మరణం.. లెక్కేలేదు..!

ABN , First Publish Date - 2021-04-22T07:01:12+05:30 IST

జిల్లాలో హెల్త్‌ బులిటెన లెక్కల మేరకు ఏప్రిల్‌ నెల 21 రోజుల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఈ పది పదకొండు రోజుల్లోనే 12మంది కరోనా బారిన పడి కన్నుమూశారు.

మరణం.. లెక్కేలేదు..!


అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య నిల్‌

బుధవారం రాయచోటి, కడప, ఎర్రగుంట్లలో ముగ్గురు మృతి

రాష్ట్ర, జిల్లా హెల్త్‌ బులిటెనకు సరిపోని లెక్కలు 

భయానక వేగంగా వైరస్‌

గడిచిన 24 గంటల్లో 216 కేసులు నమోదు 

పెరుగుతున్న బాధితులు.. మరణాలు 


కరోనా వైరస్‌.. జిల్లాను వణికిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన మేరకు గడిచిన 24గంటల్లో 216 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇందులో ఒక్కరు కూడా మృతి చెందలేదని బుధవారం హెల్త్‌ బులిటెన ద్వారా తెలుస్తోంది. అయితే కడప, ఎర్రగుంట్ల, రాయచోటిలో కరోనాతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పరీక్షలు లేకుండా వైరస్‌ లక్షణాలతో మృతి చెందుతున్న వారి వివరాలు లెక్కలోకి రావడం లేదు. ఓ పక్క కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రజలు.. మరో పక్క వ్యాక్సినేషన కోసం జనం.. మరో వైపు ఆసుపత్రులలో పెరిగిన బాధితుల తాకిడి... ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. కరోనా ఎప్పుడు.. ఎక్కడ ఎవరిని కాటేస్తుందో అన్న భయం క్రమంగా పెరుగుతోంది.


కడప, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో హెల్త్‌ బులిటెన లెక్కల మేరకు ఏప్రిల్‌ నెల 21 రోజుల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఈ పది పదకొండు రోజుల్లోనే 12మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన హెల్త్‌ బులిటెన లెక్కల ప్రకారం గడిచిన 24గంటల్లో కరోనా మృతుల సంఖ్య నిల్‌గా చూపుతోంది. అయితే రాయచోటి, ఎర్రగుంట్ల, కడప పట్టణాల్లో ముగ్గురు కరోనా బారిన పడి ఇద్దరు కడప రిమ్స్‌లో, ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ లెక్కలు హెల్త్‌ బులిటెనలోకి రాలేదు. ఇక కరోనా లక్షణాలతో మృత్యువాత పడ్డా సహజ మరణాలుగానే అంత్యక్రియలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హెల్త్‌ బులిటెన ప్రకారం బుధవారం నాటికి మొత్తం జిల్లాలో 476 మంది మృత్యువాత పడ్డట్లు చూపితే జిల్లా హెల్త్‌ బులిటెన ప్రకారం 546 మంది మృతి చెందినట్లు చూపుతోంది. జిల్లా, రాష్ట్ర హెల్త్‌ బులిటెనలకు పొంతన ఉండటం లేదు. ఆయా జిల్లాల్లో పలు శ్మశాన వాటికల్లో తాజా పరిస్థితి విశ్లేషిస్తే.. గతంతో పోలిస్తే అంత్యక్రియలకు వస్తున్న మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఎవరు కరోనాతో మృతి చెందారో... ఎవరిది సహజమరణమో అంతుచిక్కడం లేదని కాటికాపరులు అంటున్నారు.


కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలో విస్తరిస్తున్న వైరస్‌

కడప నగరంతో పాటు రాజంపేట, ప్రొద్దుటూరు పట్టణాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం హెల్త్‌ బులిటెన ప్రకారం ప్రొద్దుటూరులో 65, కడపలో 47, రాజంపేటలో 24 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 38 మండలాల్లో 216 కేసులు నమోదు కాగా అందులో కేవలం 11 మండలాల్లోనే 176 కేసులు వచ్చాయి. మిగతా 27మండలాల్లో ఒకటి రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. అంటే.. జిల్లాలో 78శాతం మండలాల్లో వైరస్‌ వ్యాపించినట్లు తెలుస్తోంది. భయానకవేగంతో మహమ్మారి పల్లె, పట్టణాలను చుట్టేస్తుండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు.


