బాధితులకు మెరుగైన వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-07-03T05:51:06+05:30 IST

కొలకలూరు గ్రామంలో డయేరియా బాధితులకు తక్షణ వైద్య సేవలందించడంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజని చెప్పారు

బాధితులకు మెరుగైన వైద్యసేవలు
చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే శివకుమార్‌

మెడికల్‌ టీమ్‌లతో ఇంటింటికీ సర్వే

శ్రీనిధి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందేలా చూస్తాం

కొలకలూరులో పర్యటించిన వైద్యఆరోగ్యశాఖ మంత్రి రజని


తెనాలి రూరల్‌, జూలై2: కొలకలూరు గ్రామంలో డయేరియా బాధితులకు తక్షణ వైద్య సేవలందించడంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజని చెప్పారు. శనివారం ఆమె తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో దళితవాడలో డయేరియా బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మంత్రి రజని మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్య సమస్యలు తలెత్తిన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమయిందన్నారు. జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ గ్రామంలో బాధితులకు 24 గంటలు వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టారన్నారు. మంచినీటి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చిన వెంటనే సమస్యకు గల కారణాలను తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అనారోగ్య లక్షణాలతో 14 సంవత్సరాల  శ్రీనిధి చనిపోవడం తనను ఎంతో బాధించిందని, ఆ కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని తెలియడంతో పరామర్శిచేందుకు వెళ్లలేకపోయానని చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు గ్రామంలో అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీనిధి కుటుంబసభ్యులకు సీఎం సహాయనిధి నుంచి అవసరమైన సహాయం అందించేలా చూస్తామన్నారు. ఇప్పటికే వైద్యసేవలు పొందుతున్న బాధితులు కోలుకుంటున్నారని, కాలనీ వాసులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆమె వెంట కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, వైద్యశాఖ జిల్లాస్థాయి అధికారులు, వైద్యబృందాలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:51:06+05:30 IST