కర్ఫ్యూ షురూ

ABN , First Publish Date - 2021-04-21T06:50:10+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడం, స్వయంగా సీఎం కేసీఆర్‌ కొవిడ్‌ బారినపడటంతో ప్రభుత్వం చకచకా నష్టనివారణ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూ మం గళవారం నుంచే అమలుచేయనున్నట్టు ఉత్తర్వులు ఇచ్చి అ మలును ప్రారంభించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కర్ఫ్యూ షురూ
రాత్రి కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారిన నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌

రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు

ఈ నెల 30వరకు కొనసాగింపు

నేటి నుంచి సినిమా థియేటర్లు పూర్తిగా బంద్‌

సాగర్‌ నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా


నల్లగొండ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడం, స్వయంగా సీఎం కేసీఆర్‌ కొవిడ్‌ బారినపడటంతో ప్రభుత్వం చకచకా నష్టనివారణ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూ మం గళవారం నుంచే అమలుచేయనున్నట్టు ఉత్తర్వులు ఇచ్చి అ మలును ప్రారంభించింది.  రాత్రి 8గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నేపథ్యంలో ఈనెల 21 నుంచి సినిమా థియేటర్లు మూతవేయాలని య జమానులు నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లను రాత్రి 8లోగా మూసివేయాల్సి ఉంటుంది. రాత్రి 9గంటల తరువాత కర్ఫ్యూ పటిష్ఠంగా అమలు చేస్తారు. అత్యవసర సర్వీసులు,పెట్రోల్‌ బంక్‌లు, మీడియాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ మినహాయింపు పొందిన వారు పోలీసులకు ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు టికెట్లను దగ్గర ఉంచుకోవాలి. పోలీసులు నిలిపినప్పుడు వాటిని చూపించాల్సి ఉంటుంది. అంతర్‌ రాష్ట్ర ప్ర యాణాలు యథావిధిగా కొనసాగుతాయి. కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రిపూట కర్ఫ్యూ మంగళవారం నుంచే అమలులోకి వచ్చిందని ఎస్పీ రంగనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమనాతోపాటు కేసు నమోదు చేసి చట్టపర చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు.


నేటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌

కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు ఈ నెల 21 నుంచి బంద్‌ చేయాలని యజమాన్యాలు నిర్ణయించాయు. కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రదర్శనలు నిలిపేయాలని నిర్ణయించినట్టు థియేటర్ల అసోసియేషన్‌ నాయకులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని 40 థియేటర్లు మూతపడనున్నాయి. అందులో పనిచేసే ఉద్యోగులకు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు అనివార్యంకానున్నాయి.


సాగర్‌లో కరోనా విజృంభణ

సాగర్‌ ఉప ఎన్నిక పుణ్యాన తండాలు, పల్లెలు, పట్టణాలు జ్వరాలతో మంచమెక్కాయి. సాగర్‌ కమలా నెహ్రూ ఆస్పత్రిలో మంగళవారం 179 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ సంఖ్య ఓ రికార్డని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ ఆస్పత్రిలో 10 నుంచి 20 వరకు కేసులు నమోదవుతుంటాయి. సాగర్‌ నియోజకవర్గంలోని త్రిపురారంలో పీహెచ్‌సీలో మంగళవారం 71 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌, పెద్దవూర మండలంలో సోమవారం 71 కేసులు నమోదు కాగా, మంగళవారం 40 కేసులు నిర్ణారణ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే గేమ్యా తండాలో 35 కేసులు నమోదయ్యాయి. తిరుమలగిరి మండలం నెల్లికల్లు గ్రామంలో 150 మందికి పరీక్షలు చేయగా 46 మందికి పాజిటివ్‌ వచ్చింది. జమ్మనకోట తండాలో 100 పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌ నమోదైంది. తిరుమలగిరి సాగర్‌ మండలంలో మొత్తం 77 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. హాలియా పీహెచ్‌సీ పరిధిలో 113 మందికి పరీక్షలు నిర్వహించగా, 38 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. గుర్రంపోడు మండలంలో 93మందికి పరీక్షలు చేయగా, 23 మందికి పాజిటివ్‌ వచ్చింది. పీఏ.పల్లి మండలంలో మంగళవారం 25 కేసులు నమోదుకాగా, ఒక్క పిల్లిగుంటతండాలో సోమ, మంగళవారం కలిపి 25 కేసులు నమోదయ్యాయి. నిడమనూరులో 171 మందికి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మంగళవారం మొత్తం 250 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రెండు రోజుల్లో 410 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


యాదాద్రి జిల్లాలో ఒకరి మృతి

కరోనా యాదాద్రి జిల్లాలో ని మోటకొండూరు మండల కేం ద్రంలో విద్యుత్‌శాఖలో పనిచేసే ఓ అధికారి కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1448 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 3243 మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 836 పాజిటివ్‌ వచ్చింది. యాదాద్రి జిల్లాలో 1345 మందికి పరీక్షలు నిర్వహించగా, 339 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సూర్యాపేట జిల్లాలో 1835 మందికి పరీక్షలు నిర్వహించగా, 273 మందికి పాజిటివ్‌ వచ్చింది.


సినిమాలే లేవు : బండారు ప్రసాద్‌, తిరుమల థియేటర్‌ యజమాని, నల్లగొండ

కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. బడ్జెట్‌ వర్కవుట్‌ కాదనే కారణంతో సినిమాలు రిలీజ్‌ కావడం లేదు. పెద్ద హీరోల సినిమాలు లేకుండా థియేటర్లు నడపలేం. దీనికి తోడు కరోనా విజృంభణ. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు బంద్‌ పాటించాలనే నిర్ణయం సరైందే.



కర్ఫ్యూ అమలుకు సహకరించాలి : ఏవీ.రంగనాథ్‌, ఎస్పీ

కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.87 ప్రకారం మంగళవారం రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 5 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార సంస్థలు అన్నీ బంద్‌ పాటించాలి. అత్యవసర ప్రయాణాలు చేసేవారు టికెట్లను దగ్గర ఉంచుకోవాలి. కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందినవారు ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. కర్ఫ్యూ నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.


కరోనా విస్తరించకుండా కర్ఫ్యూ : ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కలెక్టర్‌

కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాం. రాత్రి గంటలకే కార్యాలయాలు, థియేటర్లు, దుకాణాలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలి. కర్ఫ్యూను వంద శాతం అమలు చేసేలా రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో ప్రత్యేక బృందాలు నియమించాం. రాత్రి వేళ బయట తిరగడం నిషేధం. దీన్ని అందరూ పాటించాలి. అత్యవసర సర్వీసు ల్లో పనిచేస్తున్నవారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. వారు పాస్‌లు తీసుకోవాలి. అంతరాష్ట్ర రవాణా, ఆస్పత్రులకు వైద్యం కోసం వెళ్లేవారికి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కర్ఫ్యూ నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.

Updated Date - 2021-04-21T06:50:10+05:30 IST