15 వరకే గడువు

ABN , First Publish Date - 2022-08-07T05:07:58+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి రైతులు ఈకేవైసీ నమోదు చేసే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెండు సార్లు గడువు పెంచినా ప్రక్రియ పూర్తి కాలేదు.

15 వరకే గడువు



పీఎం కిసాన్‌ ఈకేవైసీకి దగ్గరపడుతున్న సమయం
ఇప్పటివరకు 53 శాతమే నమోదు
పని చేయని సర్వర్‌

కలెక్టరేట్‌, ఆగస్టు 6:
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి రైతులు ఈకేవైసీ నమోదు చేసే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెండు సార్లు గడువు పెంచినా ప్రక్రియ పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా సుమారు 47 శాతం మంది రైతులు ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రధానంగా సర్వర్‌ పని చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పీఎంకేఎస్‌వై కింద నాలుగైదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేలు జమ చేస్తోంది. ఏటా ఏప్రిల్‌, మే నెలలో తొలివిడతగా రూ.రెండు వేలు, ఆగస్టు ,సెప్టెంబరులో రెండో విడతగా రూ.రెండు వేలు, డిసెంబరు, జనవరిలో మూడో విడతగా రూ.రెండు వేలు చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తోంది. రెండో విడత నిధులు విడుదల చేసేలోగా ప్రతి రైతూ ఈకేవైసీ నమోదు చేయాలని కేంద్రం సూచించింది. జూన్‌ 30లోగా పూర్తి చేయాలని గడువు ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురుకావడం, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ లేకపోవడంతో నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. గత నెలలో ఈకేవైసీ గడువును జూలై 31 వరకూ పెంచారు. అప్పటికి జిల్లాలో 50 శాతం మంది రైతులు మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారు. మరోసారి గడువును ఈనెల 15 వరకూ పెంచారు. జిల్లాలోని 212970 మంది రైతులకు గాను 113330 మంది రైతులు ఈకేవైసీ నమోదు పూర్తి చేశారు. ఇంకా 99,640 మంది రైతులు చేయాల్సి ఉంది.
ఈకేవైసీ చేసుకోవాలంటే ముందుగా రైతు తన ఆధార్‌ నెంబరుకు ఫోన్‌ నెంబరు అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడే అసలు సమస్య. ఇందుకోసం ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ తరువాత కామన్‌ సర్వీసు సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా ఈకేవైసీ చేసుకోవాలి. మరోవైపు ఓటీపీ ఆప్షన్‌ కూడా ఉంది. అలాగే రైతులెవరైనా తన ఫోన్‌ నెంబరును తనొక్కరికే ఇవ్వాలి. మరోవైపు సర్వర్‌ పని చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి 9 రోజులే గడువు ఉంది. ఈలోగా ప్రక్రియ పూర్తి అవుతుందా? లేదా చూడాలి. ఇదే విషయమై జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తారాక రామారావు వద్ద ప్రస్తావించగా జిల్లాలో ఇప్పటివరకూ 53.21 రైతులకు ఈకేవైసీ పూర్తయిందని, మిగిలిన వారికి ఈనెల 15లోగా పూర్తి చేసుకోవాల్సి ఉందని వెల్లడించారు.


Updated Date - 2022-08-07T05:07:58+05:30 IST