ఆ మెసేజ్‌ వచ్చిందంటే..!

ABN , First Publish Date - 2020-09-22T07:30:06+05:30 IST

‘‘మీ సిమ్‌ స్థానంలో కొత్తది పొందడానికి చేసిన అభ్యర్థన ప్రక్రియ మొదలయింది’’ అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌ వస్తే

ఆ మెసేజ్‌ వచ్చిందంటే..!

అలర్ట్‌ కావాల్సిందే అంటున్న సైబర్‌ నిపుణులు

ఫిషింగ్‌.. విషింగ్‌.. స్మిషింగ్‌..

అత్యాధునిక పద్ధతుల్లో సైబర్‌ నేరాలు

కలకలం రేపుతున్న సిమ్‌, ఈ-సిమ్‌ల స్వాపింగ్‌

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల ప్రచారం


కొత్తపేట, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ‘‘మీ సిమ్‌ స్థానంలో కొత్తది పొందడానికి చేసిన అభ్యర్థన ప్రక్రియ మొదలయింది’’ అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌ వస్తే అనుమానించాల్సిందేనని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. మీ ప్రమేయం లేకుండానే ఇటువంటి మెసేజ్‌లు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్‌తో పెరిగిన ఆన్‌లైన్‌ క్రయ, విక్రయాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. సిమ్‌ (సబ్‌స్ర్కైబర్‌ ఐడెంటిఫికేషన్‌ మాడ్యూల్‌) స్వాపింగ్‌, ఈ - సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా ఖాతాలను కొల్లగొడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ - డాక్‌) అసోసియేట్‌ డైరెక్టర్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎస్‌ఈఏ) ప్రాజెక్ట్‌ హెడ్‌ సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, ఎల్‌బీగర్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ హెచ్చరిస్తున్నారు.  


సిమ్‌ స్వాపింగ్‌తో రూ 25.16 లక్షలు స్వాహా..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉండే ఓ వ్యక్తికి ఎస్‌బీఐలో ఓ ఖాతా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ)లో రెండు ఖాతాలు ఉన్నాయి. తన నెంబర్‌కు ఆయా ఖాతాలను అనుసంధానం చేశారు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానే ఆయన వ్యాపార లావాదేవీలు చేస్తుంటారు. తన మొబైల్‌ నెంబర్‌ పని చేయడం లేదని ఈ ఏడాది జనవరి 15న ఆయన కస్టమర్‌ కేర్‌ను సంప్రదించారు. వారు రిఫరెన్స్‌ కోసం ఇంకో మొబైల్‌ నెంబర్‌ చెప్పమన్నారు. ఆయన ఓబీసీ ఖాతాకు అనుసంధానం చేసిన నెంబర్‌ ఇచ్చారు. ఆ నెంబర్‌ తమ రికార్డుల్లో మ్యాచ్‌ కావడం లేదని కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి తెలిపారు. దీంతో ఆయన చెక్‌ చేసుకుంటే.. ఆయన ఓబీసీ ఖాతాల్లో ఒక దాన్నుంచి 8 దఫాలుగా రూ25.16 లక్షలు వివిధ ఖాతాల్లోకి బదిలీ అయినట్లు గుర్తించారు.


బ్యాంకు అధికారులను సంప్రదించగా 15, 16 తేదీల్లో నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ20 లక్షలు బదిలీ అయిందనీ, ఆ తర్వాత అదే ఖాతా నుంచి 8 దఫాలుగా మొత్తం రూ25.16 లక్షలు వివిధ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తన ఒరిజినల్‌ సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించి, అదే నెంబర్‌తో మరో సిమ్‌ కార్డు తీసుకుని తన ఓబీసీ ఖాతా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సొమ్ము కాజేసినట్లు బాధితుడు 17వ తేదీన ఎల్‌బీనగర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ.లక్ష్మీకాంత్‌రెడ్డి బృందం విచారణ జరిపి స్వాపింగ్‌కు పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించారు. కోల్‌కత్తాకు చెందిన సౌవిక్‌ భట్టాచార్య(46)ను అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం నాటి నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. 


సిమ్‌ స్వాపింగ్‌ అంటే...

సైబర్‌ నేరగాళ్లు ఫిషింగ్‌, విషింగ్‌, స్మిషింగ్‌ విధానాల ద్వారా బ్యాంకుల ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు. సిమ్‌ స్వాపింగ్‌ లేదా ఈ- సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడి డబ్బు దోచేస్తున్నారు. దీని కోసం నేరగాళ్లు ముందుగా నకిలీ సిమ్‌ సంపాదిస్తారు. దీంతో అసలు వినియోగదారు ఒరిజినల్‌ సిమ్‌ డి - యాక్టివేట్‌ అవుతుంది. ఇదే సిమ్‌ స్వాపింగ్‌. 


ఈ - సిమ్‌ స్వాపింగ్‌...

