అతను దివ్యాంగుడు.. గుళ్లో దొరికే కొబ్బరి చిప్పలతో ఉపాధి.. అతని క్రియేటివిటీకి బ్రహ్మరథం పట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-01-16T13:48:19+05:30 IST

ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టిన తరువాత వాటి..

అతను దివ్యాంగుడు.. గుళ్లో దొరికే కొబ్బరి చిప్పలతో ఉపాధి.. అతని క్రియేటివిటీకి బ్రహ్మరథం పట్టాల్సిందే!

ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టిన తరువాత వాటి చిప్పలను ఒక మూలన పడేస్తుంటారు. ఇటువంటి వ్యర్థాలతో అద్భుతాలు చేస్తున్నాడు ఒడిశాకు చెందిన సవ్యసాచి పటేల్. దివ్యాంగుడైన అతనికి కళా కృతులు చేయడమంటే ఎంతో ఇష్టం. అయితే చదువు, ఉద్యోగాల కారణంగా గతంలో తన ప్రతిభను బయటపెట్టలేకపోయాడు. అయితే కరోనా అందరి జీవితాలను సమూలంగా మార్చివేసింది. ఈ నేపధ్యంలోనే సవ్యసాచి పటేల్ నూతన ఉపాధి మార్గాలను అన్వేషించాడు. కొబ్బరి చిప్పలతో అద్భుత కళాఖండాలు రూపొందించడం ప్రారంభించాడు. 


కొబ్బరి చిప్పలతో టీ కప్పులు,  గ్లాసులు, రథాలు, శివలింగాలు, బొమ్మ స్కూటర్ మొదలైన 20 రకాల హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులను రూపొందించాడు. ఆరు నెలల్లోనే సవ్యసాచి చేస్తున్న ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ సందర్భంగా సవ్యసాచి మాట్లాడుతూ.. ‘హస్త కళలంటే నాకెంతో ఇష్టం. మొదట్లో ధర్మాకోల్‌తో కళాకృతులు చేసేవాడిని. అలాగే పండ్లు, కూరగాయలతో కార్వింగ్ చేసేవాడిని. లాక్‌డౌన్ సమయంలో యూట్యూబ్ మాధ్యమంలో కొబ్బరి షెల్‌తో కళా కృతులు చేయడం నేర్చుకున్నాను. మొదట్లో దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తరువాత దీనిని ఉపాధిగా మార్చుకున్నాను. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన నేను ఐఆర్సీటీసీ క్యాటరింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించాను. అయితే కొన్ని కారణాలతో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సివచ్చింది. దీంతో కొబ్బరి చిప్పలతో అద్భుత కళా కృతులు చేయడం ప్రారంభించాను. ఆరు నెలల వ్యవధిలోనే నెలకు ఈ రంగంలో నిలదొక్కుకున్నానని’ తెలిపాడు. కాగా సవ్యసాచి రూపొందించిన కళాకృతులు కళాభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

Updated Date - 2022-01-16T13:48:19+05:30 IST