పౌరసత్వం కోసం దరఖాస్తు చేసేందుకు ప్రకటిత విదేశీయునికి హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2022-01-12T01:45:11+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019 ప్రకారం పౌరసత్వానికి దరఖాస్తు

పౌరసత్వం కోసం దరఖాస్తు చేసేందుకు ప్రకటిత విదేశీయునికి హైకోర్టు అనుమతి

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019 ప్రకారం పౌరసత్వానికి దరఖాస్తు చేయడానికి బబ్లు పౌల్‌కు గౌహతి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన విదేశీయుడని 2017లో ఓ ట్రైబ్యునల్ ప్రకటించింది. అయితే ఆయన సీఏఏ ప్రకారం పౌరసత్వం లబ్ధిని పొందవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. 


అస్సాంలోని కరీంగంజ్ జిల్లా, పత్తర్‌కండి నివాసి బబ్లు పౌల్ హిందూ మతస్థుడు. 57 ఏళ్ళ క్రితం తన తండ్రి, తాతలతో కలిసి తూర్పు పాకిస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వచ్చారు. ఆయన వయసు అప్పట్లో రెండేళ్ళు. 1984లో పత్తర్‌కండిలో స్థిరపడ్డారు. అక్కడ ఆయన ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. తూర్పు పాకిస్థాన్ 1971 మార్చి 26న బంగ్లాదేశ్‌గా మారింది. 


2017 మే నెలలో ఫారినర్స్ ట్రైబ్యునల్-2 ఇచ్చిన తీర్పులో బబ్లు పౌల్ విదేశీయుడని ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి 1971 మార్చి 25న లేదా ఆ తర్వాత చట్టవిరుద్ధంగా భారత దేశంలోకి వచ్చారని పేర్కొంది. ఆయన ఈ తీర్పును సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. 


‘‘పిటిషనర్ 1964లో చెల్లుబాటయ్యే పత్రాలేవీ లేకుండా భారత దేశంలోకి ప్రవేశించారు. ఆయనకు ఈ దేశం ఆశ్రయం ఇచ్చింది. భారత దేశంలోకి ప్రవేశించేందుకు చెల్లుబాటయ్యే దస్తావేజు/పాస్‌పోర్టు వంటివేవీ ఆయన వద్ద లేవు. కేవలం ఈ దేశం ఆయనకు ఆశ్రయం ఇచ్చినంత మాత్రానికి ఆయన చట్టబద్ధమైన వలసదారు అని భావం కాదు’’ అని హైకోర్టు తెలిపింది. 


తాను భారతీయ పౌరుడినేనని బబ్లు వాదించారు. కానీ ఆయనను భారతీయ పౌరునిగా ప్రకటించేందుకు హైకోర్టు అశక్తత వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందడంపై నిషేధాన్ని సీఏఏ ఉపసంహరించిందని తెలిపింది. పాస్‌పోర్టు (భారత దేశంలోకి ప్రవేశం) చట్టం, 1920 వంటి కేంద్ర చట్టాల్లో మినహాయింపులు కూడా ఉన్నాయని తెలిపింది. సీఏఏ ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.


Updated Date - 2022-01-12T01:45:11+05:30 IST