నిధుల విడుదలలో దళారుల దందా!

ABN , First Publish Date - 2021-10-19T05:51:29+05:30 IST

జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిధుల విడుదల లో బ్రోకర్‌ల దందా కొనసాగుతోంది. దరఖాస్తు చేయడం నుంచి నిధుల మంజూరు వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.

నిధుల విడుదలలో దళారుల దందా!

జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిధుల మంజూరులో జోరుగా పైరవీలు

మీ-సేవ కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల సిబ్బందితో పైరవీకారుల మిలాఖత్‌

దరఖాస్తు నుంచి నిధుల మంజూరు వరకు అన్నీ తామై చూస్తున్న వైనం

ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు

ప్రభుత్వానికి నివేదించిన నిఘా వర్గాలు

పలువురు అధికారులకు నోటీసులు

త్వరలో చర్యలు తీసుకొనే అవకాశం

నిజామాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిధుల విడుదల లో బ్రోకర్‌ల దందా కొనసాగుతోంది. దరఖాస్తు చేయడం నుంచి నిధుల మంజూరు వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కిందిస్థాయి అధికారులతో మిలాఖత్‌ అయి ప నులు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో పనులు పూర్తిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువు రు మండలస్థాయి అధికారులకు నోటీసులు ఇచ్చినా.. ఇం కా చోట్ల ఈ వ్యవహారం ఆగడంలేదు. చివరకు ఇంటలిజె న్స్‌ అధికారులు కూడా నివేదిక ఇవ్వడంతో జిల్లా యంత్రా ంగం సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అన్ని మండలాల పరిధిలో ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని ఆదేశించింది.

పెద్దసంఖ్యలో పుట్టుకొస్తున్న బ్రోకర్లు

రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పెళ్లి చేసుకున్న పేద ఆడపిల్ల కుటుంబానికి లక్షా 1,116 రూపాయలు ఇస్తుండడంతో బ్రోకర్‌లు పుట్టుకొచ్చా రు. పేద ఆడపిల్లల పెళ్లిళ్లు కాగానే వారి దరఖాస్తులు దగ్గరుండి చేయిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే సరిచేసి దరఖాస్తు చేయిస్తున్నారు. మీ-సేవ, స్థానిక గ్రామ, మున్సిపాలిటీల్లోని కిందిస్థాయి అధికారులను మచ్చిక చేసుకొని పనులు చేయిస్తున్నారు. కల్యాణలక్ష్మి కన్నా షాదీముబారక్‌లో ఎక్కువ మొత్తంలో పైరవీలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిని జిల్లాకు చెందినవారిగా ఆధార్‌లో మార్పులు చేయించి దరఖాస్తు చేయిస్తున్నారు. నిధులు మంజూరయ్యే వరకు అన్నీ తామై చూసుకుంటున్నారు. ప్రతీ దరఖాస్తుదారు నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వ రకు వసూలు చేస్తున్నారు. మీ-సేవ కేంద్రాల్లో మేనేజ్‌ చేసి దరఖాస్తు చేయించి.. ఆ తర్వాత తహసీల్దార్‌ కార్యాలయా ల్లోనూ మేనేజ్‌ చేసి నిధులు విడుదలయ్యేలా చూస్తున్నారు. జిల్లాకు చెందినవారితో పాటు ఇతర జిల్లాల నుంచి వ చ్చిన వారికి కూడా ఎక్కువ మొత్తంలో షాదీముబారక్‌ ద్వారా నిధులు మంజూరయ్యేలా చూస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఈ వ్యవహారంలో ఎక్కువగా ఉ ండడంతో అధికారులు కూడా కొన్నిచోట్ల చూసీచూడనట్టు గా వ్యవహరిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మండలాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా జరిగింది. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్ప ర్చుకున్న మండలాల పరిధిలో ఈ పైరవీలు ఎక్కువగా జరిగాయి. ఆధార్‌లో మార్పులు చేసి ఈ పథ కం వర్తించేవిధంగా పైరవీకారులు చూస్తు న్నారు. అర్హులైన వారితో పాటు వీరికి కూడా మంజూరు చేయిస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లో దరఖాస్తులను పరిశీలించడం అధికారులకు కష్టంగా మారడంతో ఓ వర్గం ప్రజాప్రతినిధులను వాకబు చేసి నిధులు మం జూరు చేశారు. ఈ అంశం పైరవీకారులకు కలిసివచ్చింది. వారికి కాసుల వర్షం కురిపించింది.

నిఘా వర్గాల నజర్‌ 

ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా జిల్లాల్లో ఈ పథకంపై నిఘా వర్గాల అధికారులు దృష్టి సారి ంచారు. జిల్లాలో కూ డా పలు మండలాల్లో తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ ఘటనలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి? ఆఽధార్‌లో మార్పులు ఏ మండలాల పరిధిలో జరిగాయి? ఈ వ్యవహారంలో అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఉన్నారు? తదితర వివరాలు నివేదికలో పొందుపర్చి ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదిక ఆధారంగా ఆ యా జిల్లాల కలెక్టర్‌లు బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

జిల్లాలో పలువురు అధికారులకు నోటీసులు 

జిల్లాలో ఈ వ్యవహారంతో సంబంధమున్న పలువురు మండల అధికారులకు జిల్లా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పథకంలో మంజూరైన నిధుల వివరాలు అందించాలని కోరారు. ఆ వివరాల ఆధారంగా అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధవుతున్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులు వివరణ ఇవ్వగా.. మరికొంతమంది ఇంకా పంపించలేదు. ని ఘా వర్గాల నివేదికతో పాటు ప్రత్యేక అధికారులను నియమించి మంజూరైన నిధులను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కువగా మున్సిపాలిటీల పరిధిలో జరగడంతో సంబంధిత తహసీల్దార్‌లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలు జరుగుతున్న ప్రాంతంలోని మీ-సేవలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించినందున వారిపై చర్యలు తీసుకునే అవ కాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉండడంతో వారిని జిల్లాకు చెందిన ముఖ్యనేతలు దూరంగా ఉండాలని కోరినట్టు తెలు స్తోంది. కొన్ని మండలాల పరిధిలో కేవలం మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు పరిశీలించిన తర్వాత తహసీల్దార్‌ల ద్వారా ప్రభుత్వానికి వెళ్తున్నాయి. వెంటనే నిధులు మంజూరు అవుతున్నాయి. ఎలాంటి పైరవీలు లేకుండా అర్హులకు ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు. కొన్ని మండలాలపరిధిలో మాత్రం పైరవీకారులే అన్నీ తామై పనులుచేస్తూ నిధులు మంజూరయ్యాక లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల పైరవీ కారులపై అధికారులు చర్యలు చేపడితే పేదవారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ని ధుల మంజూరులో అవకతవకలకు పాల్పడిన కొంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చింది వాస్తవమేనని జిల్లాకు చెందిన సీనియర్‌ అధికారులు తెలిపారు. జిల్లాలో నాలుగై దు మండలాల పరిధిలో ఈ వ్యవహారం జరిగిందని, వారిపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. 

Updated Date - 2021-10-19T05:51:29+05:30 IST