కార్మికుల నోట్లో.. సున్నం

ABN , First Publish Date - 2021-07-29T05:39:37+05:30 IST

దాచేపల్లి సున్నపు క్వారీల్లో కష్టం ఒకరిది.. సొమ్ము మరొకరది అన్నట్లుగా ఉంది. చేతికష్టం కూడా కార్మికులకు దక్కడంలేదు.

కార్మికుల నోట్లో.. సున్నం
అంజనాపురం మైనింగ్‌ ప్రాంతం

రెక్కల కష్టం కూడా దక్కని వైనం

కూలి కోసం రోడ్డెక్కితే బెదిరింపులు

దాచేపల్లి వడ్డెర  సొసైటీ కూలీల బతుకుల దుర్భరం 


దాచేపల్లి సున్నపు క్వారీల్లో కష్టం ఒకరిది.. సొమ్ము మరొకరది అన్నట్లుగా ఉంది. చేతికష్టం కూడా కార్మికులకు దక్కడంలేదు. స్థానిక నేతలు, వారి బంధువులు గద్దల్లా వాలి కార్మికుల నోటికాడ కూడును తన్నుకుపోతున్నారు. చేసిన కష్టానికి వారం వారం చెల్లించాల్సిన బట్వాడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేమంటే కత్తులతోనే సమాధానం చెప్తున్నారు. కూలి డబ్బుల కోసం కార్మికులు రోడ్డెక్కితే బెదిరింపులకు పాల్పడుతున్నారు.  రోజంతా   పనిచేయడం తప్ప మరేమీ తెలియని కార్మికులను నగదు ఆశచూపి కొందరు నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుని వారి మధ్య కక్షలు రేపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాచేపల్లి వడ్డెర సొసైటీ కూలీల బతుకుల దుర్భరంగా మారిన వైనంపై ఆంధ్రజ్యోతి కథనం. 


గుంటూరు, జూలై 28: దాచేపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో సున్నపురాయి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. 1995లోనే వడ్డెర లేబర్‌ కాంట్రాక్టు సొసైటీని ఏర్పాటు చేసుకుని సున్నపురాయిని వెలికితీయటం ఆరంభించారు. అప్పట్లోనే వంద లాది మందికి ఉపాధి బాట చూపిన మార్గంలో ఇటీవల స్థానిక నాయకులు జొరబడ్డారు. తరువాత ఐదారు సొసైటీలు ఏర్పడినా పెత్తనం మాత్రం అక్కడ స్థానిక నాయకులదే. పల్నాడులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూలీలను, సొసైటీలను అడ్డంపెట్టుకొని ఆర్థికంగా కొందరు బలపడుతున్నారు. వడ్డెర కార్మికులు కుటుంబాల్లో సభ్యుల సంఖ్య పెరగడంతో వారందరికీ క్వారీల్లో పనిచేయడం తప్ప మరో పని చేతకాదు. రోజంతా   పనిచేయడం తప్ప మరేమీ తెలియని వారిలో కొందరిని చేరదీసి సొమ్ములు ఆశచూపి స్థానిక నాయకులు అనుకూలంగా మలుచుకుంటుంటారు. ఓ వర్గం స్థానిక నాయకులకు చెప్పింది వింటూ తోటి కార్మికుల పొట్టకొడుతున్నారనే ఆరోపణలున్నాయి. మాట వినేవారిని సొమ్ములతో... వినని వారిని బెదిరింపులతో భయపెడుతూ క్వారీల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. సొసైటీల పేరుతో క్వారీలు నడుస్తున్నా కూలి డబ్బులను ఎగ్గొడుతున్నారు. కూలికి గిట్టుబాటు కావాలని ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు నెలలో జరిపిన దౌర్జన్యకాండలో ఓ యువకుడు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన ఘటనే ఇందుకు ఉదాహరణ. దాచేపల్లి, నడికుడి సమీపాల్లో ఉన్న కొన్ని క్వారీలను స్థానిక ఓ కార్పొరేషన చైర్మన కుటుంబం చేతికిందకు వచ్చాయి. కనీస కనికరం లేకుండా క్వారీల్లో పనిచేస్తున్న కూలీలకు ఆరేడు నెలలుగా సుమారు రూ.40లక్షలకు పైగా చెల్లింపులు జరగాల్సి ఉంది. గతంలో క్వారీల నిర్వాహణ చేసిన వారంతా ప్రతి వారం రోజులకొకసారి కూలి చెల్లించే వారు. అత్యవసర సమయాల్లో, శుభకార్యమైనా ఉంటే కూలితో సంబంధం లేకుండా ఉదారంగా సాయం చేసిన వారున్నారు. రెండు రోజుల క్రితం కూలిడబ్బులు అడిగిన వారిని బయటకు నెట్టినంత పనిచేశారు. ప్రస్తుతం కూలి డబ్బులు రాకపోవటంతో కూలీల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏడాదిగా కొవిడ్‌కి కొందరు కూలీలు మృతి చెందగా మరికొందరకి అనారోగ్యం వెంటాడుతున్నా ఏ ఒక్కరూ సాయం అందించలేదు. సత్తువ ఉన్నంతసేపు పనిచేయించుకొని అనారోగ్యం దరిచేరితే ఆమడదూరం జరిగే మైనింగ్‌మాఫియా ఆగడాల పట్ల కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 


మరీ ఇంత అన్యాయమా...? 

నా వయసు 70 ఏళ్లు. నలభైఏళ్లకుపైగా క్వారీల్లోనే పనిచేస్తున్నా. ఎందరికో ఉపాధి చూపా. చేసిన కష్టానికి గత ఏడాది దాకా కూలి గిట్టింది. ఆరేడు నెలలుగా ఎండనకా, వాననకా క్వారీల్లో పనిచేసినా కూలి ఇవ్వట్లేదు. మా కుటుంబానికే రూ.లక్షకు పైగా కూలి రావాలి. బెజవాడకు కరకట్ట ఎంత భద్రతో అంజనా పురానికి ఉన్న కట్టకూడా అలాంటిదే. అటువంటి కట్టను కొందరు మైనింగ్‌ మాఫియా తవ్విస్తున్నారు. వరదలొస్తే సంగం ఊరు మునిగిపోతుంది.  - బండారు పెద వీరయ్య 


చనిపోతున్నా పట్టదా.. 

చేసిన కష్టానికి కూలి అందక చనిపోతున్నా ఏ ఒక్కరికీ పట్టడంలేదు. కొన్ని నెలలుగా కూలి డబ్బులు రాక అప్పులతో గడుపుతున్నాం. కొన్నాళ్ల కిందట మా ఇంటాయన కొవిడ్‌తో చనిపోతే మట్టిఖర్చులకు సాయం చేయలేదు. కూలికి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో నెలల తరబడి బట్వాడాలు ఆపితే ఎలా బతకాలి. ఎప్పుడు అడిగినా ఇదిగో... అదిగో అంటున్నారే తప్ప కూలిడబ్బులు మాత్రం ఇవ్వటం లేదు. - దేవళ్ల శివమ్మ 

Updated Date - 2021-07-29T05:39:37+05:30 IST