దసరా ‘ప్రత్యేక’ం

ABN , First Publish Date - 2021-10-10T05:51:12+05:30 IST

కరోనా కాస్త శాంతించడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే పాత రోజులకు అలవాటు పడుతూ పండగలు చేసుకోవడం ప్రారంభించారు.

దసరా ‘ప్రత్యేక’ం

ప్రయాణికులపై చార్జీల బాదుడు

ఆర్టీసీలో సాధారణంకంటే 50శాతం అదనం

ప్రైవేటు ట్రావెల్స్‌లో ఇష్టారాజ్యం


నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట) అక్టోబరు 9 : కరోనా కాస్త శాంతించడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే పాత రోజులకు అలవాటు పడుతూ పండగలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ దసరా పండుగను కుటుంబసభ్యులతో జరుపుకునేందుకు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు.  దీనినే ఆసరా చేసుకుని ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణిలను ‘ప్రత్యేక’ం పేరుతో  దోచుకునేందుకు సిద్ధపడిపోయాయి. దసరా పండుగ ముందు రెండు రోజులు, ఆ తర్వాత మూడు రోజులు ప్రజలు అధికంగా ప్రయాణిస్తారని భావించిన ఆర్టీసీ సాదారణ చార్జీల కంటే సగభాగం అధికంగా వసూలు చేయనుంది. 


ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

దసరా పండుగ సందర్భంగా నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌ నుంచి 85 ప్రత్యేక బస్సులను అధికారులు నడుపుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ ఇలా పలు  ప్రాంతాల నుంచి జిల్లావాసుల కోసం ఈ బస్సులు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సాధారణ  చార్జీల కంటే అదనంగావసూలు చేస్తున్నారు. అంటే సాధారణ రోజుల్లో రూ.100 ఉండే చార్జీని పండుగ ప్రత్యేకం పేరుతో రూ.150 వసూలు చేయనుంది. 


ఆన్‌లైన్‌లో ‘ప్రైవేటు’ దోపిడీ

 ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు అయితే ఎంత వసూలు చేస్తారో అంతు పట్టడం లేదు. అధిక ధరలను నిర్ధారించి నేరుగా ఆన్‌లైన్‌లో టికెట్‌ ధరలను ఉంచారు.  పండుగ రద్దీ రోజులు అయిన 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో హైదరాబాదు, బెంగళూరు వంటి దూర ప్రాంత బస్సులకు ఇప్పటికే చార్జీల బాదుడు చార్ట్‌ను సిద్ధం చేసేశారు. ఆ రోజుల్లో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని చూస్తుంటే సాధారణ చార్జీల కంటే రూ.250 నుంచి రూ.400 వరకు అదనంగా ఉంన్నాయి. డిమాండ్‌ను బట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని టికెట్‌ బుకింగ్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.  


ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు

దసరా పండుగకు జిల్లాకు వస్తున్న ప్రయాణికుల కోసం రీజియన్‌ వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగళూరు ఇలా పలు ప్రాంతాల నుంచి, పండుగ జరుపుకొని తిరుగు ప్రయాణం వెళ్లేవారికి ఇవి సౌలభ్యంగా ఉంటాయి. బస్సుల వివరాలను ఆన్‌లైన్‌లోనూ ఉంచాము.

- పివి శేషయ్య, ఆర్‌ఎం, ఆర్టీసీ

 

Updated Date - 2021-10-10T05:51:12+05:30 IST