తగ్గిన టమోటా దిగుబడి

ABN , First Publish Date - 2020-11-22T07:31:57+05:30 IST

పడమటి ప్రాంత టమోటా రైతులను ఇటీవల కురిసిన వాన, మంచు నట్టేట ముంచాయి.

తగ్గిన టమోటా దిగుబడి
మదనపల్లె మండలం పిచ్చలవాండ్లపల్లెలో ఆకుముడత తెగులు సోకి వాడిపోయిన టమోటా

ముంచేసిన ముసురు, మంచు

ఆకుముడత తెగులు 


మదనపల్లె టౌన్‌, నవంబరు 21: పడమటి ప్రాంత టమోటా రైతులను ఇటీవల కురిసిన వాన, మంచు నట్టేట ముంచాయి. పంటకు ఆకుముడత తెగులు సోకడంతో దిగుబడి సగానికి తగ్గిపోయింది. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ రబీ సీజన్‌లో రైతులు 16,000 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.30లక్షల దాకా ఖర్చు చేశారు. వారం క్రితం మూడు రోజులపాటు కురిసిన ముసురు వాన, ప్రస్తుతం రాత్రి పూట కురుస్తున్న మంచు కారణంగా టమోటా పంటకు ఆకుముడత తెగులు సోకింది. దాదాపు 500 ఎకరాల్లో తెగులు సోకడంతో టమోటా ఆకుల చివర ముడుచుకుపోయి, నల్లగా మారి రాలిపోతోంది. టమోటా మొక్క కాండానికి, కాయలకు పొగాకు రంగు  మచ్చలు పడి మొక్కల నుంచి రాలికింద పడిపోతున్నాయి.  


రూ.18.75 కోట్ల నష్టం

సాధారణంగా సాహో రకం టమోటా సాగులో ఎకరాకు పది కోతలు కోస్తే 25 టన్నుల దిగుబడి వస్తుంది. కాని ఇప్పుడు  తెగులుతో 12 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోంది. ఆకుముడత తెగులు సోకిన పది రోజుల్లో మూడు కోతల్లో సగానికి సగం మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే పదిరోజుల్లో ఎకరాకు ఒక కోతలో 2.5టన్నులకు గాను 500 ఎకరాలకు 1250 టన్నుల దిగుబడి తగ్గింది. కిలోకు సగటున ధర రూ.5 వేసుకున్నా మూడు కోతల్లో కలిపి పడమటి రైతులకు రూ.18.75 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. 


సస్యరక్షణ చర్యలతో ఊరట

ఆకుముడత తెగులు సోకడంపై మదన పల్లె ఉద్యానశాఖ అధికారిణి ఉమాదేవిని సంప్రదించగా ప్రస్తుత వాతావరణంలో టమోటా పంటకు ఆకుముడత తెగులు సో కుతుందని చెప్పారు. సస్యరక్షణ పద్ధతులతో తెగులును దూరం చేయొచ్చన్నారు. లీటరు నీటిలో ఒక గ్రాము డై మిథోమార్ఫ్‌, 2 గ్రాముల క్లోరోథనిల్‌, 2గ్రాముల పైరాక్లోస్ట్రా బిన్‌, 3గ్రాముల సైమాక్సనిల్‌, మాంకోజేట్‌, ఒక మిల్లీలీటరు ఆజక్సీస్ట్రాబిన్‌ ద్రావణాన్ని కలిపి ఆకుముడత తెగులు సోకిన టమోటా మొక్క కాండానికి,ఆకులకు పిచికారి చేయాల ని సూచించారు.సచివాలయాల్లో వున్న హార్టికల్చర్‌ అసిస్టెంట్ల దృష్టికి సమస్యను తీ సుకెళ్లి తగు సలహాలు, సూచనలు తీసుకుని రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

Updated Date - 2020-11-22T07:31:57+05:30 IST