ఆన్‌లైన్‌ తరగతులే...పాఠశాలల పునఃప్రారంభంపై తొలగని సందిగ్ధత

ABN , First Publish Date - 2020-07-04T19:02:35+05:30 IST

కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుండడంతో పాఠశాలలను పునఃప్రారంభించడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. జూన్‌ రెండో వారంలో తెరవాల్సిన పాఠశాలలను కరోనా వైరస్‌ కారణంగా ఆగస్టు మూడో తేదీన

ఆన్‌లైన్‌ తరగతులే...పాఠశాలల పునఃప్రారంభంపై తొలగని సందిగ్ధత

ఆగస్టు 3 నుంచి తెరుస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం

నానాటికీ విజృంభిస్తున్న కరోనాతో పునరాలోచన

ప్రత్యామ్నాయంపై దృష్టి.. విద్యా రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం

విద్యార్థుల్లో ఇళ్లల్లో ఉన్న టీవీలు, కంప్యూటర్‌,ఇంటర్నెట్‌, తల్లిదండ్రుల మొబైల్‌ వివరాల సేకరణ


నర్సీపట్నం(విశాఖ పట్టణం): కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుండడంతో పాఠశాలలను పునఃప్రారంభించడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. జూన్‌ రెండో వారంలో తెరవాల్సిన పాఠశాలలను కరోనా వైరస్‌ కారణంగా ఆగస్టు మూడో తేదీన పునఃప్రారంభించాలని గతంలో నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టులో కూడా స్కూళ్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మూడున్నర నెలల నుంచి విద్యార్థులు చదువుకు దూరం కావడం, పాఠశాలలను ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ బోధనపై దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సమాచారాన్ని సేకరించింది. మూడు రోజుల కిందట ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃప్రారంభం, ప్రత్యామ్నాయ బోధన, తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆగస్టు మూడో తేదీ నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటాయని గతంలో ప్రకటించినప్పటికీ దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు చివరి వరకు పాఠశాలలు తెరిచే అవకాశం లేదని ఉన్నత స్థాయి సమావేశంలో భావించినట్టు సమాచారం. ఆ తరువాత కూడా కరోనా అదుపులోకి రాకుంటే ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని కుదించిన సిలబస్‌తో ఆన్‌లైన్‌ విద్యాబోధన ద్వారా పూర్తిచేయాలనే యోచనలో ప్రభుత్వం వుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.


ఇప్పటికే సమాచార సేకరణ 

ఆన్‌లైన్‌ విద్యా బోధనకు తగిన సదుపాయాలు వుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించింది. విద్యా శాఖ పంపిన ప్రత్యేక ప్రొఫార్మా మేరకు విద్యార్థి ఇంటిలో టీవీ (స్మార్ట్‌/సాధారణ), దానికి కేబుల్‌/డీటీహెచ్‌ కనెక్షన్‌, తల్లిదండ్రులకు ఉన్న మొబైల్‌ ఫోన్ల (స్మార్ట్‌/ఆండ్రాయిడ్‌) వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేకరించారు. ఇంకా కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు ఎంతమందికి ఉన్నాయి? ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వుందా? వంటి సమాచారాన్ని కూడా సేకరించి ప్రభుత్వానికి నివేదించారు.  


వాట్సాప్‌ గ్రూపుల్లో వర్క్‌ షీట్‌లు

కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తల్లిదండ్రుల ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం...ఉపాధ్యాయ సంఘాలను కోరింది. స్మార్ట్‌ఫోన్లు వున్న విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, సబ్జక్టుల వారీగా తయారుచేసిన వర్క్‌షీట్‌లను ఆ గ్రూపులో ఉంచాలని, సెల్‌ఫోన్లు లేని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వర్క్‌షీట్‌లను అందజేయడమే కాకుండా, ఆ మరుసటి వారం వాటిని సేకరించి పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు ఉపాధ్యాయులు వారానికి ఒకటి, రెండు రోజులపాటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వర్క్‌ షీట్లు అందించాలని సూచించింది.  


అమ్మఒడి నుంచి ట్యాబ్‌లు ఇవ్వండి

ప్రస్తుతం సప్తగిరి ఛానెల్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. ఒక్కో క్లాసుకు రూ.90 వేలకుపైగా ఖర్చవుతున్నందున అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న నిధుల నుంచి ప్రతి విద్యార్థికీ ఒక ట్యాబ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీజీ నాథ్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-04T19:02:35+05:30 IST