కొవిడ్‌ రోగులను చేర్చుకోవాల్సిందే

ABN , First Publish Date - 2020-06-07T08:17:20+05:30 IST

కరోనా రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర

కొవిడ్‌ రోగులను చేర్చుకోవాల్సిందే

  • పడకల ‘బ్లాక్‌ మార్కెటింగ్‌’ను సహించం: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 6: కరోనా రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఆస్పత్రులు తొలుత మంచాలు అందుబాటులో లేవని చెప్పి.. గట్టిగా అడిగితే భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తూ ‘బ్లాక్‌ మార్కెటింగ్‌’కు పాల్పడుతున్నాయన్నారు. ఇలాంటి మాఫియా తరహా చర్యలను అరికడతామని.. తమ వెనుక ఉన్న రాజకీయ శక్తులు కాపాడతాయన్న భ్రమనుంచి ఆస్పత్రుల వారు బయటపడాలని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ‘ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో పడకల వివరాలను ఎప్పటికప్పుడు పొం దుపరిచేందుకు అన్ని ఆస్పత్రుల్లో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ను నియమిస్తాం. ఆస్పత్రుల్లో మంచాలు, వెంటిలేటర్ల అందుబాటు వివరాలు పారదర్శకంగా, ప్రజలకు తెలిసేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఆదాయం రాదనే ఆలోచనతో కరోనా రోగులను చేర్చుకోవడాన్ని తిరస్కరిస్తే సహించం’ అని కేజ్రీ స్పష్టం చేశారు.


కొవిడ్‌ రోగులకు 20 శాతం పడకలు కేటాయించడంలో ఉన్న ఇబ్బందులేమిటో తెలుసుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యజమానులతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఢిల్లీలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిలిపివేశారన్న వార్తలను కేజ్రీ ఖండించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తామే ఎక్కువ పరీక్షలు చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన ఆరోపణపై ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  

Updated Date - 2020-06-07T08:17:20+05:30 IST