మేనేజర్‌తో డ్రగ్స్‌పై చాటింగ్‌ చేశా!

ABN , First Publish Date - 2020-09-27T08:44:18+05:30 IST

సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కోణం చుట్టూ తిరుగుతోంది. డ్రగ్స్‌ కేసుల్లో విచారణ జరుపుతున్న మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) మరింత దూకుడు పెంచింది...

మేనేజర్‌తో డ్రగ్స్‌పై చాటింగ్‌ చేశా!

  • ఒప్పుకొన్న నటి దీపిక.. ఆరు గంటలపాటు విచారణ
  • సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడు: శ్రద్ధాకపూర్‌

ముంబై, సెప్టెంబరు 26: సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కోణం చుట్టూ తిరుగుతోంది. డ్రగ్స్‌ కేసుల్లో విచారణ జరుపుతున్న మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) మరింత దూకుడు పెంచింది. శనివారం బాలీవుడ్‌ తారలు దీపికా పదుకోన్‌, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను సుదీర్ఘంగా విచారించింది. దీపికను ఉదయం 9.50 నుంచి మధ్యాహ్నం 3.50 దాకా ప్రశ్నించింది. ఓ దశలో.. ‘‘అవును.. నేను నా మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో డ్రగ్స్‌పై చాటింగ్‌ చేశాను’’ అని ఆమె వెల్లడించినట్లు సమాచారం. దీపిక విచారణ సాంతం.. వాట్సా్‌పలో చాటింగ్‌ చుట్టే కొనసాగిందని తెలిసింది. ప్రధానంగా చాటింగ్‌లో ‘డీ’ అనే పొడి అక్షరాలకు అర్థమేంటనే కోణంలో ఎన్‌సీబీ విచారించింది.


దీపిక నుంచి సమాధానాలు రాబట్టాక.. ఆమె మేనేజర్‌ కరిష్మాను కూడా పిలిపించి.. ఇద్దరీ ఎదురెదురుగా కూర్చోబెట్టి, అవే ప్రశ్నలను వేసింది. ఇద్దరూ విడిగా, కలిపి చెప్పిన సమాధానాలను విశ్లేషించుకుంది. సాయంత్రం దీపిక, కరిష్మ ఒకేసారి బయటకు వచ్చారు. విడివిడిగా కార్లలో వెళ్లిపోయారు. ఎన్‌సీబీకి చెందిన మరో బృందం నటి శ్రద్ధా కపూర్‌ను దాదాపు ఆరు గంటల పాటు విచారించింది. సుశాంత్‌ రాజ్‌పూత్‌కు డ్రగ్స్‌ తీసుకునేవాడని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. చిచోరే సినిమా షూటింగ్‌ సమయంలో.. గ్యాప్‌ దొరికినప్పుడు అతను వ్యానిఈలో కూర్చుని మత్తుపదార్థాలను సేవించడం తాను చూశానని వెల్లడించినట్లు సమాచారం. అయితే.. డ్రగ్స్‌ గురించి సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహాతో శ్రద్ధ చాటింగ్‌ చేశారు. ఆ వాట్సాప్‌ చాటింగ్‌ అంతటినీ ఎన్‌సీబీ అధికారులు శ్రద్ధకు చూపి- అందులో నిజానిజాలను ఆరా తీశారు. సుశాంత్‌కు సోనావాలాలో ఓ ఫామ్‌హౌస్‌ ఉంది. అక్కడ ఆయన తరుచూ పార్టీలిచ్చేవారని, దాదాపు అన్ని పార్టీలకూ శ్రద్ధ హాజరయ్యేదని ఫామ్‌హౌస్‌ వాచ్‌మన్‌ చెప్పడంతో ఆమెను ఎన్‌సీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. చిచోరే విడుదల తర్వాత ఇచ్చిన పార్టీలో కేవలం మద్యం మాత్రమే సరఫరా చేశారని, డ్రగ్స్‌ కాదని శ్రద్ధ వివరించినట్లు సమాచారం. మరో బృందం సారా అలీఖాన్‌ను నాలుగున్నర గంటల పాటు విచారించింది.


కేదార్‌నాథ్‌ సినిమాలో సుశాంత్‌తో నటించిన సారా- తాను కూడా ఎన్నడూ డ్రగ్స్‌ సేవించలేదని వెల్లడించింది. ‘‘ఆ చిత్ర నిర్మాణ సమయంలో సుశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ఫామ్‌హౌస్‌ పార్టీలకు వెళ్లేదాన్ని. సిగరెట్లు తాగేదాన్ని. కానీ మాదకద్రవ్యాల్ని తీసుకోలేదు’’ అని సారా చెప్పినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తిని ప్రశ్నించిన సమయంలో సారా పేరు బయటకు రావడంతో ఆమెను పిలిపించారు. కాగా, సుశాంత్‌సింగ్‌ మరణాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయం చేసిందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎన్‌సీబీ అధికారులంతా మోదీ సన్నిహితులేనని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌదరి ఆరోపించారు.

Updated Date - 2020-09-27T08:44:18+05:30 IST