15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్యలో తగ్గుదల

ABN , First Publish Date - 2021-11-26T08:45:07+05:30 IST

రాష్ట్రంలో 15 ఏళ్లలోపు పిల్లల జనాభా తగ్గుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులేమో వయసుకు తగ్గట్లుగా ఎత్తు పెరగడం లేదు.

15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్యలో తగ్గుదల

  • నవజాత, శిశు మరణాల్లో జాతీయ సగటు కన్నా మెరుగు
  • రాష్ట్రంలో స్థిరంగా జనాభా పెరుగుదల రేటు  
  • సమస్యల్లో పిల్లలు.. చిన్నారుల్లో 4 రెట్లు పెరిగిన ఊబకాయం
  • వయసుకు తగ్గట్టుగా బరువు పెరగని ఐదేళ్లలోపు పిల్లలు


హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 15 ఏళ్లలోపు పిల్లల జనాభా తగ్గుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులేమో వయసుకు తగ్గట్లుగా ఎత్తు పెరగడం లేదు. బాల భీముళ్లూ పెరుగుతున్నారు. రాష్ట్ర జనాభాలో పదిహేనేళ్లలోపు పిల్లల శాతం ఐదేళ్లలో 2.6 శాతం తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు పెరగని చిన్నారుల శాతం 2.1 శాతం పెరిగింది. పిల్లల్లో ఊబకాయుల సంఖ్య గతంలో కంటే నాలుగు రెట్లు పెరిగింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స) నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 70శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. కండోమ్స్‌ వాడకం, సంతానోత్పత్తి, ప్రసవాలు, శిశు మరణాలు, రక్త హీనత తదితర అంశాలపైనా ఎన్‌ఎ్‌పహెచ్‌ఎ్‌స నివేదికలో పేర్కొన్నారు. మునుపు రాష్ట్ర జనాభాలో 15 ఏళ్లలోపు పిల్లలు 25.1 శాతం ఉంటే అది ప్రస్తుతం 22.5 శాతానికి తగ్గింది. జాతీయ సగటు 28.6 శాతం నుంచి 26.5 శాతానికి పడిపోయింది. 


ఈ విషయంలో జాతీయ సగటు కంటే 4 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేని వారు గతంలో 28 శాతముంటే ప్రస్తుతం 33.1కి పెరగారు. జాతీయ సగటు 35.5శాతంగా ఉంది. మునుపు పిల్లల్లో 0.7 శాతం ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్లు నమోదవ్వగా తాజాగా అది 3.4 శాతానికి పెరిగింది. నవజాత శిశు మరణాల్లో జాతీయ సగటు 24.9 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 16.8 శాతంగా నమోదైంది. అలాగే శిశుమరణాల్లో(ఐఎమ్మార్‌)లో జాతీయ సగటు 35.2గా ఉంటే, తెలంగాణలో అది 26.4గా నమోదైంది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో జాతీయ సగటు 41.9గా ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం అది 29.4గా నమోదైంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో మన దగ్గర 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. జాతీయ సగటు మాత్రం 67 శాతమే ఉంది. 


మరిన్ని వివరాలు

రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు స్థిరంగా ఉంది. జాతీయ సంతానోత్పత్తి రేటు 2.0గా ఉంటే రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం నమోదైన 1.8 రేటే కొనసాగడం విశేషం. 

రాష్ట్రంలో గర్భిణుల్లో ఎక్కువకు ఎక్కువగా ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ప్రతి వంద ప్రసవాల్లో 97 ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఈ విషయంలో జాతీయ సగటు (88.6శాతం) కన్నా మెరుగ్గా ఉన్నాం. శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి.  

రాష్ట్రంలో సర్కారీ దవాఖానల్లో కేవలం 49.7 శాతం ప్రసవాలే జరుగుతుండగా, జాతీయ సగటు మాత్రం 61.9 శాతంగా ఉంది. 

రాష్ట్రంలో కండోమ్స్‌, గర్భ నిరోధక మాత్రల వాడకంపై అవగాహన, ఆసక్తి లేదని వెల్లడైంది. కండోమ్‌ల వాడకం పరంగా జాతీయ సగటు 9.5 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం అది 0.8 మాత్రమే ఉంది. గర్భనిరోధక మాత్రల వాడకం పరంగా జాతీయ సగటు 5.1 ఉండగా, రాష్ట్ర సగటు 0.8గా నమోదైంది.  కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో జాతీయ సగటుతో పొల్చుకుంటే తెలంగాణ చాలా మెరుగ్గా ఉంది. జాతీయ సగటు 66.7 శాతం ఉండగా, తెలంగాణలో అది 68.1 శాతంగా నమోదైంది.  

ఆరోగ్య బీమా విషయంలో కూడా రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా 41శాతం మందికి ఆరోగ్య బీమా ఉంటే రాష్ట్రంలో అది 60.8 శాతంగా నమోదైంది.  

దేశంలో 12-23 నెలల చిన్నారుల్లో  94.5 శాతం మంది  ప్రభుత్వ ఆస్పత్రుల ఆధ్వర్యంలోనే టీకాలు తీసుకుంటున్నారు. ప్రైవేటులో కేవలం 4.2 శాతమే వ్యాక్సిన్స్‌ తీసుకుంటున్నట్లు ఆరోగ్య సర్వేల్లో వెల్లడైంది. ఇక తెలంగాణలో కూడా 94.1 శాతం మంది ప్రభుత్వ, 4.5 శాతం మంది ప్రైవేటులో టీకాలు తీసుకుంటున్నారు. 

దేశవ్యాప్తంగా సాధారణ మహిళల్లో 15-49 మధ్య వయస్కుల్లో  57.2 శాతం ఎనిమియాతో బాధపడుతుంటే రాష్ట్రంలో ఇది కాస్త ఎక్కువగా (57.8శాతం) ఉంది. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో గతంలో 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా అది ఇప్పుడు ఏకంగా 70 శాతానికి పెరగడం ఆందోళన కల్గిస్తోంది. 

రాష్ట్రంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. మహిళల్లో 30.1శాతం ఊబకాయంతో బాధపడుతున్నారు. పురుషుల్లో 32.3శాతం ఊబకాయులేనని తేలింది.   

రాష్ట్రంలో రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా పదిహేనేళ్ల పైబడిన ఆడవారిలో 12.4 శాతం మందికి బీపీ ఉన్నట్లు  తేలగా.. రాష్ట్రంలో మాత్రం అది 13.6 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా పురుషుల్లో 15.7శాతం బీపీతో బాధపడుతుంటే రాష్ట్రంలో అది 18.5గా నమోదైంది. రాష్ట్రంలో 15 ఏళ్లు  పైబడిన మహిళల్లో  26.1 శాతం, పురుషుల్లో 31.4 శాతం మంది హై బీపీకి.. మహిళల్లో 14.7 శాతం మంది, పురుషుల్లో 18.1 శాతం మంది మధుమేహానికి మందులు వాడుతున్నారు.

Updated Date - 2021-11-26T08:45:07+05:30 IST