ప్రమాదకరంగా.. పట్టణ ప్రాంతాలు

ABN , First Publish Date - 2020-03-31T09:10:35+05:30 IST

జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో ఆయా ప్రాంతాలపై దృష్టి

ప్రమాదకరంగా.. పట్టణ ప్రాంతాలు

అక్కడే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ ఆదేశాలు


గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో ప్రతీ ఇంటిని సర్వే చేయించి వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. రెండో స్థాయిలో ప్రతీ డివిజన్‌కు ఒక వైద్యుడిని, మునిసిపాలిటీల్లో ప్రతీ మూడు వార్డులకు ఒక డాక్టర్‌ని నియమించి  డేటాని ప్రతీ రోజు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలన్నారు.


మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 400 నుంచి 500లకు, ఐసీయూ పడకలు 50 నుంచి 60కి పెంచేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ పూర్తి అయ్యేంత వరకు  వలస కార్మికులు, యాచకులకు  తగిన వసతి, భోజన సౌకర్యం, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే వారికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించారు. నిత్యవసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రతీ దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించేలా చూడాలన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు నిత్యావసరాలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

 

నిత్యం రెండు దఫాలుగా సర్వే నిర్వహించాలి

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు నిత్యం ప్రాథమిక, రెండో దశ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికులు, రహదారులపై ఉన్న యాచకులను ఉంచేందుకు వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించాలన్నారు.


జిల్లాలో ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాలలో ఐదు వేల పడకలు ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఫంక్షన్‌ హాల్స్‌, స్టేడియంలను గుర్తించాలన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌, కలెక్టర్‌ సమావేశంలో రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు, రూరల్‌, అర్బన్‌ ఎస్‌స్పీ సీహెచ్‌ విజయారావు, పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ,  తెనాలి సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, డీఆర్‌వో సత్యన్నారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాబూలాల్‌, మునిసిపల్‌ ఆర్‌డీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.   


జిల్లాలో 50 వేల మంది వలస కూలీలు

లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలో 50 వేల మంది వరకు వలన కూలీలు ఇక్కడ ఉండిపోయారని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో  ఆయన   మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక్క అచ్చంపేట మండలంలోనే 5,457 మంది వలస కూలీలను గుర్తించామన్నారు. వీరిని రిలీఫ్‌ క్యాంపులలో చేర్చి అవసరమైన భోజన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2020-03-31T09:10:35+05:30 IST