రంగు రంగుల తలపాగాలు.. మెలేసిన మీసాలు!

ABN , First Publish Date - 2021-11-27T07:08:20+05:30 IST

రంగు రంగుల తలపాగాలు.. కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి, మెలేసిన మీసాలు.. పొడవాటి గడ్డాలతో.. విజయగర్వం ఉప్పొంగుతుండగా.. విద్యుద్దీపాలు, పోస్టర్లతో....

రంగు రంగుల తలపాగాలు.. మెలేసిన మీసాలు!

నృత్యాలు, ఆలింగనాలతో ఢిల్లీలో రైతుల ఏడాది విజయోత్సవాలు


న్యూఢిల్లీ, నవంబరు 26: రంగు రంగుల తలపాగాలు.. కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి, మెలేసిన మీసాలు.. పొడవాటి గడ్డాలతో.. విజయగర్వం ఉప్పొంగుతుండగా.. విద్యుద్దీపాలు, పోస్టర్లతో అలంకరించిన ట్రాక్టర్లపైకి ఎక్కి ఉత్సాహంగా రైతన్నలు చేస్తున్న భాంగ్రా, హరియాణీ నృత్యాలు.. ఇవీ.. శుక్రవారం ఢిల్లీలోని సింఘూ బోర్డర్‌లో ఎక్కడ చూసినా కనిపించిన దృశ్యాలు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము ప్రారంభించిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన రోజును రైతులు ఓ పండుగలా జరుపుకొన్నారు. లడ్డూలు పంచుకుని, ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏడాది నుంచి ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా సాగిన పోరాటం విజయం సాధించడంతో.. ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సందర్భంగా.. రైతు కుటుంబాలకు చెందిన వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు సహా వివిధ వర్గాలకు చెందిన ముఖ్యులు హాజరై.. విజయోత్సవంలో భాగమయ్యారు. పిల్లలు, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘మజ్దూర్‌ కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. డ్రమ్స్‌ మోగిస్తూ సందడి చేశారు. 

Updated Date - 2021-11-27T07:08:20+05:30 IST