Manish Sidodia: ఆగస్టు 1 నుంచి ఆరు నెలలు పాత మద్యం విధానమే

ABN , First Publish Date - 2022-07-30T23:37:36+05:30 IST

పాత మద్యం విధానాన్ని ఢిల్లీలో పునరుద్ధరించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసిడియా శనివారంనాడు..

Manish Sidodia: ఆగస్టు 1 నుంచి ఆరు నెలలు పాత మద్యం విధానమే

న్యూఢిల్లీ: పాత మద్యం విధానాన్ని ఢిల్లీలో పునరుద్ధరించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసిడియా శనివారంనాడు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని తెలిపారు. దుకాణదారులను, అధికారులను బీజేపీ బెదరిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఆరునెలల పాటు పాత మద్యం విధానమే అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మనీష్ సిసోడియా తాజా ప్రకటన చేశారు. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు మరో రెండు రోజుల్లో ముగియబోతుండటంతో ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.


''దుకాణదారులను, అధికారులను ఈడీ, సీబీఐతో వాళ్లు (బీజేపీ) బెదిరిస్తున్నారు. చట్టబద్ధమైన లిక్కర్ దుకాణాలను మూయించి, అక్రమ దుకాణాల ద్వారా డబ్బు సంపాదించాలని వారనుకుంటున్నారు"' అని సిసోడియా ఆరోపించారు. నూతన లిక్కర్ పాలసీని నిలిపివేసి, ప్రభుత్వ లిక్కర్ దుకాణాలు తెరవాలని తాము నిర్ణయించినట్టు సిసోడియా తెలిపారు.


ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త లిక్కర్ విధానాన్ని సిసోడియా సమర్ధిస్తూ, అవినీతికి చరమగీతం పాడేందుకే కొత్త మద్యం విధానాన్ని తాము తీసుకువచ్చామని, దీనికి ముందు 850 మద్యం దుకాణాల నుంచి రూ.6,000 కోట్లు ఆదాయం వస్తే, కొత్త విధానం తర్వాత అదే సంఖ్యలో మద్యం దుకాణాల నుంచి రూ.9,000 కోట్లు తమ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని చెప్పారు. కాగా, 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు రెండేసి నెలలు చొప్పున పొడిగిస్తూ వచ్చారు. జూలై 31తో ఈ గడువు ముగియనుంది.

Updated Date - 2022-07-30T23:37:36+05:30 IST