బుధవారం కరోనా మృతుల వివరాలు

- రాయచోటి పట్టణానికి చెంది 32 ఏళ్ల యువకుడు కరోనా లక్షణాలతో వారం రోజుల క్రితం కడప రిమ్స్‌లో చేరారు. బుధవారం మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పటివరకు ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్ష రిజల్ట్‌ కూడా రాకపోవడం కొసమెరుపు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సొంత పొలంలో కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు సమీప రైతులు, బంధువులు అంగీకరించకపోవడంతో మాండవ్య నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడే మరో వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 

- ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ కాలనీలో ఓ ఉద్యోగిని(50) కరోనా బారిన పడ్డారు. ఈ నెల 13న జ్వరం వచ్చింది. సాధారణ జ్వరమేనని స్థానికంగా చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో 19వ తేదీన రిమ్స్‌కు తరలించారు. బుధవారం 10.45 గంటలకు ఆమె మృత్యువాత పడ్డారు. అంత్యక్రియలకు స్థానికులు ఒప్పుకోకపోవడంతో కడప రిమ్స్‌ సమీపంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. 

- కడప నగరం చిన్నచౌక ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి మంగళవారం కరోనా లక్షణాలతో కన్నుమూశారు. ఆయన ఇంటిలో భార్య, తండ్రికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కొడుకు మరణించిన మరుసటి రోజే బుధవారం మధ్యాహ్నం కరోనాతో తండ్రి కూడా కన్ను మూశారు. తండ్రి కొడుకులు కరోనా వైర్‌సతో మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. 


లెక్కకు రాని మరణాలెన్నో..

- కడప నగరంలో 11కు పైగా శ్మశాన వాటికలున్నాయి. బుధవారం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికను పరిశీలిస్తే గతంలో వారానికి రెండు మృతదేహాలు అంత్యక్రియలకు తీసుకొస్తే ఈ ఒక్క వారంలోనే ఐదు మృతదేహాలొచ్చినట్లు కాటికాపరులు చెబుతున్నారు. బైపాస్‌రోడ్డు పక్కనున్న  శ్మశాన వాటికలో గతంలో వారంలో సగటున రెండు మృతదేహాలొస్తే ప్రస్తుతం రోజుకు సగటున రెండు మృతదేహాలు వస్తున్నట్లు అక్కడి కాపరులు వివరిస్తున్నారు. ఇందులో కరోనా మరణం ఏదో.. సాధారణ మరణం ఏదో చెప్పలేమంటున్నారు. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.

- ప్రొద్దుటూరు పట్టణంలో 12 శ్మశాన వాటికలు ఉన్నాయి. గతంలో నెలకు 40మృతదేహాలు అంత్యక్రియలకు తీసుకొస్తే ప్రస్తుతం 60 మృతదేహాలొస్తున్నాయని మున్సిపల్‌ అధికారులు అంటున్నారు. 

- బద్వేలు పట్టణంలో 8 శ్మశాన వాటికలున్నాయి. గతంలో నెలకు 20 మృతదేహాలు శ్మశాన వాటికకు వస్తే ప్రస్తుతం 30కు పైగా వస్తున్నాయని మున్సిపల్‌ అధికారుల అధికారిక లెక్కలు. రాయచోటిలో హిందువులకు ప్రత్యేక శ్మశాన వాటికలు లేకపోవడంతో మాండవ్య నది ఒడ్డున, సొంత పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య ఎంతనేది తేలడం లేదు. 


బుధవారం 4కు పైగా కరోనా కేసులు నమోదైన మండలాలు

మండలము కేసులు 

కడప 47

ప్రొద్దుటూరు 65

రాజంపేట 24

జమ్మలమడుగు 8

రైల్వేకోడూరు 5

పెనగలూరు 5

రాజుపాలెం 5

ఒంటిమిట్ట 4

నందలూరు 4

బద్వేలి 4

పుల్లంపేట 3

పులివెందుల 3

----------------------------------------------------


పది రోజుల్లో కరోనా మృతుల వివరాలు

తేదీ మృతులు

12 1

13 -

14 -

15 -

16 3

17 1

18 -త

19 2

20 5

21 -


Updated Date - 2021-04-22T07:01:12+05:30 IST