రాజ్యసభకు దామోదర్‌రావు

ABN , First Publish Date - 2022-05-19T05:51:24+05:30 IST

రాజ్యసభ సభ్యుడిగా దీవకొండ దామోదర్‌రావుకు అవకాశం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాకు మళ్లీ పెద్దపీట వేశారు.

రాజ్యసభకు దామోదర్‌రావు

 - ఉమ్మడి జిల్లాకు మళ్లీ దక్కిన అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాజ్యసభ సభ్యుడిగా దీవకొండ దామోదర్‌రావుకు అవకాశం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి  జిల్లాకు మళ్లీ పెద్దపీట వేశారు. త్వరలో ఖాళీ కానున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు స్థానాన్ని ఇదే జిల్లాకు చెందిన వ్యక్తికి కట్టబెట్టడం ద్వారా జిల్లా ప్రాధాన్యాన్ని నిలిపారు. దామోదర్‌రావు ఆరు సంవత్సరాలపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. రాజ్యసభ సభ్యులను గెలిపించుకోవడానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ సంఖ్యాబలం ఉండడంతో దామోదర్‌రావుతోపాటు మిగతా సభ్యుల ఎన్నిక లాంఛనప్రాయంగానే భావించవచ్చు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. జాతీయ రాజకీయాలవైపు దృష్టిసారించిన కేసీఆర్‌ బీజేపీతో ఆమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో ఢిల్లీలో తన రాజకీయ అవసరాలకు చేదోడువాదోడుగా ఉంటూ బరువు, బాధ్యతలను పంచుకునేవారినే రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ కోణంలోనే దామోదర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు పేర్లకు తోడుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకాలంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ఎంపీలతో మాట్లాడి ఉద్యమానికి మద్దతు కూడగట్టడంతోపాటు సంతకాల సేకరణ కూడా చేసిన అనుభవం, ఎంపీగా పనిచేసిన అనుభవం, అప్పటి ఢిల్లీ సంబంధాలు జాతీయ రాజకీయాలకు తోడ్పాటునందిస్తాయని, వినోద్‌కుమార్‌కే రాజ్యసభ అవకాశం కల్పిస్తారని కూడా పార్టీలో చర్చ జరిగింది. పలు రాజకీయ సమీకరణాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దామోదర్‌రావు పేరునే ఖరారు చేశారు. ఒక దశలో జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు కూడా దక్కే అవకాశం ఉందనే చర్చ జరిగింది. వినోద్‌కుమార్‌ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైనందున ఆయన ఆ హోదాలోనే ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించడానికి అవకాశం ఉన్నది. దీంతో అటు దామోదర్‌రావు, ఇటు వినోద్‌కుమార్‌ ఇద్దరి సేవలు వినియోగించుకోవచ్చని భావించి దామోదర్‌రావుకు అవకాశం ఇచ్చారనిఇ చెబుతున్నారు. 


 పార్టీ ఆవిర్భావం నుంచి..


జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన దీవకొండ దామోదర్‌రావు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చేరి ఉద్యమ నాయకుడిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక కార్యదర్శిగా సేవలందించారు. టీన్యూస్‌, నమస్తే తెలంగాణ పత్రికల మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 1958 ఏప్రిల్‌ 1న జన్మించిన దామోదర్‌రావుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు స్థానాలలో రెండింటిలో బీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒకటి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారితో ఉంది.


 వొద్దిరాజు రవిచంద్రకు జిల్లాతో అనుబంధం


రెండు బీసీ స్థానాలలో ఒకటైనా బీసీలకు ఇస్తారని, పార్టీలో చేరిన నాటి నుంచి కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంున్న నారదాసు లక్ష్మణ్‌రావుకు రాజ్యసభ పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు ఆశించాయి. బీసీ వర్గానికే చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన వొద్దిరాజు రవిచంద్రకు ముఖ్యమంత్రి ఈసారి ఆ అవకాశాన్ని ఇచ్చారు. దీంతో నారదాసుకు పదవి దక్కకుండా పోయింది. రవిచంద్ర ఖమ్మం జిల్లాకు చెందినవారే అయిన జిల్లాతో ఆయనకు సంబంధాలున్నాయి. గాయత్రీ గ్రానైట్స్‌ సంస్థ యజమానిగా, ఆ సంఘం నాయకుడిగా జిల్లాలోని గ్రానైట్‌ సంస్థల యజమానులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు రవిచంద్ర ఇద్దరూ సమీప బంధువులు కావడం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. మొదటి నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నారదాసు లక్ష్మణ్‌రావు సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ విధంగా వినియోగించుకోనున్నారో వేచి చూడాల్సి ఉంది. 


Updated Date - 2022-05-19T05:51:24+05:30 IST