జోరందుకున్న మెట్ట పంటల సాగు

ABN , First Publish Date - 2020-07-11T11:38:02+05:30 IST

జిల్లాలో మెట్ట పంటల సాగు జోరందుకుంది. వర్షాలు సకాలంలో కురుస్తుండడం రైతులకు కలిసొచ్చింది. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ,

జోరందుకున్న మెట్ట పంటల సాగు

గుజరాతీపేట, జూలై 10: జిల్లాలో మెట్ట పంటల సాగు జోరందుకుంది. వర్షాలు సకాలంలో కురుస్తుండడం రైతులకు కలిసొచ్చింది. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి, కొర్ర, సామ, కంది, జొన్న, గంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. 929 హెక్టార్లలో మొక్కజొన్న, 256 హెక్టార్లలో పత్తి, 20 హెక్టార్లలో వేరుశనగ వేశారు. 900 హెక్టార్లలో రాగి, కొర్ర, సామ, కంది, జొన్న, గంటి వంటి చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది. పొలాల గట్లపై వేసేందుకు 110 క్వింటాళ్ల కంది విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ఉచితంగా అందజేశారు. రాగి, కొర్ర, సామ,  జొన్న, గంటి వంటి చిరుధాన్యాల విత్తనాలు సుమారు 45 క్వింటాళ్లను సీతంపేట ఐటీడీఏ ద్వారా రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రైతులు ఈ పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు.

 

2.10 లక్షల హెక్టార్లలో వరి

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.10 లక్షల హెక్టార్లలో వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 66 వేల క్వింటాళ్ల విత్తనాలను 1,56,500 మంది రైతులకు  సబ్సిడీపై అందజేశారు. రైతులు నారుమళ్లను తయారు చేసి విత్తనా లను చల్లే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 1656 హెక్టార్ల విస్తీర్ణంలో ఎదలు చల్లారు. పచ్చి రొట్ట కింద సాగు కోసం జిల్లా వ్యవసాయ శాఖ  రెండు వేల క్వింటాళ్ల కట్టె జనుం, జీలుగ విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసింది.  ‘ఇటీవల కురిసిన వర్షాలు అన్ని రకాల పంటలకు అనుకూలమే. ఇప్పటికే వర్షాధారంగా సాగు చేపట్టిన మెట్ట పంటలు, చిరుధాన్యాల పంటలకు ఎంతగానో ఉపయోగకరం. వరినారు మళ్ల తయారీకి బాగుంటుంది’ అని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-11T11:38:02+05:30 IST