Delhi liquor scam: బీజేపీ స్టింగ్ ఆపరేషన్ వీడియా.. కొట్టిపారేసిన సిసోడియా

ABN , First Publish Date - 2022-09-06T00:58:27+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ స్కామ్‌కు సంబంధించిన..

Delhi liquor scam: బీజేపీ స్టింగ్ ఆపరేషన్ వీడియా.. కొట్టిపారేసిన సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) సెగలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ స్కామ్‌కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ (Sting operation) వీడియాను బీజేపీ (Bjp) తాజాగా విడుదల చేసింది. ఆప్ సర్కార్‌ను తాము ఏదైతే ప్రశ్నించామో వాటికి సమధానాలు ఈ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగుచూశాయని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర (Sambit patra) అన్నారు.


ఢిల్లీలో లిక్కర్ లైసెన్సులు కావాలంటే కమిషన్లు చెల్లించాలని ఈ లిక్కర్ స్కామ్‌ సూత్రధారిగా చెబుతున్న (father of the liquor scam) వ్యక్తి ఈ వీడియోలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ''మద్యం కుంభకోణంలో 80 శాతం లాభాలు కేజ్రీవాల్ (Chief minister Arvind), మనీష్ సిసోడియా (Manish sisodia), వాళ్ల మిత్రులకు వెళ్తున్నాయనేది ఈ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది.'' అని సంబిత్ పాత్ర అన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 80 శాతం లాభాలు మాకివ్వండి..ఆ తర్వాత 20 శాతం ఎలాగైనా అమ్ముకోండనేదే కేజ్రీవాల్ పాలసీ అని ఆయన విమర్శించారు.


స్టింగ్ ఆపరేషన్‌లో లిక్కర్ స్కామ్ 13వ నిందితుడు కుల్వీందర్ మార్వా కనిపిస్తున్నారు. కుల్వీందర్ మాట్లాడిన మాటలను బట్టి ఈ స్కామ్‌లో అన్ని విషయాలను ఆయన అంగీకరిస్తున్నట్టు అర్ధమవుతుందని సంబిత్ పాత్ర అన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మునుముందు కూడా వెలుగు చూస్తాయనన్నారు. లిక్కర్ కాంట్రాక్టర్లు ఎలాంటి భయాలు లేకుండా అవినీతిని బహిర్గతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు తాము ఐదు ప్రశ్నలు వేశామని, వాటికి జవాబే లేదని, అయితే, స్టింగ్ ఆపరేషన్‌తో వాటిన్నింటినీ బయటకు తెస్తామని అన్నారు.


స్టింగ్ ఆపరేషన్ ఓ పెద్ద జోక్: సిసోడియా

స్టింగ్ ఆపరేషన్ పేరుతో విడుదల చేసిన వీడియో ఓ పెద్ద జోక్ అని మనీష్ సిసోడియా కొట్టివేశారు. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. సీబీఐకి తన ఇంటిలో కానీ, లాకర్‌లోనీ ఏమీ దొరకలేదని, స్వయంగా సీబీఐనే తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. ఆ కారణంగానే బీజేపీ కొత్త పన్నాగాలతో ముందుకు వస్తోందని ఆరోపించారు. ఇదెంత మాత్రం స్టింగ్ ఆపరేషన్ కాదనీ, కేవలం జోక్ మాత్రమేనని అన్నారు.

Updated Date - 2022-09-06T00:58:27+05:30 IST