మొన్న మూసీ.. నిన్న పులిచింతల.. ఇప్పుడు నాగార్జున సాగర్‌కు పొంచి ఉన్న ప్రమాదం..!

ABN , First Publish Date - 2021-08-07T05:44:48+05:30 IST

మొన్న మూసీ, నిన్న పులిచింతల ప్రాజెక్ట్‌లకు గేట్లు విరిగి పెద్ద ఎత్తున వచ్చిన వరదనీరు సముద్రం పాలయింది.

మొన్న మూసీ.. నిన్న పులిచింతల.. ఇప్పుడు నాగార్జున సాగర్‌కు పొంచి ఉన్న ప్రమాదం..!
దెబ్బతిన్న సాగర్‌ ప్రాజెక్టు స్పీల్‌వే ప్రాంతం

  • నాగార్జున సాగర్‌ డ్యాం స్పిల్‌వేపై భారీ గుంతలు
  • 2020 సెప్టెంబర్‌లో విరిగిన కుడి కాలువ గేటు
  • తాజాగా కొట్టుకుపోయిన పులిచింతల క్రస్ట్‌గేటు
  • జలాశయాల నిర్వహణపై సందేహాలు


నాగార్జునసాగర్‌, గుంటూరు, ఆగస్టు 6: మొన్న మూసీ, నిన్న పులిచింతల ప్రాజెక్ట్‌లకు గేట్లు విరిగి పెద్ద ఎత్తున వచ్చిన వరదనీరు సముద్రం పాలయింది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై నిశితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో 2020 సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్‌కు భారీస్థాయి వరద వచ్చినపుడు కుడికాలువ గేట్లు కాలువలో పడిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో సుమారు ఏడునెలల పాటు వరద నీరు ఆగకుండా దిగువకు ప్రవహించింది. ప్రస్తుతం  భారీ వరదల నేపథ్యంలో ప్రాజెక్ట్‌ క్రస్ట్‌గేట్లు  లీకేజీలు, మొరాయింపులు లేకుండా చూసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2004 సంవత్సరంలో కూడా సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరదలు వచ్చినపుడు గేట్లను పైకెత్తి దిగువకు విడుదల చేసే కార్యక్రమంలో 14వ నెంబర్‌ గేటు మొరాయించిన విషయం విదితమే.


అపుడు ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ప్రాజెక్ట్‌ సందర్శించి సమస్య గురించి ఆరా తీశారు. అనంతరం నిపుణులకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించి వెంటనే ఆ గేటు మరమ్మత్తుల పనులను పూర్తి చేయించారు. 2017 సంవత్సరంలో 18, 20, 26వ నెంబర్లు గల గేట్లు రోలర్లు ఓ వైపునకు ఒరిగిపోవడంతో గేట్లను ఎత్తే క్రమంలో మొరాయిస్తుండేవి. 2018 సంవత్సరంలో రూ.5కోట్ల వ్యయంతో మరమ్మత్తులు చేశారు. అలాగే ఈఏడాది రూ.70లక్షల వ్యయంతో 26గేట్లకు రబ్బరు సీల్లు వేయడం, రోపులకు  గ్రీజులు రాయడం వంటి నామమాత్రపు పనులను హడావుడిగా పూర్తిచేశారు.  


నిర్వహణ లోపమేనా?

 డాక్టర్‌ కేఎల్‌ రావు సాగర్‌ పులిచింతల డ్యాం రేడియల్‌ క్రస్టు గేటు కొట్టుకుపోవడం జలాశయ నిర్వహణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. కేవలం 2 లక్షల క్యూసెక్కుల లోపు వరద ప్రవాహానికే గేటు కొట్టుకుపోవడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అదే నాగార్జునసాగర్‌ నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం జిల్లాలో నెలకొంది. ఒక భారీ జలాశయం రేడియల్‌ క్రస్టు గేటు కొట్టుకుపోవడంతో ఈ తరం ప్రజలు ఎప్పుడూ చూసి ఉండరు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంల నుంచి గతంలో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదలు చేసిన సందర్భాలున్నాయి. స్పిల్‌వేలు దెబ్బతిన్నాయే తప్పా ఎప్పుడూ ఇలా రేడియల్‌ క్రస్టు గేటు కొట్టుకుపోలేదు. పులిచింతల ప్రాజెక్టుని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మాణం ప్రారంభించి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించారు. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ద్వారా దీనిని నిర్మించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మిగిలిన పనులను టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో పూర్తి చేశారు. అప్పటి నుంచి డ్యాంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల డ్యాం నిర్వహణ, పర్యవేక్షణ అంతా జలవనరుల శాఖ ఆధీనంలోనే ఉన్నది. ఈ డ్యాంకి ఒక సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌, ఈఈ, డీఈఈ, ఏఈఈలున్నారు. దాదాపు 20 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో ఈ జలాశయాన్ని డిజైన్‌ చేశారు.


ఏటా వేసవిలో డ్యాం నిర్వహణకు సంబంధించి మరమ్మతులు ఉంటే చేయించి సిద్ధం చేసుకోవాలి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యాం నిర్వహణ కోసం నిధులు పెద్దగా కేటాయించిన దాఖలాలు లేవు. అలానే అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. ఈ లోపాలన్ని శాపంగా మారడంతోనే గేటు కొట్టుకుపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని దృష్ట్యా డ్యాంల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇరిగేషన్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-07T05:44:48+05:30 IST