డీసీఎంఎస్‌.. రైతు డిపోలు

ABN , First Publish Date - 2021-06-17T04:13:29+05:30 IST

జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఆధ్వర్యంలో జిల్లాలో రైతులకు ఎరువులు, పురుగు మందులు అందచేయడానికి రైతు డిపోలు ఏర్పాటు చేస్తున్నారు.

డీసీఎంఎస్‌.. రైతు డిపోలు
డీసీఎంఎస్‌ కార్యాలయం

జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాటు 

ఎరువులు, పురుగు మందుల విక్రయాలు


నెల్లూరు (హరనాథపురం), జూన 16 : జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఆధ్వర్యంలో జిల్లాలో రైతులకు ఎరువులు, పురుగు మందులు అందచేయడానికి రైతు డిపోలు ఏర్పాటు చేస్తున్నారు. కావలి, నాయుడుపేట, ఆత్మకూరు. కోవూరు తదితర చోట్ల ఈ  డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మకూరు, నాయుడుపేటలలో ఇప్పటికే చౌకధరల దుకాణాలు నడుస్తుండగా వీటితోపాటు అదనంగా రైతు డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. 


రూ.16 కోట్ల వ్యాపారం 


నెల్లూరులోని డీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎరువుల గోదాము ద్వారా ప్రస్తుతం ఎరువుల అమ్మకం జరుగుతోంది. ఏటా రూ.17 కోట్ల అమ్మకాలు జరుగుతుండటంతో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని డీసీఎంఎస్‌ అధికారులు భావించి రైతు డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి విజయవంతం అయితే జిల్లావ్యాప్తంగా వాటిని విస్తరింప చేయనున్నారు. 


ఖరీఫ్‌, రబీలో వ్యాపార లక్ష్యం


ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో రూ.200 కోట్ల వ్యాపార లక్ష్యంగా డీసీఎంఎస్‌ అధికారులు నిర్ధేశించుకున్నారు. 2021, జనవరి నుంచి ఇప్పటివరకు ఖరీఫ్‌ సీజనలో 20 ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేసి రూ.134 కోట్ల వ్యాపారం చేశారు. 2020, జనవరి నుంచి డిసెంబరు వరకు ధాన్యం కొనుగోళ్ల ద్వారా రూ.137 కోట్లు, శనగల కొనుగోలు ద్వారా రూ.6 కోట్లు, ఎరువుల ద్వారా రూ. 16 కోట్ల వ్యాపారం చేసింది. ఈ సంవత్సరం ఎడగారు సీజనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలనే తలంపుతో అధికారులు ఉన్నారు. 2019 డిసెంబరు 5న త్రిసభ్య కమిటీ పేరుతో పాలక మండలి ఏర్పడగా, 2020 ఫిబ్రవరి 7న పూర్తిస్థాయి మేనేజర్‌ నియామకం జరిగింది.  ఈ నియామకాల ద్వారా డీసీఎంఎస్‌ వ్యాపారం పూర్తిస్థాయిలో పెరిగింది. రూ.50 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పైబడి ప్రతి సంవత్సరం వ్యాపారం సాగుతోంది. 2021లో రూ.159 కోట్ల వ్యాపారం జరగడం విశేషం. ఎరువుల వ్యాపారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు, రైతు డిపోలను ఏర్పాటు చేస్తుండటంతో డీసీఎంఎస్‌ వ్యాపారం ఇతోధికంగా పెరగనుంది.


రైతులకు సేవలను విస్తృత పరుస్తాం 


- డి.వెంకటస్వామి, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌

రైతులకు డీసీఎంస్‌ సేవలను విస్తృత పరుస్తాం. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోనే డీసీఎంఎస్‌ ఎరువుల అమ్మక దుకాణం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వీటిని విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో కోవూరు, నాయుడుపేట, కావలి, ఆత్మకూరు తదితర చోట్ల రైతు డిపోలను ఏర్పాటు చేస్తున్నాం. డీసీఎంఎస్‌ ద్వారా రైతులకు ఇతోధికంగా సేవలను అందించనున్నాం.

Updated Date - 2021-06-17T04:13:29+05:30 IST