ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి మీరే కారణమంటూ భారతీయ జనతా పార్టీ (BJP)పై ప్రతిపక్షాలు కత్తులు దూస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తూ సంక్షోభానికి కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. ఇది బీజేపీ ఆడుతున్న గేమ్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా తాము మాత్రం మహావికాస్ అఘాడీతోనే ఉంటామని, కలిసే పనిచేస్తామని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తోందని కొనియాడారు. అలాంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ గురించి తెలియంది ఎవరికని, వారు గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలో కూడా చేసింది ఇదేనని ఖర్గే దుమ్మెత్తి పోశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కూడా బీజేపీపై తీవ్రస్థాయిలోమండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం పనిచేస్తోందా? అన్న సందేహం తనకు కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వారు కూల్చివేస్తే కనుక ప్రజలకు, ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. మహారాష్ట్ర తర్వాత కూడా బీజేపీ ఆగదని, ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చివేస్తుందని మమతా ఆరోపించారు.
ఇవి కూడా చదవండి