రక్షణ రంగ పరికరాల కొనుగోలులో స్వదేశీ పరిశ్రమలకు పెద్ద పీట!

ABN , First Publish Date - 2022-01-12T00:30:57+05:30 IST

రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల

రక్షణ రంగ పరికరాల కొనుగోలులో స్వదేశీ పరిశ్రమలకు పెద్ద పీట!

న్యూఢిల్లీ : రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలులో స్వదేశీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని యోచిస్తోంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) మినహాయింపు మంజూరు చేసిన తర్వాత మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్దేశిస్తూ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ (డీఏపీ)ని సవరించేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను మంగళవారం తెలిపింది. 


జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, మన దేశ సైనిక దళాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు వర్తించే నియమావళి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డీఏపీ). దీనిని 2020 నవంబరులో సవరించారు. దీనిని భవిష్యత్తులో మరోసారి సవరించాలని, అత్యంత అరుదైన సందర్భాల్లో డీఏసీ నుంచి మినహాయింపు పొందిన తర్వాత మాత్రమే విదేశాల నుంచి ఆయుధాలను, పరికరాలను దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యవసరంగా వీటిని కొనవలసిన పరిస్థితి వచ్చినపుడు స్వదేశీ పరిశ్రమల నుంచే కొనాలని ప్రధాన మంత్రి కార్యాలయం పట్టుబడుతోంది. దీనికి మినహాయింపు అవసరమైతే, కేవలం రక్షణ మంత్రి నుంచి మాత్రమే అటువంటి అనుమతిని పొందాలని చెప్తోంది. మన దేశంలోని రక్షణ రంగ పరిశ్రమలకు భారీ ఆర్డర్లు ఇవ్వడం, రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)లో సంస్కరణలు చేయడం వంటివాటి ద్వారా స్వదేశీ పరిశ్రమలకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ పరిశ్రమలు కూడా విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్లపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది ప్రభుత్వ యోచన. ఈ నేపథ్యంలోనే డిసెంబరులో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నేతృత్వంలో అంతర్గత సమావేశం జరిగింది. రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల దిగుమతులను నిలిపేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి, ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదాను తయారు చేయడానికి ముందు ఈ సమీక్ష జరిగింది. గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు కూడా సమావేశమై చర్చించారు. గత కొన్ని వారాల నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ఆర్డర్లలో తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసినవాటిని, రద్దు చేయడానికి వీలైనవాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 200కుపైగా ఐటమ్స్‌ను తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుందని గుర్తించారు. రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం చేయాలనే లక్ష్యంతో రెండేళ్ళ నుంచి స్వదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడేవిధంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. 


2021-22 ఆర్థిక సంవత్సరంలో కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్‌లో ఆధునికీకరణ నిధుల్లో 64 శాతం నిధులను డొమెస్టిక్ ప్రొక్యూర్‌మెంట్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ కేటాయించింది. 


Updated Date - 2022-01-12T00:30:57+05:30 IST