కేసులు తగ్గుతున్నాయి.. కానీ!

ABN , First Publish Date - 2022-01-28T08:54:34+05:30 IST

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుం కరోనా కేసుల క్షీణత కనిపిస్తోందని, అయితే.. మరికొంత కాలం పాటు పరిశీలన అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కేసులు తగ్గుతున్నాయి.. కానీ!

  • కొంత కాలం పరిశీలన కావాలి
  • ‘మహా’, ఢిల్లీ, బెంగాల్‌లలో క్షీణత
  • ఏపీ, కర్ణాటకలో పెరుగుదల
  • 10 రాష్ట్రాల్లోనే 77% యాక్టివ్‌లు
  • వ్యాక్సిన్‌తో మరణాలు స్వల్పం
  • కొత్తగా 2.86 లక్షల కేసులు 
  • ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ లేదు


న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుం కరోనా కేసుల క్షీణత కనిపిస్తోందని, అయితే.. మరికొంత కాలం పాటు పరిశీలన అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తల పాటింపు తప్పనిసరి అని వివరించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిసా, హరియాణల్లో పాజిటివ్‌లు తగ్గుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, రాజస్థాన్‌లో మాత్రం అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు చెప్పింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌కుమార్‌ సింగ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఒమైక్రానే ఆధిపత్య వేరియంట్‌ అని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. సబ్‌ వేరియంట్‌ బీఏ.2తోనే పాజిటివ్‌లు అధికంగా వస్తున్నట్లు తెలిపారు.  


మూడోరోజూ 3 లక్షల దిగువనే..

దేశంలో బుధవారం 2,86,384 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 573 మరణాలు నమోదయ్యాయి. మూడో రోజూ కేసులు 3 లక్షల దిగువన ఉన్నాయి. పాజిటివ్‌లను మించి రికవరీలు వచ్చాయి. అయితే, పాజిటివ్‌ రేటు 19.59కి చేరింది. కొవిడ్‌ నిబంధనలను ఫిబ్రవరి  వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిబంధనలను పాటిస్తూ.. పాఠశాలలను దశలవారీగా తెరిచేందుకు అనుమతిచ్చే ఆలోచనలో ఉంది.  ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేశారు. రెస్టారెంట్లు, సినిహా హాళ్లను 50ు సామర్థ్యంతో నడిపించేందుకు అనుమతించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు పాజిటివ్‌ వచ్చింది. ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ (90) శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఈమె తిరస్కరించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేశారు. 


7 నెలలు పోరాడి గెలిచిన ప్రవాసీ

యూఏఈలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌గా పనిచేస్తున్న కేరళ ప్రవాసీ అరుణకుమార్‌ నాయర్‌ (38).. కొవిడ్‌తో ఏడు నెలలు పోరాడి బయటపడ్డాడు. సెకండ్‌ వేవ్‌ సమయంలో వైరస్‌కు గురైన అరుణ్‌ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లూ చికిత్స పొంది మృత్యువును జయించాడు.

Updated Date - 2022-01-28T08:54:34+05:30 IST