సాగు.. బాగు

ABN , First Publish Date - 2020-07-09T11:57:24+05:30 IST

జూన్‌లో కురిసిన వర్షాలు రైతుల్లో ఆశలు నింపగా, ఈనెలలో మొదటి వారంలో కురిసిన వర్షం రైతుల్లో ఉత్సాహం ..

సాగు.. బాగు

పంటల సాగులో పెరిగిన వేగం

జిల్లాలో బంట్వారం  టాప్‌

మొక్కజొన్నపై రైతులకు తగ్గని మమకారం

ఐదు వేలకుపైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగు

కురుస్తున్న వర్షాలతోఅన్నదాతల్లో ఆనందం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/తాండూరు రూరల్‌: జూన్‌లో కురిసిన వర్షాలు రైతుల్లో ఆశలు నింపగా, ఈనెలలో మొదటి వారంలో కురిసిన వర్షం రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షం కురిసింది. ఈనెల 2వ తేదీ వరకు జిల్లాలో 76 శాతం మేర పంటలు సాగు చేయడం విశేషం. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 4,25,399.32 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 3,62,078 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పత్తి అంచనా సాగు విస్తీర్ణం 2,13,192 ఎకరాలు ఉండగా, 2,01,275 ఎకరాల్లో సాగు చేశారు. కంది 1,75,900 ఎకరాలకు గాను 1,14,149 ఎకరాల్లో విత్తారు. పెసర సాగు లక్ష్యం 20,800 ఎకరాలు ఉండగా, 16,332 ఎకరాల్లో సాగు చేశారు. మినుము పంట 9,500 ఎకరాలకు గాను 8,088 ఎకరాల్లో సాగైంది. జొన్న 15 వేల ఎకరాలకు 7,994 ఎకరాల్లో సాగు చేశారు. ఆముదం 761 ఎకరాలకు 58 ఎకరాల్లోనే సాగు చేయగలిగారు. సోయా 2,047 ఎకరాలకు 1,594 ఎకరాల్లో సాగు చేశారు.


జిల్లాలో 6,508 ఎకరాల్లో చెరుకు సాగు చేయాలన్న లక్ష్యంలో ఇంతవరకు 5,813 ఎకరాలు సాగైంది. రాగి 217 ఎకరాలకు 68 ఎకరాల్లో సాగు చేశారు.  వేరుశనగ 1,300 ఎకరాలకు కేవలం 248 ఎకరాల్లోనే సాగు చేశారు. ఇతర ఆహార ధాన్యాలు 536 ఎకరాలకు 583 ఎకరాల్లో సాగు చేయగా, ఇతర తృణ ధాన్యాలు 328 ఎకరాలకు గాను 179 ఎకరాల్లో సాగు చేశారు. ఇదిలా ఉంటే, 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, 2 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కురుస్తున్న వర్షాలతో ఈ వారంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. 


సాగులో బంట్వారం ముందంజ

వానాకాలం పంటల సాగులో జిల్లాలో బంట్వారం మండలం 116 శాతంతో ముందు వరుసలో ఉండగా, దోమ మండలం 38 శాతం సాగుతో చివరి స్థానంలో నిలిచింది. బంట్వారం మండలం అంచనా సాగు విస్తీర్ణం 14,208 ఎకరాలు ఉండగా, 16,430 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పూడూరు మండలంలో అంచనా సాగు 26,331 ఎకరాలు ఉండగా, 27,714 ఎకరాల్లో పంటలు సాగు చేసి లక్ష్యం అధిగమించారు. కోట్‌పల్లిలో 16,731 ఎకరాలు అంచనా సాగు విస్తీర్ణం ఉండగా, 16,632 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మోమిన్‌పేట్‌లో 22,598 ఎకరాలకు 20,568 ఎకరాలు, నవాబుపేటలో 21,399 ఎకరాలకు 19,548 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ధారూరులో 20,015 ఎకరాలకు 16,751 ఎకరాలు, మర్పల్లిలో 29,433 ఎకరాలకు 24,188 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.


పెద్దేముల్‌లో 35,312 ఎకరాల్లో 27,700 ఎకరాలు సాగు చేయగా, బొంరాస్‌పేట్‌ మండలంలో 30,045 ఎకరాలకు 23,007 ఎకరాల్లో సాగు చేశారు. కొడంగల్‌ మండలంలో 45,623 ఎకరాలకు 34,240 ఎకరాల్లో సాగు చేయగా, వికారాబాద్‌ మండలంలో 23,816 ఎకరాలకు 17,736 ఎకరాలు సాగు చేశారు. దౌల్తాబాద్‌లో 34,048 ఎకరాలకు 24,208 ఎకరాల్లో సాగైంది. బషీరాబాద్‌లో 34,373 ఎకరాలకు 24,672 ఎకరాల్లో సాగు చేయగా, కులకచర్లలో  14,626 ఎకరాలకు 9,887 ఎకరాల్లో సాగు చేశారు. యాలాల మండలంలో 29,668 ఎకరాలకు 18,471 ఎకరాల్లో సాగు చేయగా, పరిగి మండలంలో 33,206 ఎకరాలకు 19,425 ఎకరాలు సాగు చేశారు. తాండూరులో 31,510 ఎకరాలకు 15,846 ఎకరాల్లో సాగు చేయగా, దోమ మండలంలో 13,341 ఎకరాలకు 5,056 ఎకరాలు సాగు చేశారు. 


మొక్కజొన్నపై తగ్గని మమకారం..

ఇదిలా ఉంటే, ఈ వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినా... రైతులకు మొక్కజొన్న పంటపై ఆసక్తి తగ్గలేదు. జిల్లాలో 5,696 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి ఆ పంట పట్ల తమ మమకారం చాటుకున్నారు. ప్రభుత్వం మాట పెడచెవిన పెట్టి మొక్కజొన్న సాగు చేస్తే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని, రైతుబంధు కూడా వర్తించదని హెచ్చరిక చేసినా... జిల్లాలో 5 వేల ఎకరాలకు పైగానే సాగు చేయడం గమనార్హం. జిల్లాలో అత్యధికంగా పరిగి వ్యవసాయ డివిజన్‌ పరిధిలో 4,068 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు.


వికారాబాద్‌ డివిజన్‌ పరిధిలో 1,096 ఎకరాలు సాగు చేయగా, తాండూరు పరిధిలో 532 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మండలాల వారీగా చూస్తే పూడూరులో 3,011 ఎకరాలు, పరిగిలో 863 ఎకరాలు, యాలాల్‌లో 532, వికారాబాద్‌లో 455, నవాబ్‌పేట్‌లో 372, ధారూరులో 136, మర్పల్లిలో 121, దోమలో 101, కులకచర్లలో 93, పెద్దేముల్‌లో 72,  కోట్‌పల్లిలో 12 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. 

Updated Date - 2020-07-09T11:57:24+05:30 IST