సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ వాయిదాకు హైకోర్టు తిరస్కరణ

ABN , First Publish Date - 2022-01-06T23:44:37+05:30 IST

సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని

సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ వాయిదాకు హైకోర్టు తిరస్కరణ

న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఈ పరీక్షల షెడ్యూలులో జోక్యం చేసుకోబోమని తెలిపింది. దీంతో ఈ పరీక్షలు శుక్రవారం నుంచి ముందుగా ప్రకటించినట్లుగానే జరుగుతాయి. 


సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తుంది. తాము కోవిడ్-19 పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించామని బుధవారం తెలిపింది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు గురువారం హైకోర్టుకు తెలిపింది. చివరి క్షణంలో వీటిని వాయిదా వేయరాదని కోరింది. 9,156 మంది అభ్యర్థుల్లో 9,085 మంది తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించింది. ఇప్పటికే చాలా విలువైన సమయం గడిచిపోయిందని తెలిపింది. 


ఈ పరీక్షలను వాయిదా వేయాలని 19 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోవిడ్-19కు గురయ్యే అవకాశం ఉందని, ఈ పరీక్షలను నిర్వహిస్తే అత్యంత విలువైన ఓ అటెంప్ట్‌ను కోల్పోవలసి వస్తుందని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు నిర్ణయించిన గరిష్ఠ అవకాశాల్లో ఇది తమకు చివరి అవకాశమని కొందరు అభ్యర్థులు తెలిపారు. 


జస్టిస్ వీ కామేశ్వర రావు మాట్లాడుతూ, యూపీఎస్‌సీ నిర్ణయంలో జోక్యం చేసుకోబోనని చెప్పారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-06T23:44:37+05:30 IST