సాగు భారం

ABN , First Publish Date - 2021-06-13T04:46:19+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఇదే సమయంలో పంటల సాగుపై అన్నదాతలు మదనపడుతున్నారు. ప్రతీ ఏటా పెరుగుతున్న పెట్టుబడులే ఇందుకు ప్రధాన కారణం.

సాగు భారం
ట్రాక్టర్‌తో సాగు పనులు చేస్తున్న రైతులు

- జిల్లాలో 4.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- భారీగా పెరిగిన ధరలు
- దుక్కులపై తీవ్ర ప్రభావం
- పెరిగిన కూలీల రేట్లు
- ఏటేటా పెరుగుతున్న ధరలతో రైతుల్లో ఆందోళన


కామారెడ్డి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి):
వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఇదే సమయంలో పంటల సాగుపై అన్నదాతలు మదనపడుతున్నారు. ప్రతీ ఏటా పెరుగుతున్న పెట్టుబడులే ఇందుకు ప్రధాన కారణం. ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి.. మరోవైపు పెరుగుతున్న ధరలతో.. రైతులకు సాగు భారం అవుతోంది. కాడెద్దుల నుంచి దాదాపు యాంత్రికీకరణకు అలవాటుపడిన అన్నదాతలకు ఇంధన  ధరలు తలకు మించిన భారం అవుతున్నాయి. గత ఏడాది వానాకాలం సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు అకాల వర్షాలు, మద్దతు ధర రాక నష్టాలు చవి చూశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల దిగుబడులు ఎక్కువగా వచ్చినా సరైన సమయంలో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది రైతుల వద్దే పంటల ఉత్పత్తులు ఉండిపోయాయి. ఇప్పటికీ మక్కలు, జొన్నలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంధనం, కూలీల ధరలతో పాటు కౌలు కూడా అమాంతంగా పెరగడంతో పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి.
జిల్లాలో అత్యధికంగా వరి సాగు
జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో ఎక్కువగా వరి పంట సాగు కానుంది. ఈ సీజన్‌లో 4.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీంతో ఎక్కువగా వరి 2.42 లక్షల ఎకరాల్లో సాగవుతుందని, 70వేల ఎకరాల్లో పత్తి, 55వేల ఎకరాల్లో సోయాబిన్‌, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35వేల ఎకరాల్లో కంది, 295 ఎకరాల్లో జొన్నలు, 18వేల ఎకరాల్లో పెసర్లు, 11వేల ఎకరాల్లో మినుములు, 9 వేల ఎకరాల్లో చెరుకు పంటలు సాగవుతాయని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు ముందు పెట్టుబడుల ఖర్చుల కోసం ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన కూలీ రెట్లు
పంటల సాగు విషయంలో పెట్టుబడుల కోసం వేలలో, లక్షలో ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన డీజిల్‌ ధరలతో పాటు కూలీ రేట్లు సైతం పెరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు చేయడానికి నాట్లు వేసేందుకు కలుపు తీసేందుకు, ఎరువులు చల్లేందుకు తదితర పనులకు స్థానికంగా కూలీలు దొరకడం లేదు. అయితే వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పనులు చేయించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కూలీ రేట్లు రూ.200 నుంచి 300 వరకు పెరిగాయి. అదనంగా కూలీలను తీసుకువచ్చేందుకు ట్రాన్స్‌ఫోర్ట్‌కు వెచ్చించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. అధిక కూలీ ఇస్తామని చెబుతున్న వ్యవసాయ పనులకు కూలీలు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.
విరివిగా యంత్రాల వినియోగం
గత ఏడాది వానాకాలం సీజన్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.74 ఉండేది. ప్రస్తుతం లీటరు రూ.100కు చేరువవుతోంది. సాగులో ట్రాక్టర్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో యజమానులు అమాంతంగా రేట్లు పెంచుతున్నారు. గత ఏడాది కల్టివేటర్‌కు రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.800 వసూలు చేస్తున్నారు. దుక్కులకు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో అధి కాస్తా రూ.1000దాటే అవకాశం లేకపోలేదని ట్రాక్టర్‌ యజమానులు చెబుతున్నారు. పొడి దుక్కులకు ఒక ధర, తడి దుక్కి పంటలకు మరో ధర నిర్ణయిస్తున్నారు. ఎకరం దున్నేందుకు సుమారు 5 లీటర్ల డీజిల్‌ అవసరమవుతుందని పెరిగిన ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక కేజ్‌విల్‌ దమ్ముకొట్టేందుకు రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకొని ట్రాక్టర్‌ వినియోగానికే రూ.10వేల వరకు ఖర్చు అవుతోంది. కేవలం దుక్కులు దున్నేందుకే కాకుండా యంత్రాలను వరి కోతలు, పురుగుల మందుల పిచికారీ వేసేందుకు వాడే స్ర్పేలు, పంటల్లో కలుపు నివారణకు యంత్రాలను విరివిగా వాడుతున్నారు. దీంతో రైతుకు అదనంగా భారం పడనుంది.

డీజిల్‌ ధరలు పెరగడంతోనే..
- శంకర్‌రావు, రైతు, అమర్లబండ
గత ఏడాది కంటే ఈ సారి డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర రూ.100కు దగ్గరలో ఉంది. దీంతో పంట పొలాల్లో దుక్కులు దున్నడం నుంచి మొదలుకొని వరి కోతలు చేసే వరకు యంత్రాల సహాయం తప్పనిసరి కానుంది. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల యంత్రాల ధరలు సైతం యజమాన్యాలు భారీగా పెంచాయి. యంత్రాల వినియోగానికే పంటల సాగులో ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా చివరకు పెట్టుబడులు కూడా రావడం లేదు.

ఎకరం దున్నేందుకే రూ.5వేలు ఖర్చు చేశాం
- ఏనుగు గంగారెడ్డి, రైతు, సదాశివనగర్‌
గత ఏడాది మూడు ఎకరాలకు రూ.15వేల పెట్టుబడి అయింది. కానీ ఇంధన ధరలు పెరగడంతో మరో రూ.5 వే లు పెరుగుతాయి. ఇప్పటికే మూడు ఎకరాలను దున్నినందుకు రూ.5వేల వరకు ఖర్చు అయింది. విత్తనాలు వేసేందుకు మరో రూ.4 వేలు అవుతోంది. విత్తనాలు, ఎరువులు కలిపి మరో 6 వేల వరకు ఖర్చు అవుతోంది.

Updated Date - 2021-06-13T04:46:19+05:30 IST