మహమ్మారి సమయంలో సైబర్ నేరాల్లో భారీ పెరుగుదల : ఐరాస నివేదిక

ABN , First Publish Date - 2020-08-08T21:49:46+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫిషింగ్ వెబ్‌సైట్లు భారీగా పెరగడంపై ఐక్య రాజ్య సమితి

మహమ్మారి సమయంలో సైబర్ నేరాల్లో భారీ పెరుగుదల : ఐరాస నివేదిక

ఐక్య రాజ్య సమితి : కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫిషింగ్ వెబ్‌సైట్లు భారీగా పెరగడంపై ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ నేరగాళ్ళబారిన పడుతున్నవాటిలో అత్యధికం ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు అని తెలిపింది. 


ఐక్య రాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం చీఫ్ వ్లదిమిర్ వొరొంకోవ్ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించిన నివేదికలో ఫిషింగ్ వెబ్‌సైట్ల సంఖ్య 350 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరాసలో జూలైలో జరిగిన మొదటి వర్చువల్ కౌంటర్ టెర్రరిజం వీక్ సందర్భంగా మాట్లాడిన వక్తలు పెరుగుతున్న సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఒక వారంపాటు జరిగిన సమావేశాల్లో 134 దేశాలకు చెందిన ప్రతినిథులు పాల్గొన్నారని తెలిపారు. పౌర సంఘాలు, ప్రైవేటు సంస్థలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు, ఐక్య రాజ్య సమితి వ్యవస్థలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. 


ప్రపంచ శాంతి, భద్రతలపై ఈ మహమ్మారి ప్రభావం, పర్యవసానాలను ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ నిపుణులు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదంపై ఈ మహమ్మారి ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. 


కోవిడ్-19 వల్ల ఏర్పడిన అంతరాయాలను, ఆర్థిక ఇబ్బందులను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని, ప్రజల్లో భయాలు వ్యాపింపజేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి, కొత్తగా కొందరిని తమ తమ సంస్థల్లో నియమించుకుంటున్నారని తెలిపారు. ఇంటర్నెట్ వాడకం పెరుగుతుండటం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. 


ఉగ్రవాదులు అనేక అక్రమాలకు పాల్పడుతూ నిధులు సంపాదిస్తున్నారని, మాదక ద్రవ్యాలు, సహజ వనరులు, ప్రాచీన కళాఖండాలు వంటివాటిని అక్రమంగా రవాణా చేయడం, అమ్మడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు. డబ్బు కోసం కిడ్నాప్, దోపిడీ, బలవంతపు వసూళ్ళు, తదితర అమానుష నేరాలకు కూడా పాల్పడుతున్నట్లు చెప్పారు. 


ఐరాస వ్యవస్థలు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ సేవలపై దృష్టి సారించడం మంచిదే అయినప్పటికీ, ఉగ్రవాదం వల్ల ముప్పును మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఉగ్రవాదులు స్థానిక పరిస్థితుల ఆధారంగా తమ సంస్థలను పటిష్టపరుచుకుంటున్నట్లు తెలిపారు. 


ఈ మహమ్మారి సమయంలో అసమానతలు పెరగడం, సాంఘిక సమన్వయం లేకపోవడం వల్ల ఉగ్రవాదం వ్యాపించడానికి అవకాశం ఉందని చెప్పారు. 


ఫిషింగ్ వెబ్‌సైట్ అంటే, చట్టబద్ధమైన వెబ్‌‌సైట్ మాదిరిగానే అన్ని విధాలుగా కనిపిస్తుంది. ఏదైనా సంస్థ వెబ్‌సైట్‌ను పోలిన ఫిషింగ్ వెబ్‌సైట్‌ను రూపొందించి, యూజర్ల పాస్‌వర్డ్‌, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని  సైబర్ నేరగాళ్ళు రాబట్టుకుంటారు. 


Updated Date - 2020-08-08T21:49:46+05:30 IST