మళ్లీ డెంగ్యూ పంజా

ABN , First Publish Date - 2022-08-13T06:49:49+05:30 IST

మళ్లీ డెంగ్యూ పంజా

మళ్లీ డెంగ్యూ పంజా
ఇలా ఉంటే రోగాలు రావా..

ఖమ్మం జిల్లాలో 66కేసులు

రఘునాథపాలెం మండలం మంచుకొండలో అత్యధికం

ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు 

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 12: మూడేళ్లక్రితం జిల్లాను వణికించిన డెంగ్యూ మళ్లీ చాపకింది నీరులా వ్యాప్తిచెందుతోంది. పల్లెలు, పట్టణాల్లో దోమలు దండయాత్ర చేస్తుండడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పారిశుధ్యం లోపించిన కారణంగా డెంగ్యూ విస్తరిస్తోంది. వర్షాలతో సీజనల్‌ వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖలతో సమన్వయం చేస్తున్నా.. డెంగ్యూ కేసుల నియంత్రణ సాధ్యమవడం లేదన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం బోనకల్‌, చింతకాని మండలం నాగులవంచ, నేరడ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు అధికంగా నమోదై ప్రాణనష్టం కూడా సంభవించింది. అప్పట్లో అక్కడి పరిసరాల అపరిశుభ్రత, దోమల వ్యాప్తికి కారణం కావడంతో ప్రజ లు జ్వరాల బారిన పడ్డారు. గతేడాది కల్లూరు మండలం అంబేద్కర్‌ నగర్‌లో డెంగ్యూ జ్వరాల బారిన పడ్డారు. కొవిడ్‌ నేపథ్యంలో చేపట్టిన పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేసిన ఫలితంగా మూడేళ్లుగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల తీవ్రత లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఏడాది భారీ వర్షాలు పడుతుండటం, పారిశుధ్య నిర్వహణలో ఏర్పడుతున్న సమన్వయలోపం కారణంగా మళ్లీ డెంగ్యూ వ్యాప్తి చెందుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 66కేసులు నమోదైనట్టు చెబుతున్నా అవి ఎక్కువగానే నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న డెంగ్యూ బాధితులసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఈ విషయం పంచాయతీ, జిల్లా వైద్యశాఖ అధికారులు నిర్వహిస్తున్న జ్వర సర్వేలో స్పష్టమవుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మంచుకొండలో 13, ఎంవీపాలెం పీహెచసీ పరిధిలో 8, మామిళ్లగూడెం యూపీహెచసీ పరిధిలో 9, తిరుమలాయపాలెంలో 3, లంకాసాగర్‌లో 7,ముస్తాఫానగర్‌ యూపీహెచసీలో 5, కొణిజర్లలో 3, గంగారం, సింగరేణి, పెద్దగోపతి, మార్టురుపేట, సుబ్లేడ్‌, కూసుమంచి, దెందుకూరు పీహెచసీల పరిఽధిలో ఒక్కొక్కటి చొప్పున, కామేపల్లిలో 4, బోదులబండలో 4,ముదిగొండలో రెండు కేసులు నమోదయ్యాయి. 


అప్రమత్తం చేసిన కలెక్టర్‌ గౌతమ్‌

జిల్లాలో డెంగ్యూ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా నెలకు 5వేల చొప్పున రక్త నమూనాలు సేకరించాలని ఆదేశాలిచ్చారు. ఎక్కడైతే జ్వరాలు అధికంగా ఉన్నాయో అక్కడ తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య చర్యలు, దోమలు పుట్టకుండా ప్రతీ 50ఇళ్లకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వారంలో రెండురోజుల పాటు డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని, వాటిని పర్యవేక్షించాలని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 


జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 

సేకరించిన రక్తనమూనాలు 

మొత్తం శాంపిల్స్‌ సేకరణ 2194, పాజిటివ్‌ కేసులు 66, నమోదైన పీహెచసీలు 18, డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాలు 53, బారిన పడిన పురుషులు 25, మహిళలు 29


Updated Date - 2022-08-13T06:49:49+05:30 IST