులతోనే సరిపెడుతున్నారు. జిల్లా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రతీఏటా డెంగ్యూ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతున్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు డెంగ్యూ నిర్ధారణకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయలేదు. నిర్ధారణకు ఇప్పటికీ నిజామాబాద్‌ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారంటే అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ ఆసుపత్రులలో సైతం ఎలిసా టెస్ట్‌కు సంబంధించిన పరికరాలు లేవు కేవలం ప్లెట్‌లెట్స్‌ పడిపోవడంతో పాటు రోగికి పరిస్థితిని బట్టి ప్లూయిడ్స్‌ ఎక్కిస్తూ వ్యాధి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిల్లు మాత్రం వేలల్లోనే అవుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు డెంగ్యూ భారిన పడితే అప్పులు చేసి చికిత్స పొందుతున్నారు.

డెంగ్యూ ఎలా వస్తుంది

వర్షాలు ఆరంభమయ్యాక ఇంటి పరిసరాలు, మురికికుంటలు, కొబ్బరి బొండాలు లాంటి వాటిలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. అలా నీరు నిలువుండడం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాఽధులు సంభవిస్తాయి. ప్రాణాంతక వ్యాధి అయిన డెంగ్యూ సోకడానికి కారణం ఎడిస్‌ ఈజిప్టె(టైగర్‌ మస్కిటో) అనే దోమ కాటు కారణం. ఈ దోమలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే కుడుతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వేళల్లో కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుట్టిన రెండు, మూడు రోజుల్లోనే వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనబడుతాయి. విపరీతమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఏర్పడుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్త కణాలపై దాడి చేస్తాయి. దీంతో వ్యాధి సోకిన వారు నీరసించిపోతారు.

డెంగ్యూను ఎలా గుర్తించాలి

దోమ మనిషిని కుట్టిన తర్వాత జ్వరంతో పాటు వారి శరీరంలో చిన్నచిన్న ఎర్రని చెమటకాయ లాంటి పొక్కులు కన్పిస్తాయి. మరికొంత మందికి చర్మంపై వచ్చిన విధంగానే కడుపులో వస్తాయి. ఇది గుర్తించాలంటే మలవిసర్జన సమయంలో రక్తం జీరలు వసు్తున్నాయో లేదో గమనించాలి ఈ రెండు రకాల పరిస్థితులు ఉంటే ఎలిసా టెస్ట్‌ ఫర్‌ డెంగ్యూ పరీక్షను చేయించుకోవాలి. ఆసుపత్రిని సంప్రదిస్తే దానికి తగిన యాంటి బయటిక్స్‌, ప్లూయిడ్స్‌లను వైద్యులు అందిస్తారు. వ్యాధి ముదరక ముందే తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు.


ప్రజలు పారిశుధ్య లోపం లేకుండా చూసుకోవాలి

- లక్ష్మణ్‌ సింగ్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

వర్షకాలం నీటి కుంటల్లో దోమలు గుడ్లు పెట్టడం వల్ల వాటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాలలో నీరు నిల్వకుండా, పారిశుధ్య లోపం లేకుండా చూసుకోవాలి. నీరు నిలిచినట్లయితే ఆయిల్‌బాల్‌ వేయడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ లాంటి వాటిని చల్లాలి. దీంతో కొద్దిరోజులుగా నీటిపై నిల్వ ఉన్న దోమలు మృతి చెందుతాయి. డెంగ్యూ వ్యాధి కట్టడికి గ్రామాలను, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ వ్యాధి కనిపిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.

Updated Date - 2022-08-18T06:02:15+05:30 IST