Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ కంప్యూటర్ ఆపరేటర్‌ టార్గెట్ సచిన్!

నూటా మూడుపదాలు ఉన్న వాక్యాన్ని మీరెంత సేపట్లో టైప్‌ చేయగలరు? అయిదు నిమిషాలా, రెండు నిమిషాలా? వినోద్‌ కుమార్‌  మాత్రం 46.3 సెకన్లలో పూర్తిచేస్తాడు. అది కూడా చేతులతో కాదు ముక్కుతో. ఎన్నో గిన్నిస్‌ రికార్డులను సొంతం చేసుకున్న వినోద్‌ కుమార్‌ నైపుణ్యం ఆసక్తికరం.


దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వినోద్‌ కుమార్‌ను చూడగానే ఓ సాధారణ వ్యక్తిలానే అందరూ అనుకుంటారు. కానీ తన పేరున ఒకటి కాదు రెండు కాదు, తొమ్మిది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు ఉన్నాయి. జెఎన్‌యూలోని స్కూల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో సమాచారాన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడం ఆయన వృత్తి. అందుకే ఆఫీసులో ఎక్కువ సమయం కీబోర్డు మీదే గడుస్తుంది. వేగంగా టైప్‌ చేయడం అలవాటైంది. అదే క్రమంగా అభిరుచిగా మారింది. ఆ అభిరుచితోనే అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. కీ బోర్డు మీద రకరకాలుగా టైప్‌ చేస్తూ ఏకంగా ఎనిమిది గిన్నిస్‌ రికార్డులను సొంతం చేసుకున్నాడు.


నలభై ఏళ్ల వినోద్‌కు చిన్నప్పటి నుంచి ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ గా పేరుతెచ్చుకున్న మిల్కా సింగ్‌ అంటే అభిమానం. ఏనాటికైనా అథ్లెట్‌లా మారి ఆయనలా మెరుపువేగంతో పరుగులు తీయాలని కలలుకన్నాడు. కానీ అవి కల్లలయ్యాయి. అయినా నిరాశపడకుండా కీబోర్డు టైపింగ్‌లో వీరుడవ్వాలని అనుకున్నాడు. తన ఇంట్లో ఓ కంప్యూటర్‌ కేంద్రాన్ని నెలకొల్పాడు. పేదలకు, దివ్యాంగులకు కంప్యూటర్‌లో శిక్షణ ఇవ్వడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. టైపింగ్‌లో అనేక రకాల నైపుణ్యాలను సాధించడం మొదలుపెట్టాడు. 2014లో ‘ముక్కుతో కంపోజ్‌ చేస్తున్న వ్యక్తి’ అనే వార్త అతడిని బాగా ఆకర్షించింది. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తను కూడా అలా చేయాలని అనుకున్నాడు. ప్రాక్టీస్‌ చేయడంతో పాటు అత్యంత వేగంగా కంపోజ్‌ చేసి రికార్డు నెలకొల్పాడు. అక్కడితో ఆగకుండా ఒక చేయితో, కళ్లకు గంతలు కట్టుకుని కంపోజ్‌ చేయడం, నోట్లో చెక్క ముక్క పెట్టుకుని కంపోజ్‌ చేయడం లాంటి రకరకాల విన్యాసాలతో గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పాడు. ఇలా అసాధారణ రీతిలోనే కాకుండా అత్యంత వేగంగా కంపోజ్‌ చేయడం అతడిని రికార్డుల బాట పట్టించింది. ఇటీవలే ముక్కుతో మరింత వేగంగా కంపోజ్‌ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. అతడు నెలకొల్పిన రికార్డుల్లో ఎనిమిది కంపోజింగ్‌కి సంబంధించినవి. ఒక్కటి మాత్రం టెన్నిస్‌ బాల్‌ను నిమిషంలో 205 సార్లు చేత్తో నేలకు కొడుతూ ప్రపంచ రికార్డు సాధించాడు.


క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఖాతాలో 19 గిన్నిస్‌ రికార్డులు ఉన్నాయి. ఏనాటికైనా తన అభిమాన క్రికెటర్‌ గిన్నిస్‌ రికార్డులను ఛేదించడానికి వినోద్‌ కృషి చేస్తున్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement