న్యూఢిల్లీ: దేశరాజధానిలో అమలు చేస్తున్న కోవిడ్ ఆంక్షలను సాధ్యమైనంత త్వరలో సడలించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ప్రకటించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి తగ్గనున్నట్టు అంచనాలున్నందున ఆంక్షల సడలించనున్నట్టు చెప్పారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినరాదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రజల స్థితిగతులు తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కేసులు పెరిగినప్పుడు బలవంతంగా ఆంక్షలు విధించామని, మార్కెట్లు బంద్ చేయించడంతో పాటు, సరి-బేసి నిబంధనలు అమలు చేశామని అన్నారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో ప్రజల పడే కష్టాలు ఏమిటో తనకు బాగా తెలుసునని, తనను విశ్వసించాలని, అవసరమనిపించిన చోట్లే ఆంక్షలు విధిస్తామని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
''గత వారం కొందరు వ్యాపారులు నన్ను కలిశారు. వారాంతపు కర్ఫ్యూలు, సరి-బేసి నిబంధనలు తమ వ్యాపారాలను దెబ్బతీశాయని వాపోయారు. ఆంక్షలు ఎత్తేయాలని కోరారు. తప్పనిసరిగా సాధ్యమైనంత త్వరగా ఆంక్షలు ఎత్తివేస్తామని వారికి చెప్పాను'' అని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, సోమవారంనాడు ఢిల్లీలో 5.760 కోవిడ్ కేసులు నమోదు కాగా, 30 మరణాలు సంభవించారు. పాజిటివిటీ రేపు 11.79కు తగ్గింది.