దండకారణ్యంపై డేగ కన్ను

ABN , First Publish Date - 2020-10-20T07:08:23+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో రెండు రోజుల క్రితం మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు

దండకారణ్యంపై డేగ కన్ను

రంగంలోకి కేంద్ర బలగాలు

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు

ఉత్తరాది ఇంటెలిజెన్స్‌ బృందాలకు బాధ్యతలు

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌తో సరిహద్దుల్లో కూంబింగ్‌ ముమ్మరం


 (ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో రెండు రోజుల క్రితం మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెడ్‌అలర్ట్‌ ప్రకటించి మావో యిస్టులు సంచరించే అవకాశాలున్న ప్రాంతాలపై డేగ కళ్లతో నిఘా పెట్టి కూంబింగ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని తుద ముట్టించే లక్ష్యంతో కొంతకాలంగా ఆపరేషన్‌ ప్రహార్‌ పేరిట వ్యూహత్మకంగా నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అయితే కొద్ది మేర ఆ వ్యూహం ఫలించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదన్న ఉద్దేశంతో ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌కు సీనియర్‌ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. ఈ కారణంగానే ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి ఐదు రోజుల పాటు ఆసిఫాబాద్‌లో మకాం వేసి మావోయిస్టుల ఏరివేత కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ నిర్మాణంలో ఆయనకు సహకరించినట్లు చెబుతున్నారు. 


దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి పట్టు ఉండి తరుచూ కదలికలు కనిపించే ప్రాంతాలపై భౌగోళిక అవగాహన కోసం ఆయనతో కలిసి డీజీపీ ఏరియల్‌ సర్వే చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన విజయ్‌కుమార్‌ అడవి దొంగ వీరప్పన్‌ను అంతమొందించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ‘కకూన్‌ ’ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించారు. తీవ్రవాదం అణచివేతలో అపార అనుభవం ఉందన్న ఉద్దేశంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల మావోయిస్టులను ఏరివేసే బాధ్యతలను అప్పగించినట్లు చెబుతున్నారు.


ఈ క్రమంలో మావోయిస్టు ఆపరేషన్లలో ఆరితేరిన పోలీసుల అనుభవాన్ని ఉపయోగించుకుంటూనే సరిహద్దు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అందించే సమాచారాన్ని విశ్లేషిస్తూనే సెంట్రల్‌ టీంలు అందించే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేస్తారు. దీన్ని క్రోడీకరించి మావో యిస్టు బృందాల కదలికలపై ఆపరేషన్‌లో ఉండే బలగాలకు సమాచారం అందిస్తూ మావోయిస్టులను తుద ముట్టించాలన్నది ప్రధాన వ్యూహం.


రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ చుట్టూ ఉచ్చు?

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ను పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా కార్యచరణ అమలు చేస్తోంది. స్థానిక పోలీసు బలగాలతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు, రిజర్వ్‌ బలగాలు ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గాలింపులు జరుపుతున్నారు. తాజాగా వీరికి అదనంగా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రేహౌండ్స్‌ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస కూలీల వేషంలో మావోయిస్టులు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాలకు చేరుకున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇంతకుముందే గుర్తించాయి.  సుమారు 15 మంది సాయుధులతో కలిసి భాస్కర్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ప్రచారం సాగింది.


ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒక దళ సభ్యుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడు కావడం పై విషయానికి బలం చేకూర్చుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి భాస్కర్‌, అతని సహచరి తప్పించుకొని పారిపోయినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించినా అంతక ముందే వారు సురక్షిత ప్రాంతానికి వె ళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత పట్టుదలతో  భాస్కర్‌ లక్ష్యంగా సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-10-20T07:08:23+05:30 IST