కరోనా పరీక్షలకు జాప్యమేల ?

ABN , First Publish Date - 2020-08-09T11:47:03+05:30 IST

కరోనా పరీక్షలు జరిపించడానికి జాప్యమేలా అని ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులు వాపోయారు.

కరోనా పరీక్షలకు జాప్యమేల ?

వెదురుకుప్పం, ఆగస్టు 8: కరోనా పరీక్షలు జరిపించడానికి జాప్యమేలా అని ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులు వాపోయారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలోని ఓ యువకుడికి ఈ నెల 5న కరోనా పాజిటివ్‌ వచ్చింది. అధికార యంత్రాంగం ఆ గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టింది. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించారు. ప్రైమరీ కాంటాక్టుల్లో బాధిత యువకుడి కుటుంబసభ్యులు అంతా 30 మంది వరకు ఉన్నారు. వీరంతా ఇటీవలి వరకు ఉమ్మడిగా ఉండేవారు. ప్రస్తుతం అంతా ఒకే భవనంలో వేర్వేరు గదుల్లో విడిపోయి ఉంటున్నారు.


వీరిలో ఐదుగురికి జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయని అయినా తమకు ఇంతవరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేదని వాపోతున్నారు. ఆరోగ్య సిబ్బందికి ఆధార్‌ కార్డులు, వివరాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో  ఎస్‌ఆర్‌పురం మండలం ఆరిమాకులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుంది. ఈ వియమై వైద్యాధికారి అనిల్‌కుమార్‌నాయక్‌ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో శ్వాబ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు నిర్వహించిన మూడు రోజులకు వారి ఫోన్‌ నెంబర్లకే మెసేజ్‌ అందుతుందని తెలియజేశారు. ఇదిలా ఉండగా దేవళంపేట గ్రామంలో శనివారం ఆరిమాకులపల్లె పీహెచ్‌సీ సిబ్బంది, బొమ్మయ్య పల్లె పంచాయతీ సచివాలయ సిబ్బంది కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు.  

Updated Date - 2020-08-09T11:47:03+05:30 IST