West Bengal : విద్యా శాఖ మంత్రిని రాత్రి 8 గంటలకు ప్రశ్నించండి : కలకత్తా హైకోర్టు

ABN , First Publish Date - 2022-05-18T02:11:22+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు

West Bengal : విద్యా శాఖ మంత్రిని రాత్రి 8 గంటలకు ప్రశ్నించండి : కలకత్తా హైకోర్టు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని కలకత్తా హైకోర్టు (Calcutta high court) మంగళవారం ఆదేశించింది. ఈ దర్యాప్తునకు మంగళవారం రాత్రి 8 గంటలకు హాజరుకావాలని విద్యా శాఖ మంత్రి పరేష్ చంద్ర అధికారిని ఆదేశించింది. బబిత సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. 


విద్యా మంత్రి పరేష్ చంద్ర అధికారి (Paresh Chandra Adhikari) కుమార్తె అంకిత (Ankita) 2018లో టీచర్‌గా నియమితులయ్యారని, ఆమెకు తన కన్నా తక్కువ మార్కులు వచ్చినప్పటికీ, ఆమెను ఈ ఉద్యోగంలో నియమించారని పిటిషనర్ బబిత ఆరోపించారు. 


బబిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ విలేకర్లకు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ధర్మాసనం ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. మంగళవారం రాత్రి 8 గంటలకు CBI  సమక్షంలో హాజరుకావాలని పరేశ్‌ను ఆదేశించింది. 


టీఎంసీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ విలేకర్లతో మాట్లాడుతూ, తప్పు తప్పేనని, ఒప్పు ఒప్పేనని అన్నారు. తాను కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేయబోనన్నారు. అయితే ఆదేశాలిచ్చేటపుడు కోర్టు తన పరిధిని దాటకూడదన్నారు. ఎవరు మంత్రిగా ఉండాలో, ఎవరిని మంత్రి పదవి నుంచి తొలగించాలో కోర్టు చెప్పకూడదని చెప్పారు. అది ముఖ్యమంత్రి విశేషాధికారమని తెలిపారు. 


పిటిషనర్ బబిత సర్కార్ హైకోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఆమెకు 77 మార్కులు లభించాయి. అంకితకు కేవలం 61 మార్కులు లభించాయి. అయినప్పటికీ అంకితకు టీచర్ ఉద్యోగం లభించింది. 


దీనిపై బీజేపీ స్పందిస్తూ, పరేశ్ లెఫ్ట్ ఫ్రంట్‌ను వదిలి 2018లో టీఎంసీలో చేరారని, ఆ తర్వాతే ఆయన కుమార్తె అంకితకు టీచర్ ఉద్యోగం వచ్చిందని ఆరోపించింది. 


Updated Date - 2022-05-18T02:11:22+05:30 IST