ఈ - సిమ్‌ అంటే ఎంబెడెడ్‌ సిమ్‌ లేదా ఎలకా్ట్రనిక్‌ సిమ్‌ కార్డు. సాధారణ ఫోన్ల వినియోగదారులకు ఈ - సిమ్‌ అంటే తెలియక పోవచ్చు. ఈ - సిమ్‌ స్వాపింగ్‌ కోసం మెయిల్‌లో సైబర్‌ నేరస్థులు సర్వీస్‌ ప్రొవైడర్‌ ప్రతినిఽధులుగా పరిచయం చేసుకుని, కేవైసీ అప్‌డేట్‌ చేయాలని, బ్యాంకు ఖాతాల విలువైన సమాచారం సేకరిస్తూ డబ్బును తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు. కేవైసీ వివరాలను గూగుల్‌ ఫాంలో అందజేసేలా మాయచేస్తారు. ఒరిజినల్‌ ఈ - సిమ్‌ పనిచేయకపోవడంతో బాధితులకు తెలియకుండానే తమ అక్కౌంట్ల నుంచి డబ్బు మాయం కావడం గుర్తించడానికి చాలా సమయం పడుతుంది.


సైౖబర్‌ నిపుణులు ఏమంటున్నారంటే... 

  • ‘‘మీ సిమ్‌ స్థానంలో కొత్తది పొందడానికి చేసిన అభ్యర్థన ప్రక్రియ మొదలయింది’’  అంటూ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిన వెంటనే స్పందించాలి.
  • నెట్‌ వర్క్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. 
  • బ్యాంకు అధికారులకూ సమాచారం ఇవ్వాలి. 
  • చాలా సమయం వరకు మీ మొబైల్‌ నెం పనిచేయకపోతే అది సిమ్‌ స్వాపింగ్‌ జరిగిందనేందుకు సంకేతం కావచ్చు.
  • అపరిచితుల ఈ మెయిల్స్‌/ మెసేజీలకు స్పందించరాదు. మాటలతో మాయచేసి మీ ఖాతా వివరాలు తెలుసుకుని మోసం చేసే ప్రమాదం ఉంది. 
  • బ్యాంకు ఖాతా వివరాలను గూగుల్‌ ఫాంలో నింపొద్దు.
  • మీకు ఫోన్‌ ఎంత ముఖ్యమో మీ బ్యాంకు అకౌంట్‌ వివరాలు అంతకంటే ముఖ్యమని గుర్తించాలి. స్వాపింగ్‌ మోసం జరిగిందని గుర్తిస్తే  ాూౖ ఖిఐక్‌   అని టైప్‌ చేసి, నెట్‌ వర్క్‌ ప్రొవైడర్‌కు, కస్టమర్‌ కేర్‌కూ పంపండి.

నిపుణుల సూచనలు పాటించాలి...

ఆధునిక సైబర్‌ నేరాలు సిమ్‌ స్వాపింగ్‌, ఈ - స్వాపింగ్‌ల నివారణకు నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి. డిజిటల్‌/ఆన్‌లైన్‌ లావాదేవీల్లో మోసాలకు గురైన వారు, సైబర్‌ నేరాల బాధితులు ఎల్‌బీనగర్‌ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా 100కు డయల్‌ చేయవచ్చు. 9490617111కు వాట్సప్‌ చేయవచ్చు. 

- మహేష్‌ భగవత్‌, రాచకొండ కమిషనర్‌, అదనపు డీజీ, తెలంగాణ


ఖాతాల సమాచారం ఇవ్వొద్దు..

నెట్‌ బ్యాంకింగ్‌ చేసేవారు తరచూ తమ ఖాతాల విషయమై బ్యాంకు అధికారులను సంప్రదిస్తూ ఉండాలి. బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించే ప్రయత్నం చేసే అపరిచితులకు ఖాతాల సమాచారం ఇవ్వరాదు. అలాంటి ఫోన్లు వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

- హరినాథ్‌,  ఏసీపీ, ఎల్‌బీగర్‌ సైబర్‌ క్రైమ్స్‌.


స్వాపింగ్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

బ్యాంకింగ్‌ లావాదేవీల సమాచారం కోసం ఫోన్‌ నెంబర్లను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకునే వారు నిపుణుల సూచనలు పాటించాలి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో సైబర్‌ నేరాలపై, వాటి నివారణపైనా వెబినార్లు, వెబ్‌ పోస్టర్లు, వీడియోలతో అవగాహన కల్పిస్తున్నాం. సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి సందేహాలున్నా 18004256235కు కాల్‌ చేసిగానీ, ఠీఠీఠీ.ఐుఽజౌఖ్ఛిఛ్చిఠ్చీట్ఛుఽ్ఛటట.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా గానీ సమాచారం పొందవచ్చు.

- సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, అసోసియేట్‌ డైరెక్టర్‌ సీ డాక్‌, ఐఎస్‌ఈఏ ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-09-22T07:30:06+05:30 IST