Abn logo
Oct 28 2021 @ 01:31AM

డీలర్ల గగ్గోలు

మార్కాపురంలో గోతాలు పట్టుకొని నిరసన తెలుపుతున్న డీలర్లు

కమీషన్‌ బకాయిలు ఇవ్వాలి,  గోతాల జీవో ఉపసంహరించాలని డిమాండ్‌

చాపకింద నీరులా ఆందోళన

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిరసన

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 27 : ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రేషన్‌ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందిస్తూ వచ్చిన డీలర్లకు  రావాల్సిన రాయితీలను కూడా ప్రభుత్వం కాలరాసింది. కమీషన్‌ను కూడా సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌ పెట్టింది. గోతాల అమ్మకాల ద్వారా నెట్టుకొస్తున్న డీలర్లు ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ కొద్దిపాటి రాబడినీ కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన మొబైల్‌ వాహనాల కారణంగా ఆదాయం కోల్పోయిన డీలర్లకు ప్రభుత్వం గోతాలపై తాజాగా ఇచ్చిన జీవో నెంబరు 10తో మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పౌరసఫరాల శాఖ గోడౌన్ల నుంచి రేషన్‌షాపులకు తరలించిన బియ్యం గోతాలను డీలర్లే గతంలో విక్రయించుకునేవారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో కారణంగా ఆ ఆదాయాన్ని కూడా డీలర్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు  ప్రభుత్వ తీరుకు నిరసనగా వారు రోడ్డెక్కారు. 


గోతాలను ఇవ్వకపోతే చర్యలు

బియ్యం గోతాలను పౌరసరఫరాల శాఖకు తిరిగి అప్పగించకపోతే చర్యలు తప్పవన్న హెచ్చరికల నేపథ్యంలో డీలర్లు అయోమయంలో ఉన్నారు. ముందుగా గోనెసంచులు ప్రభుత్వానికి ఇస్తే రూ.20 ఇస్తామని సర్క్యులర్‌  జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఉచితంగా ఇవ్వాలని జీవోను మార్చింది. ఇంకోవైపు సంచులు ఇవ్వకపోతే అలాట్‌మెంట్‌ కూడా కేటాయించమని హెచ్చరికలు జారీచేయడం తో డీలర్లలో ఇప్పుడు మరింత ఆందోళన నెలకొంది. 


ఆందోళనకు దిగుతున్న డీలర్లు

 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం డీలర్లు జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. ఒంగోలు, అద్దంకి, సింగరాయకొండ, మార్కాపురం పౌరసరఫరాల గోడౌన్ల వద్ద నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 10ని ఉపసంహరించుకోవడం తోపాటు తమకు రావాల్సిన కమీషన్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని  ఉధృతం చేస్తామని  హెచ్చరించారు. ఒంగోలులో జరిగిన ఆందోళనలో సంఘ జిల్లా అధ్యక్షుడు కాటా ఆంజనేయులు పాల్గొన్నారు. 


మంత్రిని కలిసి వినతిపత్రం అందజేత

డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చూడాలని ఒంగోలు నగర రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కోరారు. బుధవారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలులో కలిసి వినతిపత్రం అందజేశారు.  వీరిలో సంఘ నగర అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, మఽధు, పి.వాసు, చంద్రశే ఖర్‌రెడ్డి, కరు ణాకర్‌, ఆర్‌.ఆం జనేయులు, వే మూరి వెంగళ రావు, ప్రదీప్‌, కోటి తదితరులు ఉన్నారు