అయ్యో కృష్ణా...

ABN , First Publish Date - 2022-04-18T05:10:41+05:30 IST

రాష్ట్ర వన్యప్రాణి కృష్ణ జింకలకు గడ్డుకాలం దాపురించింది.

అయ్యో కృష్ణా...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణ జింక (ఫైల్‌)

రాష్ట్ర వన్యప్రాణి కృష్ణ జింకలకు గడ్డుకాలం

ఎండ తీవ్రతకు అడవుల్లో అడుగంటుతున్న జల వనరులు

నీటి జాడ వెతుక్కుంటూ వచ్చి మృత్యువాత


ములకలచెరువు, ఏప్రిల్‌ 17: రాష్ట్ర వన్యప్రాణి కృష్ణ జింకలకు గడ్డుకాలం దాపురించింది. నీటి జాడ వెతుక్కుంటూ అడవులు వదిలి రోడ్లు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. అలాగే కుక్కల బారిన పడి, విషపూరిత పంటలను తింటూ ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదమూ లేకపోలేదు. తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కనుగొండ, నల్గొండ, నేరేడుకొండ, సండ్రడివి తదితర రిజర్వు అడవులు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో ఇక్కడ జింకలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, తంబళ్ళపల్లె మండలాల్లో సుమారు నాలుగు వేల జింకలు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలో జింకలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు విపరీతంగా ఉండడంతో అడవుల్లోని జల వనరులు క్రమంగా ఒట్టిపోతున్నాయి. దీంతో నీటిని వెతుక్కుంటూ జనారణ్యంలోకి వస్తూ రోడ్డు దాటుతూ మృత్యువాత పడుతున్నాయి. అలాగే ఆహార సమస్య కూడా జింకలను వెంటాడుతోంది.

సంరక్షణ చర్యలు శూన్యం

జింకల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ములకలచెరువు పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో 30 కిలోమీటర్లు ముంబాయి-చెన్నై జాతీయ రహదారి ఉంది. అలాగే పెద్దతిప్పసముద్రం మండల పరిధిలో 20 కిలోమీటర్లు, బి.కొత్తకోట మండల పరిధిలో 10 కిలోమీటర్లు అటవీ ప్రాంతానికి ఆనుకోని రోడ్లు ఉన్నాయి. నీరు, మేత కోసం రోడ్ల సమీపానికి వచ్చి వీటిని దాటే క్రమంలో వాహనాల కింద పడి జింకలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒకవేళ అన్నీ దాటుకుని గ్రామ సమీపాల్లోకి వస్తే కుక్కల గుంపులు దాడి చేసి చంపేస్తున్నాయి. క్రిమి సంహారక మందులు వాడిన విషపూరిత పంటలు తిని కూడా అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. ప్రధానంగా ములకలచెరువు సబ్‌స్టేషన్‌ సమీపంలో ముంబాయి-చెన్నై జాతీయ రహదారి పక్కన, పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరు సమీపంలో జింకలు తిరిగే ప్రాంతమని... వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలని సూచిస్తూ ఆరేళ్ళ క్రితం బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల్లో ప్రస్తుతం అక్షరాలు కన్పించడం లేదు. కాగా వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా నీరు నింపాలి. ప్రతి ఏటా వర్షాకాలంలో అటవీ ప్రాంతంలోని బీళ్ళలో గడ్డి విత్తనాలు చల్లితే తిండి సమస్య కూడా ఉండదు. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించే వారు కరువవడంతో ఏటా కృష్ణ జింకలు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వీటి సంరక్షణకు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో జింకల మనుడగ ప్రమాద స్థాయికి వెళ్లే ఆస్కారం లేకపోలేదు.  


జింకల సంరక్షణకు చర్యలు

జింకల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాము. వేసవిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పించేందుకు చర్యలు ప్రారంభించాం. సండ్రడివిలో ఉన్న ఏడు సాసర్‌ బిట్స్‌, నాలుగు దోనలను రెండు, మూడు రోజుల్లోగా ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతాం. నీరు నింపేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. జింకల కోసం అడవిలో కొత్తగా చెక్‌డ్యాం నిర్మించాము. ముందస్తు చర్యల్లో భాగంగా పలుచోట్ల కందకాలు తవ్విస్తున్నాం. 

- మధుసూదన్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌



Updated Date - 2022-04-18T05:10:41+05:30 IST